బుఖారీ మద్దతు మాకేమీ అక్కరలేదు: ఆమాద్మీ

 

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మత గురువులను కలుస్తూ వారి మతానికి చెందిన ప్రజల ఓట్లు తమ పార్టీకే పడేందుకు నానా తిప్పలు పడుతుంటాయి. క్రిందటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముస్లిం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని పిలుపునిచ్చిన డిల్లీ జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఈరోజు జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో డిల్లీలో ముస్లిం ప్రజలందరూ ఆమాద్మీ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. అదే వేరే పార్టీ అయితే ఎగిరి గంతెసేది. కానీ ఆమాద్మీ పార్టీ మాత్రం ఆయన మద్దతు తమకు అవసరం లేదని వెంటనే ప్రకటించి ఆయనకు షాక్ ఇచ్చింది. బుఖారీ భావజాలానికి తమ పార్టీ వ్యతిరేకమని, కనుక తమకి ఆయన మద్దతు అవసరం లేదని ఆమాద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు.

 

ఆ పార్టీ నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలపైనే ప్రధానంగా ఆధారపడి ముందుకు సాగుతోంది. వారి కుల, మత, ప్రాంతాల గురించి కాకుండా వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించే మాట్లాడుతుండటంతో అన్ని వర్గాల ప్రజలు ఆ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. అందుకే ఈరోజు ఎన్నికలు పెట్టుకొని అంత దైర్యంగా బుకారీ మద్దతు తమకు అవసరం లేదని చెప్పగలిగింది.

Teluguone gnews banner