Read more!

ఇసుకేస్తే రాలనంత జనం.. నామినేషన్ రోజే ఖరారైన యార్లగడ్డ విజయం!

ఇసుకేస్తే రాలనంత జనం. నామినేషన్ ర్యాలీయే విజయోత్సవాన్ని తలపించిన వైనం. ప్రత్యర్థి ఓటమిని ఖారారు చేసిన సందర్భం. ఇదీ గవన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బుధవారం (ఏప్రిల్ 24) యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యం.  గన్నవరం.. తెలుగుదేశం కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ముచ్చటగా మూడో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్నారు.

అయితే  ఆయన 2019లో పార్టీ పరాజయం తరువాత తెలుగుదేశం వీడి వైసీపీ గూటికి చేరారు. అప్పటికి కానీ ఆయనకు అర్ధం కాలేదు. వరుసగా తన రెండు విజయాలు తెలుగుదేశం బలం కానీ తన బలం కాదని. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ప్రచారం హోరెత్తుతున్న వేళ.. తాను ఎంత నిస్సహాయంగా మిగిలాడో వంశీకి తెలిసివచ్చినట్లైంది.  ఈ సారి గన్నవరంలో పోటీ పడుతున్నది పాత ప్రత్యర్థులే. అయితే పార్టీలు  మారాయి. గత ఎన్నికలలో  వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.

అయితే యార్లగడ్డకు తెలుగుదేశం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుండగా, వంశీ మాత్రం వైసీపీలో తన వ్యతిరేక గ్రూపుల సహాయనిరాకరణతో  డీలా పడ్డారు. ఇక ఇప్పుడు నామినేషన్ల ఘట్టం దగ్గరకు వచ్చేసరికి యార్లగడ్డ వెంకట్రావు బుధవారం (ఏప్రిల్ 24)న  తన  నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన భారీ జనసందోహం చూస్తే గన్నవరంలో  యార్లగడ్డ విజయం ఖారారైపోయిందనిపించక మానదు.  రాజకీయ సన్యాసం గురించి గతంలోనే ఆలోచించిన వంశీ ఆ ఆలోచన ఎందుకు విరమించుకున్నానా అని మథనపడుతూ ఉంటారని తెలుగుదేశం శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. 

యార్లగడ్డ నామినేషన్ సందర్భంగా కూటమి ఐక్యత ఎంత పటిష్టంగా ఉందో మరో సారి రుజువైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో  రాలీలో పాల్గొన్నారు. మరో వైపు ఇప్పటికే  వంశీకి సహకారం అందించే ప్రశక్తే లేదని పలువురు వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టేశాయి. దీంతో వంశీ నామినేషన్ ర్యాలీ వెలవెలపోవడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇది ఊహించే యార్లగడ్డతో   పాటే గురువారం ( ఏప్రిల్ 25)న నామినేషన్ దాఖలు చేయాలని, తద్వారా పోటీపోటీ ర్యాలీల పేరుతో గందరగోళం సృష్టించాలన్న వంశీ వ్యూహం బెడిసికొట్టింది. ఒకే రోజు ఇద్దరికీ నామినేషన్ దాఖలుకు రిటర్నింగ్ అధికారి  అనుమతి ఇవ్వలేదు. దీంతో యార్లగడ్డ ఒక రోజు ముందే నామినేషన్ కు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.  దీంతో గురువారం (ఏప్రిల్ 25) వంశీ నామినేషన్ సందర్భంగా ర్యాలీ తీసే సాహసం చేయకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.