Read more!

భారతదేశం అభివృద్ధి పేరుతో ముందుకెళుతుందా లేదా వెనక్కా?

అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం 131 వ స్థానంలో స్థానంలో ఉంది. ఇది 189 దేశాల పట్టికలో పొందిన స్థానం. సామాజిక, ఆర్థిక ఎదుగుదలలో భారతదేశం మిగిలిన దేశాలతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంది. అభివృద్ధి అంటూ ముందుకు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి బలహీనపడిపోతున్నట్టు ఎన్నో విషయాలు స్పష్టం చేస్తున్నాయి కూడా. ఇంతకూ మనం ముందుకు వెళుతున్నామా?? లేక వెనక్కు వెళుతున్నామా?? 

 సమాజంలో పెరుగుతున్న దాష్టీకాలు, దౌర్జన్యాలు గమనిస్తే మనం పాలరాతి యుగంలో ఉన్నామా! లేక పాత రాతి యుగంలోనే ఉన్నామా అనిపిస్తోంది. పొత్తిళ్ళలోనే బిడ్డల్ని గొంతు నులిమేస్తున్న కసాయి కన్నతల్లులు... ఎంతో మంది కనిపిస్తున్నారు. తమ జీవితాలు సంతోషంగా లేవని బిడ్డలను చంపి తాము చావడానికి సిద్ధపడుతున్న మహిళలు కోకొల్లలు. వీరు అమ్మ అనే పేరుకే మచ్చ తెస్తున్నారని అనిపిస్తుంది. 

వావివరసలు మరచి మగవారు జరుపుతున్న విశృంఖల ఘోరకృత్యాలు... చూస్తే అడవి మృగాలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి.  మన ప్రవర్తన రోజురోజుకూ ఎందుకింత పతనావస్థకు చేరుకుంటోంది?? మనుషులుగా పుట్టిన అందరం క్రమంగా పశుప్రవృత్తిని పెంచుకుంటున్నాం అనే విషయం అక్కడక్కడా జరుగుతున్న సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. అందుకే స్వామి వివేకానంద అంటారు "పవిత్రత, మానవీయత లోపించి, ప్రాపంచికత మితిమీరిన రోజున, ఆ జాతికి అంత్యకాలం దాపురిస్తుంది. సమాచార విప్లవంతో పురోగమించామని సంబరపడుతున్నా, సదాచారం లోపిస్తే మాత్రం అది తిరోగమనమేనన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. సాంకేతికత, సంబంధిత విజ్ఞానం మన జీవన వ్యవహారాన్ని సులభతరం చేయవచ్చు; అంతమాత్రం చేత దానిని మన జీవనశైలిగా మలచుకుంటే దుష్ఫలితాలు అనంతం” అని. 

ఇది స్వామి వివేకానంద చెప్పిన నాటి నుండి నేటి వరకు కూడా సాగుతున్న వ్యవహారం.

లోపం ఎక్కడుంది?? వైఫల్యం ఎవరిది??

సమాజం గాడి తప్పుతోందన్న చర్చ సర్వత్రా జరుగుతూనే ఉంది. మరి లోపం ఎక్కడో, వైఫల్యం ఎవరిదో అంతుచిక్కడం లేదు. ఆలోచిస్తే ఈ లోపం, వైఫల్యం ఒక్కరిది కాదు. ఇది మనందరిదీ! ప్రాథమిక స్థాయి నుంచి నేటి సమాజం మీట నొక్కితే వేగమే తప్పా వివేకం లేని మరమనుషులను తయారు చేస్తోంది. విద్యాలయాల నుంచి వ్యక్తిత్వం లోపిస్తున్న సాంకేతిక సాధనాల్లా ఈ తరం యువతీ యువకులు బయటి ప్రపంచానికి పరిచయమవుతున్నారు. వీరికి విచక్షణ, వివేకంతో పనిలేదు. కేవలం చెప్పింది అప్పజెప్పగలరు, అప్పగించిన పనిని చేసి చూపించగలరు. అంతే కాని తమకు తాము దేని మీదా ధారాళంగా ఏది చెప్పలేరు, అవగాహనతో చేయలేరు.  భారతదేశంలో విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం, సృజనాత్మకతతో కూడిన వారు పదిహేను శాతానికి మించి కూడా లేరనే ఓ వాస్తవం విస్మయపరుస్తుంది.

అంటే అభిరుచి, ఆసక్తి, స్వయం నిర్ణయం... ఇలా ఏవీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇతరుల ప్రోద్బలం వల్లో, ఉపాధి లక్ష్యం వల్లో విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకుంటున్నాం తప్ప అవగాహన, నైపుణ్యం  మొదలైనవాటి వల్ల కాదు. అలా అవగాహన లేకుండా అంత చదువులు చదివితే ఆ తరువాత పరిస్థితి అయోమయం, అగమ్యగోచరం. నేటికాలంలో జరుగుతున్నది అదే.. అందుకే మనం అభివృద్ధి పేరుతో ముందుకు వెళుతున్నామా లేక వెనక్కు వెళుతున్నామా అనే సందేహం వస్తుంది. నిజమా కాదా?? మీరూ ఆలోచించండి ఒకసారి.

                                      ◆నిశ్శబ్ద.