ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2024…!

 


నేడు పేదవారైనా, మధ్య తరగతివారైనా ఆరోగ్యం కాపాడుకుంటే చాలు  ఆస్తి కాపాడుకున్నట్టే అని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యం  అంత సులువుగా అందట్లేదు. ప్రతినెలా సాధారణ ఖర్చులు  వెళ్లబెట్టటానికే కష్టపడుతున్న కుటుంబంలో ఒకరికి ఏదైనా పెద్ద అనారోగ్యం వస్తే ఖర్చుపెట్టి  వైద్యం చేయించుకునేంత స్థోమత ఉండదు. ఆ కుటుంబం తీవ్ర పేదరికంలోకి లాగేయబడుతుంది. దీనికి తగ్గట్టు ప్రపంచం కూడా చాలా రకాల ఆరోగ్య సమస్యల ఉచ్చులో చిక్కుకుంటోంది. వీటిని అధిగమించడానికి సరైన జీవనశైలి సగటు పౌరుడికి కష్టంగా మారుతోంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అందించే దిశగా దేశాలను ప్రోత్సహించే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి 2012వ సంవత్సరం డిసెంబర్ 12న ఆమోదించింది. 

అప్పటినుంచి  ప్రతీ ఏటా డిసెంబర్12న అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికీ,  ప్రతిచోటా నాణ్యమైన, చవకైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలనేదే దీని వెనుక ఉన్న ఆలోచన..

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే :

ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అనేది ప్రపంచంలో బలమైన ఆరోగ్య వ్యవస్థ అవసరం గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది.  ఇప్పటికీ మంచి  ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందలేకపోతున్న   లక్షలాది మంది ప్రజల గురించి అవగాహన కల్పిస్తుంది. తద్వారా ఆరోగ్య రంగంలో  ప్రపంచ దేశాల నాయకులను మరింత వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రోజున కొత్త థీమ్‌ను అనుసరిస్తూ  ఆ సంవత్సరానికి సంబంధించిన ఎజెండాను హైలైట్ చేస్తుంది. 

2024 థీమ్: 

  “ఆరోగ్యం-  ప్రభుత్వ బాధ్యత” అనే అంశం ఈ ఏడాది థీమ్ గా ఎంచుకోబడింది.  ఇది ప్రజలందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలోనూ,  ప్రపంచ ఆరోగ్య ఈక్విటీని పరిష్కరించడంలోనూ, వైద్య ఖర్చులని తగ్గించి ఆర్థిక రక్షణను ప్రోత్సహించడంలోనూ ‘ప్రభుత్వాల పాత్రను’  తెలియజేస్తుంది.

 ఎందుకు అవసరం?

ఈరోజు ప్రజలు గడుపుతున్న జీవనశైలిని పరిశీలిస్తే.. మంచి వైద్యం అందటం కూడా ఒక అవసరంగా మారిపోయింది.  ముఖ్యంగా పట్టణీకరణ చెందిన  దేశాలలో పౌరులు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒక వేగవంతమైన జీవనశైలిని గడపడం అలవాటు చేసుకున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 2022 నివేదిక ప్రకారం, పట్టణీకరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అధిక వైద్య ఖర్చుని  ఎదుర్కొంటున్నాయి.  దీని ఫలితంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వైద్య వనరుల వ్యత్యాసానికి దారితీస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ప్రజలు  నివసించే ప్రాంతంతో సంబందం లేకుండా  అందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణ అవకాశాలను అందించడం ద్వారా ఒక పరిష్కారాన్ని అందిస్తుంది.

యూనివర్సల్ హెల్త్ కవరేజ్(UHC) అనేది వ్యక్తులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా వారికి అవసరమైనప్పుడు ఎక్కడైనా నాణ్యమైన  ఆరోగ్య సేవలను పొందగలిగేలా చేయటమే  లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చికిత్స నుండి ప్రత్యేక సంరక్షణ వరకు అన్నింటికీ అవసరమైన ఖర్చులని  కవర్ చేస్తుంది. 

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రయోజనాలు ఇవే..

అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంటుంది.  సాంఘిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించటమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్  అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి. 

అనుకోకుండా ఏర్పడే ఆర్థిక భారాల నుండి రక్షిస్తుంది. ఇది వ్యక్తులు, కుటుంబాలను ఆరోగ్యం కోసం చేసే  ఖర్చుల నుండి రక్షిస్తుంది. వారిని  వైద్య ఖర్చుల వల్ల పేదరికంలోకి  పడకుండా చేస్తుంది.

ఆరోగ్య సంరక్షణ ఖర్చులను వెంటనే పెట్టుకునే పని  లేకుండా చేయటం వల్ల   వైద్య రుణాలతో  కుటుంబాలు పేదరికంలో పడకుండా చేయటం వల్ల  వారి వద్ద ఉండే  డబ్బు పెట్టుబడులు రూపంలో ఆర్ధిక వ్యవస్థలోకి వచ్చి ఆర్ధిక వృద్ధి సాద్యమవుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి, దేశం  అభివృద్ధికి దోహదపడే వ్యక్తులకు విద్యను అందించడానికి కూడా ఈ డబ్బు సాయపడుతుంది. 

ప్రజలు వైద్య ఖర్చులకి భయపడి చికిత్స చేసుకోకపోతే కొన్ని వ్యాధులు  మహమ్మారిగా ప్రపంచమంతా ప్రబలే  అవకాశం ఉంటుంది. కానీ UHC వల్ల వాళ్ళు ఖర్చు భయం లేకుండా  వైద్యానికొస్తే ముందస్తుగా వ్యాధులని గుర్తించి, తగిన  చికిత్స చేయడానికి వీలవుతుంది. తద్వారా  ఆరోగ్యకరమైన, సురక్షితమైన ప్రపంచానికి దోహదం చేస్తుంది.

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. వ్యక్తులు,  కుటుంబాలపై ఆరోగ్య సంరక్షణ ఖర్చుల ఆర్థిక భారాన్ని తగ్గించి మెరుగైన ఆర్థిక వృద్ధి,  అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, పౌరుల శ్రేయస్సుతో సహా అనేక ప్రయోజనాలని కలిగి ఉంటుంది.  ఐతే ఐక్యరాజ్య సమితి UHCని ఆమోదించి 12 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ,  ఇప్పటికీ ఎన్నో దేశాల్లో, ఎంతో మంది నాణ్యమైన, చవకైన వైద్యాన్ని పొందలేకపోతున్నారు. ఒక నివేదిక ప్రకారం సుమారు 20శాతం జనాభా వైద్యఖర్చుల వల్ల  పేదరికంలోకి జారిపోతోంది. . 

ప్రజలను ముఖ్యంగా పేద, బలహీన వర్గాలవారిని  ఆరోగ్య ఖర్చుల నుండి రక్షించడంలో ప్రభుత్వాలు తగినంత పెట్టుబడి పెట్టే వరకు  ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేలు ఎన్ని జరిగినా ఉపయోగం ఉండదు. అందుకే WHO ఆర్థిక రక్షణ చర్యలను తీసుకోవటంలో  తక్షణ చర్య కోసం పిలుపునిచ్చింది. ప్రపంచమంతా అందరికీ సమానంగా సరైన వైద్య సదుపాయాలు అందాలని, ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నంలో ఏ ఒక్క వ్యక్తి లేదా కుటుంబం కూడా రోడ్డున పడకూడదనేదే దీని ఉద్దేశం.


                                       *రూపశ్రీ