Read more!

కేజ్రీవాల్ తర్వాతి టార్గెట్ ఎవరు?

 

 

సామాజిక కార్యకర్తగా పోరాటం మొదలుపెట్టి సొంత పార్టీ పెట్టి ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్స్ ని పాతా కొత్తా తేడా లేకుండా ఏకి పారేస్తున్న కేజ్రీవాల్ ఇప్పుడు దేశంలోని ప్రథాన పార్టీలు, నేతలకి కొరకరాని కొయ్యగా మారారు. కేజ్రీవాల్ నోరు తెరుస్తున్నాడంటే రాజకీయ నేతలకు వణుకుపుడుతోంది.

 

సమాచార చట్టం ఆధారంగా పక్కా వివరాలు సేకరించి పెట్టుకున్నాకే, అన్ని ఆధారాలతో కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలమీద విరుచుకుపడుతున్నారు. ఆటుమొన్న సల్మాన్ ఖుర్షీద్, మొన్న రాబర్ట్ వాద్రా, నిన్న గడ్కరీ.. మరి ఇవాళ ఎవరి వంతో..?

 

కేజ్రీవాల్ నోరు తెరిస్తే ఎప్పుడు ఏ పేరు కంపైపోతుందోనని జనం తెగ టెన్షన్ పడి చస్తున్నారు. ఏకడమంటూ మొదలుపెడితే చివరికంటా నిలబడాలనేది కేజ్రీవాల్ స్ట్రేటజీగా కనిపిస్తోంది. అందుకే.. అంబానీ లాంటి కార్పొరేట్ల కబంధ హస్తాల్లో చిక్కుకు పోయారంటూ ప్రథాని మన్మోహన్ మీదకూడా కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు.

 

 

కేజ్రీవాల్ దగ్గర ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలున్నాయనీ, అందుకే ఆయన అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారనీ ఆర్మీ మాజీ చీఫ్ వి.కె.సింగ్ కూడా ప్రకటించాక జనంలో పిచ్చగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలపై నిష్ఫాక్షికంగా విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గుతేలతాయని సింగ్ అంటున్నారు.

 

కాంగ్రెస్ నేతల్ని ఇన్నాళ్లూ దగాకోరులుగా చిత్రీకరిస్తూ తాము సుద్దపూసలమన్నట్టు ఫోజు పెట్టిన భారతీయ జనతా పార్టీ నేతలుకూడా ఇప్పుడు గడ్కరీపై కేజ్రీచేసిన ఆరోపణలతో తోకలు ముడిచారు. పూర్తి సుగర్స్  సంస్థలో పెట్టిన పెట్టుబడులన్నీ పూర్తిగా బినామీలేనన్న సంగతి దేశం మొత్తానికీ తెలిసిపోవడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి.