Read more!

దహీ వెర్సెస్ తయిర్‌.. తమిళనాట బీజేపీకి గడ్డు సమస్యే

తమిళుల భాషాభిమానం  గురించి  కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు.  తమిళ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ, మాతృ భాషకు అవమానం జరిగితే ఊరుకోరు. మాతృ భాషకు అవమానమనే కాదు, జాతీయ భాష హిందీ డామినేషన్  ను సైతం ఇసుమంతైనా  సహించరు. అలా తమిళ భాషకు ఏ చిన్న అవమానం జరిగినా వెంటనే తమిళ జనం రోడ్డు ఎక్కేస్తారు. రాజకీయాలకు అతీతంగా తమిళులంతా ఏకమైపోతారు. అసలు ద్రవిడ పార్టీల పుట్టుకకు హిందీ వ్యతిరేక ఆందోళనలే ప్రధాన కారణం.

1965లో హిందీని ఏకైక జాతీయ భాషగా ప్రకటిస్తూ,కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళనాడులో  సుమారు రెండు నెలలకు పైగా ఆందోళనలు జరిగాయి. సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్ శాస్త్రి హిందీ భాషేతర రాష్ట్రాలు కోరే వరకూ ఇంగ్లీష్‌ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చి తమిళులను శాతింప చేశారు.   అయినా ఆందోళనల ఫలితంగా తమిళనాడు రాష్ట్రం రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారి పోయింది.

ఆ తర్వాత 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతవరకు తిరుగు లేని శక్తిగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడి పోయింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకే) గెలుపొందింది.  ఇక అంతే .. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ,  ఆమాట కొస్తే మరో జాతీయ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. 

ఇక ప్రస్తుతం లోకి వస్తే తమిళ నాడులో మరో మారు, తమిళ్ సెంటిమెంట్ రాజకీయ దుమారం రేపుతోంది.అయితే ప్రస్తుత వివాదానికి ‘దహీ’ (పెరుగు) కేంద్ర బిందువు.. కావడం విశేషం. తమిళనాడుతో పాటుగా ఎన్నికలు జరుగతున్న కర్ణాటకలోనూ ‘దహీ’ దావానలం రగులుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఆహార విక్రయ సంస్థలు, ఇంతవరకు పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌ అనే ఇంగ్లీష్ పదంతో పాటు తైర్‌ (తమిళం), మొసరు (కన్నడం) అనే పదాలను కూడా ముద్రిస్తున్నాయి. అయితే, పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులు ‘దహీ’ అనే పదాన్ని ప్రముఖంగా  ముద్రించాలనీ కర్డ్‌ అని గానీ, ఇతర ప్రాంతీయ భాషల్లోని పేర్లను గానీ ‘దహీ’ పక్కన బ్రాకెట్‌లో ముద్రించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ) మార్చి 10న ఆదేశించింది.  ‘కర్ణాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌), బెంగళూరు రూరల్‌ అండ్‌ రామనగర డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ సొసైటీస్‌ యూనియన్‌ లిమిటెడ్‌, తమిళనాడు కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌, హట్సన్‌ అగ్రో ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తమిళనాట ఆవిన్‌ అనే బ్రాండ్‌ పేరుతో పెరుగును, ఇతర పాల ఉత్పత్తులను విక్రయించే ‘తమిళనాడు కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌’ ఈ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాము విక్రయించే పెరుగు ప్యాకెట్లపై హిందీ పదమైన ‘దహీ’ని వాడబోమని.. తమిళ పదమైన ‘తైర్‌’నే ముద్రిస్తామని తేల్చిచెప్పింది.

దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా స్పందించారు. హిందీని బలవంతంగా రుద్దడంలో భాగంగానే ‘దహీ’ పదాన్ని పెరుగు ప్యాకెట్లపై తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని మండిపడ్డారు. అటు కన్నడనాట కూడా ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఆదేశాలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా కేంద్రంపై వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు. కర్ణాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ విక్రయించే నందిని బ్రాండ్‌ పాల ఉత్పత్తుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘‘నందినీ బ్రాండ్‌ కన్నడిగుల ఆస్తి. అది కన్నడిగుల గుర్తింపు. కన్నడిగుల జీవరేఖ.. హిందీని బలవంతంగా రుద్దడాన్ని కన్నడిగులు తీవ్రంగా వ్యతిరేకిస్తారని తెలిసి కూడా నందిని బ్రాండ్‌ పెరుగు ప్యాకెట్లపై హిందీ పదమైన దహీని వాడాలంటూ ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కేఎంఎ్‌ఫకు ఆదేశాలివ్వడం తప్పు’’ అని కుమారస్వామి మండిపడ్డారు. ‘దహీ’  అనేది హిందీ పదం కాదని, సంస్కృతం నుంచి వచ్చిన పదమని, దాని అర్థం పాల ఉత్పత్తి అని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినా నిరసనలు చల్లారలేదు.దీంతో, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ తన పాత నిబంధనలను సడలించింది.

ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు విక్రయించే పెరుగు ప్యాకెట్లపై ‘కర్డ్‌’ అని ఆంగ్లంలో ముద్రించి, దాని పక్కన ప్రాంతీయ భాషా పదం (పెరుగు/తైర్‌/మొసరు/దహీ వంటివి) కూడా చేర్చుకోవచ్చని స్పష్టం చేసింది.  అయినా కూడా దహి వివాదం బీజేపీకి తమిళనాడులో చేయగలిగినంత నష్టం ఇప్పటికే చేసేసిందని చెప్పాలి. 

 తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఇందుకు బాధ్యులైన వారిని (కేంద్రాన్ని) శాశ్వతంగా బహిష్కరిస్తామని హెచ్చరించారు.  మరో వంక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దహి  నిర్ణయాన్ని తప్పుపట్టారు.   ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ విధానాలకు ఇది విరుద్దంగా ఉందని వ్యాఖ్యానించారు.. అయినా పేస్ బుక్ లో మిత్రులు కొందరు సూచించిన విధంగా పెరుగు ప్యాకెట్‌ మీద ఇంగ్లీష్‌, తమిళ్‌, హిందీ మాత్రమే ఎందుకు ఉండాలి. ఏ రాష్ట్రంలో అయినా అమ్మకునేందుకు వీలుగా భారతీయ భాషలన్నింటిలో రాయాలని FSSAI ఆదేశించి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.