Read more!

ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం.. మాజీ ఎస్.ఇ.సి నిమ్మగడ్డకు కీలక సూచన

ఏపీ ఎన్నిక‌ల అధికారిగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ను తిరిగి నియ‌మించాల‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పు అమ‌లుకాక‌పోవ‌టంపై నిమ్మ‌గ‌డ్డ ఏపీ ప్ర‌భుత్వంపై కోర్టు ధిక్కార పిటిష‌న్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ సందర్భంగా నిమ్మగడ్డ తరుఫు లాయర్ తన వాదనలో భాగంగా హైకోర్టు తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు సుప్రీం తలుపు తట్టినా స్టే ఇవ్వడానికి నిరాకరించిందని తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఏపీ గ‌వ‌ర్న‌ర్ ను స్వయంగా క‌లిసి పున‌ర్నియామ‌కంపై హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని విన‌తి ప‌త్రం ఇవ్వాల‌ని కోర్టు నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్ ‌కు సూచించింది. అంతే కాకుండా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు స్టే ఇవ్వని కారణంగా తాము ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఐతే ఇప్ప‌టికే తాము గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ కోరిన‌ట్లు నిమ్మ‌గ‌డ్డ త‌రుపు లాయ‌ర్ కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా ఇప్పటి వరకు నిమ్మగడ్డను ఎందుకు తిరిగి నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతే కాకుండా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచార‌ణ‌ను వ‌చ్చే శుక్ర‌వారంకు హైకోర్టు వాయిదా వేసింది.