Read more!

మద్యం కుంభకోణం కీలక సూత్రధారి కవిత.. కోర్టుకు తెలిపిన సీబీఐ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తెలంగాణ  మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిండా మునిగినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐలు కవితను ఇప్పటికే అరెస్టు చేశాయి. మద్యం కుంభకోణంలో కవితే కీలక సూత్రధారి అని ఆ రెండు దర్యాప్తు సంస్థలూ కూడా చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్‌లు, ఈ మెయిల్స్ పత్రాలను కూడా ఆ సంస్థలు కోర్టుకు సమర్పించాయి.

తాజాగా  లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో  శుక్రవారం (ఏప్రిల్ 12) హాజరు పరిచి  ఐదు రోజుల కస్టడీకి  కోరింది. ఈ సందర్భంగా కోర్టులో కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.  విజయ్ నాయర్ తో పాటు పలువురితో  కలిసి కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం.. ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమమవుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది.   సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు సమీకరించి ఆ సొమ్మును కవితే ఆప్ నేతలకు కవిత అందించారని సీబీఐ కోర్టుకు తెలిపింది.

కవిత సూచన మేరకే మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాతిక కోట్ల రూపాయలు ఇచ్చారని  పేర్కొంది. ఇందుకు సంబంధించి వాట్సాప్ చాట్‌లను ధృవీకరణగా చూపింది.  మరో వైపు ఈడీ కూడా దాదాపు ఇవే అంశాలను సాక్ష్యాలతో సహా కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. ఈడీ అందించిన వివరాలు, ఆధారాల మేరకు కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిలును తిరస్కరించిన సంగతి తెలిసిందే. మధ్యంతర బెయిలు తిరస్కరించిన సందర్భంగా న్యాయమూర్తి   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయంపై ఈడీ ఆధారాలు చూపిందని పేర్కొన్నారు.

అంతే కాకుండా దేశ విదేశాలలో ఉన్నత  చదువులు చదువుకుని,  భారత్‌ జాగృతి సంస్థకి అధ్యక్షురాలుగా మహిళలను చైతన్యపరిచిన కవిత, ఒక ఎంపీగా పార్లమెంటులో పలు స్టాండింగ్ కమిటీలలో పని చేశారనీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనీ అటువంటి ఆమె అమాయకంగా మద్యం కేసులో తనను ఎవరో ఇరికించారంటే విశ్వసించజాలమని స్పష్టం చేసింది.   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉన్నట్లు  ఈడీ బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిందనీ, విచారణకు ఆమె సహకరించలేదనడానికీ ఈడీ ఆధారాలు సమర్పించిందనీ, ఆమె ఈడీకి స్వాధీనం చేసిన మెబైల్ ఫోన్లలో డేటాను తొలగించారని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొందని చెప్పారు.  వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని చూస్తే కవితకు ఇప్పట్లో బెయిలు వచ్చే అవకాశాలు మృగ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.