Read more!

రెండు కాళ్ల సిద్ధాంతం.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ ది రెండు కాళ్ల సిద్ధాంతం.. ఒక కాలు అమరావతిలో.. మరొక కాలు విశాఖపట్నంలో.. రెండు కాళ్ల సిద్దాంతంతో  రాజకీయ ప్రయోజనాల కోసం  ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.. ఇది టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. రాజధాని విషయంలో  జగన్ డబుల్ రోల్ ను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు లోకేష్.  

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది. ప్రధాన పార్టీలన్ని జోరుగా జనంలోకి వెళుతున్నాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ సర్కార్ పై ఘాటు  వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెడ్డి రెండు వైపులా ఉంటారని లోకేష్ విమర్శించారు. ఒకవైపు మూడు రాజధానులు అంటారని, మరోపక్క విశాఖకు కార్యాలయాలు తరలిస్తారని అన్నారు. ఏ2 విజయసాయిరెడ్డికి విశాఖలో ఏం పని? ప్రశ్నించారు నారా లోకేష్. విశాఖలో దోచుకోడానికి వచ్చారా? అని అన్నారు. 

టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పార్టీ మారిపోతారంటూ.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.మున్సిపల్  ఎన్నికల్లో అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను తయారు చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు  మూతపడ్డాయన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మళ్లీ అన్న క్యాంటీన్లు తెరుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెంచుతామన్న ఇంటిపన్నును రద్దు చేస్తామన్నారు.

ఏపీలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నా... ఫోకస్ అంతా  విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లపైనే ఉంది.  ఏపీ రాజధాని అమరావతికి దగ్గరలో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు ఉండగా... జగన్ రెడ్డి ప్రతిపాదించిన పరిపాలనా రాజధాని విశాఖపట్నం. అందుకే ఈ మూడు నగరపాలక ఎన్నికలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయవాడ, గుంటూరులో గెలిచి.. అమరావతి రాజధానికే ప్రజలు మద్దతు ఉందని చూపించాలనే ప్రయత్నాల్లో టీడీపీ ఉంది. విశాఖలోనూ విజయం సాధించి.. ఉత్తరాంధ్ర జనం కూడా అమరావతికే జైకొడుతున్నారని చెప్పే ప్రయత్నంలో ఉంది. అధికార వైసీపీ కూడా విశాఖను గెలవడంతో పాటు విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ను కైవసం చేసుకుని.. మూడు రాజధానుల ప్రతిపాదనకే ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని నిరూపించాలనే యోచనలో ఉంది. అందుకే ఈ మూడు నగరాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.