Read more!

ఉపన్యాసకులు ఎలా ఉండాలి?

ఓ సభ నిండా శ్రోతలు ఉన్నప్పుడు వారి ముందు మాట్లాడటం, వారిని మెప్పించేలా మాట్లాడటం ఒక గొప్ప కళ. నేటి కాలంలో ఇలా మాట్లాడేవారు చాలా అరుదు. ఒకసారి చరిత్రలోకి చూస్తే……..

చికాగోలో ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు సమయం ఇచ్చేందుకే ఎవ్వరూ ఇష్టపడలేదు. అయిష్టంగా, మొక్కుబడిగా సమయం కేటాయించారు. ఐతే ఆరంభ వాక్యాలతోనే వివేకానంద అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. సంక్లిష్టమైన, మతపరమైన ఉపన్యాసాల నడుమ శ్రోతలను "సోదరసోదరీమణులు" గా సంబోధించటంతోటే శ్రోతల పైమెట్టునున్న వాడిలా కాక, వారిలో తానూ ఒకడైపోయాడు. విశ్వవేదికపై వివేకానందుడు ఓ శక్తిగా అవిర్భవించాడు.

ఉపన్యాసాలిచ్చేవారు గమనించాల్సిన అంశం ఇది. వీలైనంత త్వరగా ఎదురుగా ఉన్న శ్రోతలతో సంబంధం ఏర్పరచుకోవాలి. శ్రోతల కన్నా తాను ఒక మెట్టు పైనున్న వాడిలా కాక తానూ శ్రోతలలో ఒకడన్న భావనను శ్రోతలకు కలిగిస్తే తోటే ఉపన్యాసకుడు. సగం విజయం సాధించినట్టే.

ఆధునిక సమాజంలో 'వాజ్ పేయి' ఉపన్యాసాలంటే, సభల పేరు చెప్తే ఆమడ దూరం పారిపోయేవారు కూడా సభలకు పరుగెత్తి వస్తారు. ఇతర రాజకీయనాయకులంతా ఓ వైపు, ఉపన్యాసాలలో వాజ్ పేయి ఒక్కడూ ఓ వైపు. గమనిస్తే, వాజ్ పేయి ఉపన్యాసాలలో ఏ నాడూ తాను ఓ మెట్టు పైనున్నాడన్న భావన శ్రోతలకు కలగనివ్వడు. పైగా చమత్కార పూరితమైన సంభాషణలతో సభను అలరిస్తాడు. మామూలుగా మనం మాట్లాడే పదాలనే విరిచి పలకటం, వాటిని పలుకుతున్నప్పుడు తానూ ఆనందం అనుభవిస్తూ పలకటం, వల్ల వాజ్ పేయి మామూలు మాటలు కూడా సభలో ప్రేక్షకులను ఉర్రూతలూపుతాయి. పైగా, తన ఉపన్యాసంలో సమకాలీన సంఘటనలను, ప్రాంతీయఘటనలను వ్యంగ్యంగా ప్రస్తావించటంతో వాజ్ పేయి ఉపన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

వాజ్ పేయి తరువాత శ్రోతలను అంతగా అలరించేవి అబ్దుల్ కలామ్ ఉపన్యాసాలు. వాజ్ పేయి ధోరణికి, వాక్ శైలికి పూర్తిగా భిన్నమైంది అబ్దుల్ కలాం ధోరణి. అయితే ఇద్దరిలో మనం గమనించాల్సిన అంశం, వారు వీలైనంతగా శ్రోతలకు దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తారు. శాస్త్రవేత్తగా తన ఇమేజీని వాడుకుంటూ, ప్రతి ఒక్కరికీ మంచిని బోధించాలన్న నిజాయితీని ప్రదర్శిస్తూ, అబ్దుల్ కలామ్ శ్రోతలను స్ఫూర్తిమంతం చేయగలుగుతున్నాడు. గమనిస్తే రాజకీయ సంబంధిత ఉపన్యాసాలిస్తున్నప్పుడు అబ్దుల్ కలామ్ వ్యవహారశైలి మొక్కుబడిగా ఉంటుంది. అదే పిల్లల నడుమ, విద్యార్థుల నడుమ ఆయన చైతన్యంతో ఉట్టిపడుతూ, చైతన్యాన్ని కలిగిస్తాడు. 

దీన్ని బట్టి గ్రహించాల్సిందేమిటంటే, ఉపన్యాసకుడు తనకు ఏ అంశాలపై పట్టు ఉందో, ఏ అంశంపై తాను శక్తిమంతంగా మాట్లాడగలడో తెలుసుకొని ఉండాలి. లేకపోతే వేదికనెక్కి అభాసుపాలు కాక తప్పదు. ప్రస్తుతం మన నాయకులనేకులకు తాము మాట్లాడాల్సిన అంశాలపై పట్టు ఉండదు. ఏదో రొటీన్ గా, మొక్కుబడిగా మాట్లాడతారు. దాంతో సభలంటేనే విసుగు పుడుతుంది. సాహిత్య సభలు కూడా ఇలాగే తయారయ్యాయి.

సాహిత్యసభలు తమ పూర్వవైభవాన్ని కోల్పోవటం వెనుక ఉపన్యాసకులలో నిజాయితీ లోపించటం ప్రధానకారణం. పొగడ్తలతో ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేయటం, ఏ సభకు ఆ సభలోని వ్యక్తే కాళిదాసుకు పెద్దన్న అన్నట్టు మాట్లాడటం సర్వసాధారణమై పోయింది. విమర్శలు భరించే సహనం లేకపోవటంతో పొగడ్తలే దివ్యౌషధంగా మారాయి. దాంతో సాహిత్యసభలు విలువను కోల్పోయి పరిహాసాస్పదం అయ్యాయి.

సభల్లో మాట్లాడేటప్పుడు ఉపన్యాసకుడు ముందుగా తాను మాట్లాడే అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండటం తప్పనిసరి, చమత్కారపూరిత సంభాషణ లేకున్నా, విభిన్నభావాలు ప్రదర్శించలేకున్నా, శ్రోతల దృష్టిని నిజాయితీగా, విజ్ఞానవంతంగా ఉండే ఉపన్యాసకుడు ఆకర్షించగలుగుతాడు. ఇలాంటి ఉపన్యాసకులే ప్రజల మనసుల్లో కూడా అంతో ఇంతో గుర్తుగా నిలిచిపోతారు.

                                      ◆నిశ్శబ్ద.