జగన్ పై గులకరాయిదాడి కేసులో దుర్గారావు నిర్దోషి!
posted on Apr 22, 2024 @ 12:29PM
జగన్ మెప్పు కోసం అత్యుత్సామం ప్రదర్శించిన బెజవాడ పోలీసులు చివరకు తప్పు తెలుసుకుని దిద్దుకునే పనిలో పడ్డారా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జగన్ పై జరిగిన గులకరాయి దాడి కేసులో ఏ2గా పేర్కొంటూ అదుపులోనికి తీసుకున్న దుర్గారావును విచారణ అనంతరం నిర్దోషిగా తేల్చి వదిలేశారు.
ఇటీవల విజయవాడలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు గులకరాయితో దాడి చేశారు. దాడి జరిగిన క్షణం నుంచీ వైసీపీ నేతలు దాడి వెనుక తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆరోపణలు గుప్పించారు. ఈ దాడి ద్వారా సానుభూతి పొంది ఎన్నికలలో లబ్ధి పొందాలని తహతహలాడారు. పోలీసులు కూడా ఈ కేసులో తెలుగుదేశం వారిని ఇరికించేందుకు అత్యుత్సాహం చూపారు. దాడి కారకులను పట్టిస్తే రెండు లక్షల రివార్డు అని ఆర్భాటంగా ప్రకటించిన పోలీసులు వారంతట వారే దాడికి పాల్పడ్డాడంటూ ఇద్దురు యువకులను అరెస్టు చేశారు. వారిలో సతీష్ అనే వడ్డెర కాలనీకి చెందిన యువకుడిని ఏ1గా పేర్కొన్నారు. అతడిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జైలుకు రిమాండ్ కు తరలించారు.
ఇక ఈ కేసులో ఎ2గా దుర్గారావు అనే వ్యక్తిని పేర్కొని అతడిని అదుపులోనికి తీసుకుని విచారించారు. తెలుగుదేశం కార్యాలయంలో పని చేసే దుర్గారావును అరెస్టు చేసి జగన్ పై గులకరాయి దాడి వెనుక తెలుగుదేశం హస్తం ఉందనే సంకేతాలు ఇచ్చారనీ, వైసీపీ వారు దుర్గారావు అరెస్టును పేర్కొంటూ దాడి వెనుక ఉన్నది తెలుగుదేశం అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలను తెలుగుదేశం గట్టిగా ఖండించింది. ఈ కేసులో బొండా ఉమను అరెస్టు చేసి ఆయన నామినేషన్ వేయకుండా అడ్డుకుని వెల్లంపల్లికి లైన్ క్లియర్ చేయాలన్న కుట్ర ఉందని ఆరోపణలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలోనే గులకరాయిదాడి కేసులో దుర్గారావు నిర్దోషి అని పేర్కొంటూ పోలీసులు అతడిని విడుదల చేశారు. విచారణ పేరుతో దుర్గారావును బెదరించి అయినా నేరం చేసినట్లు అంగీకరించేలా చేయాలన్న దుష్ట పన్నాగం పారనందుకే దుర్గారావు నిర్దోషి అని ప్రకటించి విడుదల చేరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా విచారణ పేరుతో తనను బెదరించి రాయిదాడికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేశారని విడుదల అనంతరం దుర్గారావు చెప్పారు. అయితే తాను బలంగా నిలబడ్డాననీ, చేయని నేరాన్ని అంగీకరించేది లేదని స్పష్టంగా చెప్పాననీ దుర్గారావు అన్నారు.