Read more!

హుజురాబాద్‌లో కేసీఆర్ 'సెప‌రేట్‌' స్కెచ్‌.. ఈసీ దిమ్మ‌తిరిగే షాక్‌.. అబ్ ఆయేగా మ‌జా..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరో ఏడు రోజుల్లో ముగుస్తుంది. అయినా తెరాస ప్రచారంలో ఇంతవరకు మంత్రి హరీష్ రావు మినహా మిగిలిన ముఖ్య నేతలు ఎవరూ, ప్రముఖంగా కనిపించ లేదు. వినిపించ లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. కేటీఆర్ అయితే, ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయంలోనూ కేటీఆర్ అనుమానాలనే వ్యక్త పరిచారు. ఇప్పుడు ఆ అనుమానమే నిజం అయింది. 

ఈనెల 27న, హుజూరాబాద్ నియోజకవర్గం వెలుపల ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకు తెరాస అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలను నిర్వహించుకునేందుకు వీలు లేదు. అందుకే, హుజూరాబాద్ పక్కనే ఉండే ప్రాంతమైన పెంచికల్ పేటను టీఆర్‌ఎస్‌ ఎంచుకుంది. సభ హుజూరాబాద్ నియోజక వర్గం వెలుపల జరిగినా, జనాన్ని హుజూరాబాద్ నుంచే తరలించాలని, హరీష్ రావు ప్లాన్ రెడీ చేశారు.

అయితే, తెరాస/ హరీష్ రావు  ఒకటి తలిస్తే, కేంద్ర ఎన్నికల సంఘం ఇంకొకటి తలచింది. హుజూరాబాద్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్, ముఖ్యంగా కోవిడ్ స్పెషల్ కోడ్ ఉల్లంఘనలు జరుగుతన్న వైనాన్ని గుర్తించింది. ఈ నేపద్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ అమలు తీరి తెన్నులను మరింత కఠినతరం చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్, కేవలం నియోజక వర్గం పరిధిలో మాత్రమే కాకుండా, నియోజక వర్గం ఉన్న జిల్లా/ జిల్లాలకు మొత్తంగా వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాగే, పరోక్షంగానే అయినా  హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను కూడా అందులో పేర్కొన్నారు. దీంతో అధికార పార్టీ ఈ నెల 27న పెంచికల్ పేటలో జరపతలపెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల సభకు చిక్కులు ఏర్పడ్డాయి. 

తాజా ఉత్తర్వులలో పేర్కొన్న మేరకు హుజూరాబాద్ తో పాటుగా నియోజక వర్గం విస్తరించి ఉన్న కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ వర్తించనున్నట్లు స్పష్టమవుతోంది. ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గానికి కొంత దూరంలో ఉండే ప్రాంతంలో భారీ స్థాయి బహిరంగ సభలు పెట్టడం కోడ్‌లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధమేనని కూడా సీఈసీ జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ తాజా ప్రకటనలో తెలిపారు. సో.. ముఖ్యమంత్రి సభ కూడా జరిగే అవకాశం లేదని తేలిపోయింది. 

అయితే,  ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులకు ముందే, మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై సందేహం వ్యక్తం చేయడంతో, దాల్ మే కుచ్.. హై క్యా ..అనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించడం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు లక్ష్యం అయితే, ఈటల అడ్డు ఎలగూ తొలిగి పోయింది కాబట్టి, మిలిన అడ్డు హరీష్’ను కూడా తొలిగించుకోవడం కేటీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇందులో బాగంగానే కేటీఆర్ అభ్యర్ధి ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందుకే హరీష్ రావును బలిపశువుని చేసేందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనక పోవడంతో పాటుగా ముఖ్యమంత్రి కూడా పాల్గొనకుండా ఎన్నికల సంఘంలో చక్రం తిప్పారా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే హుజూరాబాద్ అంతిమ విజేత కేటీఆరే అవుతారు.