Read more!

రాజ్య‌స‌భ‌కు కేఏ పాల్‌!.. బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్‌!

కేఏ పాల్‌. కామెడీ పీస్..అంటారు చాలామంది. కాదు కాదు తాను ఫుల్ సీరియ‌స్ ప‌ర్స‌న్ అంటారు పాల్‌. జ‌గ‌న్‌ను స‌వాల్ చేస్తుంటారు. ప‌వ‌న్‌పై సెటైర్లు వేస్తుంటారు. మోదీ త‌న‌వాడే అంటుంటారు. ట్రంపూ త‌న శిష్యుడే అని చెబుతుంటారు. ఫ్లైట్లు, ఫండ్స్‌.. అబ్బో ఒక‌టేమిటి వినేవారు ఉంటే ఆయ‌న చెబుతూనే ఉంటారు. లేటెస్ట్‌గా కేఏ పాల్‌ తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్టున్నారు. కేసీఆర్‌కు తెగ గిల్లుతున్నారు. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని సైతం క‌లిశారు. త్వ‌ర‌లోనే కేసీఆర్ జైలుకు పోవ‌డం ఖాయ‌మని జోస్యం చెప్పారు. తాజాగా, మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చి.. మ‌రింత హాట్ కామెంట్స్ చేశారు కేఏ పాల్‌. 

ప్రజల సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చ జరగాల్సింది పోయి ఒకరినొకరు తిట్టుకోవడంతోనే రాజకీయ నాయకులు సమయం గడిపేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మండిపడ్డారు. "అభివృద్ధి కోసమే నేను అప్పట్లో తెలంగాణకు మద్దతిచ్చాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలైంది.  కేటీఆర్ బీజేపీ తప్పులను ఎత్తి చూపుతున్నారు. టీఆర్ఎస్‌ తప్పులను ఎందుకు కప్పి ఉంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పింది. పోటీ పడి మరీ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయలను ఛారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచి పెట్టాను. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఏర్పడింది. తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తా". అంటూ కేసీఆర్ స‌ర్కారును కుమ్మేశారు కేఏ పాల్‌. 

అదే ఫ్లో లో మ‌రింత ఆస‌క్తిక‌ర మేట‌ర్ కూడా రివీల్ చేశారు పాల్‌. "బీజేపీ నాకు రాజ్యసభ ఎంపీ ఇచ్చి, ఉప ప్రధాని ఇస్తా అన్నారు. కానీ, నేను ఒప్పుకోలేదు. డబ్బులతో సొంత మీడియాలు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. బడుగు బలహీనర్గాల ప్రజలు ఇప్పుడున్న అధికార పార్టీలకు ఓటు వేయొద్దు. ప్రపంచంలో నాలాంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేరు. నా ప్రతిభ గురించి తెలిసే మోదీ, కేసీఆర్, జగన్ భయపడతారు. కేఏ పాల్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ ఇకనైనా గుర్తించాలి. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తా. ఇప్పటివరకూ 18 పార్టీల నాయకులను కలిపేశాను. ప్రతి ఒక్కరినీ కలుపుకొంటూ పోవాలన్నదే నా అభిమతం. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్‌లో 102 సీట్లు వస్తాయి" అని కేఏ పాల్ ఫుల్ జోష్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు.