Read more!

బయటపడిన జగన్ బటన్ నొక్కుడు బండారం!

జగన్ బటన్ నొక్కుడు బండారం సందేహాలకు అతీతంగా బట్టబయలైపోయింది. ఎన్నికల లబ్ధి కోసమే ఆయన బటన్ నొక్కుడు వ్యవహారం అంతా సాగిందని సామాన్యులకు కూడా అర్ధమైపోయింది. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే వ్యూహంతోనే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ బటన్ నొక్కుడు సభలు నిర్వహించారని తేటతెల్లమైపోయింది. బటన్ నొక్కిన 24 గంటల లోగా లబ్ధిదారుల ఖాతాలలో పడాల్సిన సొమ్ము పడలేదని తేలిపోయింది. అంటే సంక్షేమం సొమ్ము పందేరం చేస్తున్నానంటూ గత మూడు నెలలుగా ఆయన నిర్వహించిన బటన్ నొక్కుడు సభలన్నీ ఎన్నికల ప్రచారం కోసమే కానీ, సొమ్మును లబ్ధి దారుల ఖాతాలలో సొమ్ములు వేయడానికి కాదని ఎన్నికల కమిషన్ బట్టబయలు చేసింది. 

ఇంత కాలం బటన్ నొక్కాను సొమ్ములు పందేరం చేశాను అంటూ జగన్ సొంత సొమ్ములేవో జనాలకు పంచేసినట్లుగా బిల్డప్ ఇచ్చుకున్నారు.పాలన అంటే కేవలం సంక్షేమ పథకాల బటన్లు నొక్కడమే  అన్నట్లుగా వ్యవహరించారు. ఇక తన అధికారం చరమాంకానికి వచ్చిన దశలో కూడా  అదే బటన్ నొక్కడానికి అంటే ఒక బటన్ కాదు, గతంలో నొక్కిన ఆరు బటన్లకు సంబంధించిన సొమ్మును సరిగ్గా ఎన్నికల వేళ లబ్ధిదారుల ఖాతాలలో వేసి ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ఆయన చేసిన విశ్వ ప్రయత్నం విఫలమైంది.  జనవరి నుంచి మార్చి వరకూ నొక్కిన బటన్ల సొమ్ము ఇంత దాకా లబ్ధిదారులకు అందలేదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలలో సరిగ్గా ఎన్నికల వేళ జమయ్యేలా చేసి వారిని ప్రలోభ పెట్టి ఓట్లు దండుకుందామన్న కుట్రను ఎన్నికల సంఘం భగ్నం చేసింది. 

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.   ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈసీ ఆదేశాల మేరకు మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షాలు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా తానూ ప్రజలకు బటన్ నొక్కి మంచి చేయాలనీ చూస్తుంటే అధికారులను అడ్డుపెట్టుకుని బాబు ప్రజలకు మేలు చేయనీయకుండా అడ్డుపడుతున్నాడు అంటూ ప్రచారం చేసుకోవడానికే జగన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ సంక్షేమ పథకాలంటూ గతంలో ఎప్పుడో నొక్కేసిన బటన్ కు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు తాజాగా ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి లబ్ధిదారులకు గాలం వేయాలని చూశారు.  అయితే మే 13న ఎన్నికలు ముగిసిన తరువాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరుపున లబ్ధిదారుల ఖాతాలలో  నగదు బదిలీ చేయాలి, ఆలోగా నగదు బదిలీ వద్దు అంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు లబ్ధిదారులు హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారం చేపట్టిన న్యాయస్థానం రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్ది దారుల ఖాతాలో ఎటువంటి నగదు జమ చేయవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నెల 13 పోలింగ్ తేదీ ముగిసే వరకు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలోకి నగదు బదిలీ చేయడానికి వీల్లేదంటూ తేల్చేసింది.  ఎన్నికలకు రెండు రోజుల ముందు 14 ,165 కోట్ల నగదు లబ్ది దారుల ఖాతాలలో జమ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ   హైకోర్టు తీర్పు వెలువరించింది.  హైకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని ఆశపడిన వైసీపీకి మరోసారి చుక్కెదురైయింది.  ఇక ఇప్పుడు బటన్ నొక్కడం ప్రజల వంతు. ఐదేళ్లుగా బటన్ నొక్కుడు సంక్షేమంతో  మోసం చేసిన జగన్ కు జనం తమ బటన్ నొక్కుడు పవర్ చూపించనున్నారు.