Read more!

ముసుగు మనిషి మాట మార్చాడు!!

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో ఓ ముసుగు వ్యక్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. రైతు సంఘాల నేతలను హతమార్చేందుకు కుట్ర పన్నామని శుక్రవారం రాత్రి చెప్పిన అతను.. గంటల వ్యవధిలోనే మాట మార్చాడు.

 

శుక్రవారం రాత్రి సింఘు సరిహద్దు వద్ద రైతులు ఓ వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. రిపబ్లిక్ డే రోజు రైతులు తలపెట్టిన ర్యాలీని చెదరగొట్టాలని, తన అనుచరులతో కలిసి పోలీసుల మాదిరిగా నటిస్తూ రైతులపై లాఠీచార్జి జరపాలని నిర్ణయించిన్నట్టు అతడు మీడియాతో చెప్పాడు. అలాగే, రైతుల్లో నలుగురు రైతులను చంపి, ఆందోళన చెడగొట్టేందుకు కుట్ర పన్నినట్టు పేర్కొన్నాడు. ఇందులో పోలీసులకు భాగస్వామ్యం కూడా ఉందని చెప్పాడు. ఓ పోలీసు అధికారే తమను ఈ పనికి పురమాయించాడని, రైతు నేతల ఫొటోలు కూడా ఇచ్చాడని నిందితుడు తెలిపాడు. తన పేరు ప్రదీప్ అని, రైతుల నిరసనకు అంతరాయం కలిగిస్తే ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఇస్తామని చెప్పారని పేర్కొన్నాడు. కాగా, పట్టుబడిన నిందితుడిని రైతులు పోలీసులకు అప్పగించారు.

 

రైతు నేతలను చంపేందుకు వచ్చి పట్టుబడ్డానంటూ మీడియా ముందు మాస్కు పెట్టుకుని మాట్లాడిన వ్యక్తి.. కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చి ఓ వీడియోలో అతడు పూర్తి విరుద్ధంగా మాట్లాడాడు. రైతులు ముందుగా రాసిచ్చిన స్క్రిప్టునే తాను మీడియా ముందు చదివానంటూ అతడు చెప్పుకొచ్చాడు. అయితే, ఈ వీడియో అసలైనదా కాదా అనేది పోలీసులు నిర్ధారించలేదు. అతడిని పూర్తిగా విచారించిన తర్వాత తాము మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం హర్యానాలోని సోనిపట్‌ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ యువకుడిని ప్రశ్నిస్తున్నారు. కాగా, సోనిపట్‌కు చెందిన ఆ యువకుడికి ఇంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేదని సమాచారం.