Read more!

మంచి చెడులను ప్రజలు చూస్తున్న విధానం ఇదే..

 

అదొక పెద్ద అంతర్జాతీయ కంపెనీ. ఆ కంపెనీలో బట్టలు ఉతికే సబ్బుపౌడర్(డిటర్జెంట్) తయారు చేస్తారు. వారు సబ్బుపొడికి 'అంతర్జాతీయ మార్కెట్' సొంతం చేసుకోవడానికి ఎలాంటి ప్రకటనలు(ఎడ్వర్టైజ్మెంట్) చేస్తే వినియోగదారులు పెరుగుతారో బాగా ఆలోచించి, వారి ప్రకటనలలో బొమ్మలకు ప్రాధాన్యతనిచ్చి, అతి తక్కువ పదాలను ఉపయో గించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార ప్రకటనలో మూడు బొమ్మల క్రింద వరుసగా ఇలా వ్రాయించారు :

*మురికి బట్టలు*

* సబ్బునీళ్ళలో బట్టలు*

* శుభ్రమైన బట్టలు*

 ఇంకేముంది! కంపెనీకి విపరీతమైన లాభాలు. కొన్నాళ్ళ తరువాత వారి 'సర్వే'లో ఒక కొత్త విషయం బయట పడింది. కొన్ని దేశాలలో వారి సబ్బుపొడికి 'మార్కెట్' లేకపోవడమే కాకుండా, ప్రజలలో ఆ సబ్బుపొడి మీద ఒక విధమైన ద్వేషం ఏర్పడింది. అందుకు కారణాలను తెలుసుకోవడానికి, ఆ దేశాలకు కంపెనీవారు 'మేధావి' బృందాన్ని పంపించారు. చివరికి 'సర్వే'లో తేలిన విషయం ఏమిటంటే, ఆ దేశ ప్రజలు కంపెనీ వారి ప్రకటనలను 'కుడి నుండి ఎడమ' వైపుకు చదవడమే!

ఇదీ మన సమస్య. మంచీ, చెడులు నాణానికి ఇరువైపులున్న బొమ్మ, బొరుసుల్లాంటివి. ఇరు ప్రక్కలలో ఎటువైపు మనం చూస్తామో, దానిపైనే వస్తువు యొక్క మంచి చెడు ఆధారపడి ఉంటుంది. కుడి ఎడమయినా, ఎడమ కుడి అయినా పొరపాటే!

మనం ద్వంద్వాలలో జీవిస్తున్నాం. ఈ ద్వంద్వ బుద్ధితో భగవంతుణ్ణి కొలుస్తున్నాం. మనకు చెడు సంభవిస్తే సహించం. ఎందుకీ చెడుని సృష్టించావని భగవంతుణ్ణి ప్రశ్నిస్తాం, రోదిస్తాం. కానీ భగవంతుడు మంచి, చెడులనే ద్వంద్వాలకు అతీతుడన్న విషయం మరచిపోతున్నాం.

జీవితమనే నాణానికి మంచి, చెడులు ఇరుప్రక్కలా ఉన్న బొమ్మా బొరుసుల్లాంటివి అన్న భావన కలిగినప్పుడు, మనలో మరొక సమస్య తలెత్తుతుంది. అదే 'విచ్చలవిడితనం'. మంచి, చెడులనే ద్వంద్వాలు జీవితంలో సహజమనే మెట్ట వేదాంత ధోరణి విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో పరిణతి లేనప్పుడు ఇలాంటి మెట్ట వేదాంతం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. పైగా ప్రమాదం కూడా!

కాబట్టి సాధకుడు మంచీ, చెడుల మధ్య తారతమ్యం తెలుసుకొని 'చెడు'ని వదలిపెట్టి, 'మంచి'ని పెంచుకొనే ప్రయత్నం చేయాలి. స్వామి వివేకానంద మాటల్లో “నాకు మేలైనది నీకు కీడు కావచ్చు. అన్ని విషయాల మాదిరే మంచి చెడ్డలకు కూడా క్రమవికాసం వుందనేదే దీని పర్యవసానం.  అది క్రమవికాసం చెందుతూన్నప్పుడు ఒక దశలో మంచి అని మరొక దశలో చెడు అని అంటుంటాం. నా మిత్రుడి ప్రాణం తీసిన తుపాను చెడ్డదని నేనంటాను. కానీ ఆ తుపాను గాలిలోని సూక్ష్మ విషక్రిములను నాశనం చేసి అసంఖ్యాక  జనాన్ని కాపాడి ఉండవచ్చును. దాన్ని గుర్తించినవారు మంచిదంటారు. 

 కాబట్టి మంచి చెడ్డలు సాపేక్ష ప్రపంచానికి సంబంధించినవే.  నిర్గుణదేవుడు సాపేక్షదేవుడు కాడు. కాబట్టి అతడు మంచివాడని గాని, చెడ్డవాడని గాని నిర్వచించలేం. అతడు మంచి చెడులకు అతీతుడు. అతడు మంచివాడూ కాడు, చెడ్డవాడు కాడు. కానీ, చెడుకంటే మంచే తనకు ఎక్కువ సన్నిహితమనే మాట నిజం.


                                           *నిశ్శబ్ద.