Read more!

మెగా హీరోకు భలే చౌక బేరం..రూ.24 కోట్ల భూమి 3.8 కోట్లకే ధారాదత్తం!

జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ హీరో చిరంజీవికి కారు చౌకగా 595 గజాల స్థలాన్ని కట్టబెట్టిన కుంభకోణం వెనుక ఉన్న పెద్దల పాత్రపై రోజుకో  పేరు తెరపైకి వస్తోంది. కుంభకోణం వెనుక పెద్దల హస్తంపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ  గత 20 ఏళ్లుగా   జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే ఆ దర్యాప్తు ప్రారంభం కాకుండానే మరో భూ బాగోతం వెలుగులోనికి వచ్చింది.  మెగా హీరోకు ‘చిరు’ ధరకే సొసైటీకి చెందని స్థలాన్ని, అదీ ప్రభుత్వ   భూమిని సొసౌటీ  ఉదారంగా విక్రయించేసిన వైనం కలకలం రేపుతోంది.  వివరాలలోకి వెడితే.. చిరంజీవి గతంలో సొసైటీలోనే కొనుగోలు చేసిన స్థలం (ప్లాట్ నం.303 ఎన్)కు ఆనుకుని 595 గజాల స్థలం ఉంది. అయితే అది సొసైటీకి చెందిన స్థలం కాదు. సొసైటీ లే ఔట్ లో కూడా లేదు. అయినా కూడా సొసైటీ దానిని మెగాస్టార్ చిరంజీవికి గత అమ్మేసింది. గత నెల 20న రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. అదీ అలా ఇలా కాదు కారు చౌకగా... బహిరంగ మార్కెట్ లో ఈ భూమి గజం విలువ నాలుగు లక్షల వరకూ ఉంది. అంటే సొసైటీ చిరంజీవికి అమ్మేసిన 595 గజాల స్థలం విలువ రమారమి 24 కోట్ల రూపాయలు. అంత విలువైన భూమిని సొసైటీ మెగాస్టార్ చిరంజీవికి గజం 64 వేల చొప్పున కేవలం 3.80 కోట్ల రూపాయలకే విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసింది. సొసైటీ గత అక్రమాలపై ప్రభుత్వం విచారణకు సన్నద్ధమౌతుండగా కొత్తగా తెరపైకి వచ్చిన ఈ భూ బాగోతం సంచలనం సృష్టించింది. పైగా ఈ బాగోతంలో చిరంజీవి భాగస్వామి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

గత పాలక మండలి అక్రమాలపై ఫిర్యాదు చేసిన ప్రస్తుత పాలక మండలే నిబంధనలకు గాలికొదిలేసి ‘చిరు’ ధరకు కోట్లాది రూపాలయలు విలువ చేసే భూమిని మెగా స్టార్ కు ధారాదత్తం చేయడం  వెనుక పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  ఈ భూ దందాపై ఇప్పటికే సంబంధిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇప్పుడు కారు చౌకగా మెగాస్టార్ చిరంజీవికి సొసైటీ  ‘చిరు’ ధరకే కట్ట బెట్టిన 595 చదరపు గజాల స్థలం చిరంజీవికి ఇప్పటికే సొసైటీలో ఉన్న 3333 చదరపు గజాల ప్లాట్ కు ఆనుకునే ఉంది.  అయితే చిరంజీవి ఇప్పుడు సొసైటీ నుంచి కొనుగోలు చేసిన 595 చదరపు గజాల స్థలం అసలు సొసైటీ స్థలమే కాదు. అయినా సొసైటీ దర్జాగా దానికి మెగాస్టార్ కు విక్రయించేసింది. ఈ బాగోతం బైట పడటంతో ప్రస్తుత సొసైటీ అది తమ తప్పు కాదు..పాత గవర్నింగ్ బాడీయే అప్రూవల్ చేసిందని చెప్పుకొస్తున్నది. అయితే గత సొసైటీ తప్పిదమైతే  ప్రస్తుత సొసైటీ దానిని రద్దు చేసే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదన్న ప్రశ్న ఉత్పన్నమౌతున్నది. 


గత 20 ఏళ్లుగా జూబ్లీహిల్స్  కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అక్రమాలపై ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తుతుంటే...వాటిపై విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత కూడా కొత్తగా మరో కుంభకోణం చోటు చేసుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని అంటున్నారు.  ఇక చిరంజీవికి ఈ భూమి సొసైటీది కాదని తెలియక కొన్నారని కొందరు చేస్తున్న వాదన సబబుగా లేదు.   తాను కొత్తగా కొన్న 595 చదరపు అడుగుల భూమి, తనకు ఇప్పటికే సొసైటీలో ఉన్న స్థలానికి ఆనుకునే ఉంది. ఆ భూమిని ఆయన 1999లోనే కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్  20న ఈ తాజా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంత కాలం తన స్థలానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం సొసైటీదో కాదా ఆయనకు తెలియదంటే నమ్మశక్యం కాదని సొసైటీ సభ్యులు అంటున్నారు. అన్నీ, అందరికీ తెలిసే ఈ అక్రమ భూ బాగోతం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని   సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.