Read more!

25న పులివెందులలో జగన్ నామినేషన్ 

21 రోజుల పాటు బస్సు యాత్రను నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇంకో వారం రోజుల్లో బస్సు యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగింపు సభలో ప్రసంగించేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది వైఎస్ఆర్సీపీ. అనంతరం వైఎస్ జగన్ కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21, 22 తేదీల్లో తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. 25వ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని చెబుతున్నారు. ఈ మేరకు కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పర్యటనలను నిర్వహిస్తారు. మే 11వ తేదీన ఎన్నికల ప్రచారానికి తెర పడేంత వరకూ కూడా 175 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళికను జగన్ రూపొందించుకున్నారు.

పులివెందుల నియోజకవర్గం ప్రచార బాధ్యతలను ఆయన భార్య వైఎస్ భారతి తీసుకుంటారు. కడప లోక్‌సభ పరిధిలోని పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతి విస్తృతంగా పర్యటిస్తారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తారు.