ఈసీ చర్యలు ఏకపక్షం అంటున్న సి.ఎం. జ‌గ‌న్‌

స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఇదే అంశంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి నిర‌స‌న వ్యక్తం చేశారు. విచక్షణ అధికారం అన‌డం ఈ మ‌ధ్య ఓ ఫ్యాషనైపోయిందని సిఎం త‌న బాధ‌ను గ‌వ‌ర్న‌ర్ ముందు చెప్పుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌ను చంద్రబాబే నియమించారని, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అన్నారు. రమేశ్ కుమార్ విచక్షణ కోల్పోయారని... ఆయన చేసిన వ్యాఖ్యలు బాధకలిగించాయని సీఎం పేర్కొన్నారు. కరోనా వైరస్ సాకుచూపి ఎన్నికల వాయిదా వేసినట్టు ప్రకటించిన ఆయన.. అదే సమయంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించినట్టు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని సి.ఎం. ప్ర‌శ్నించారు.

రాజకీయాలకు అతీతంగా ఉండాలి కానీ, ఎన్నికల కమిషనర్‌కు ఉండాల్సిన లక్షణం ఇది కాదని వ్యాఖ్యానించారు. అధికారులను బదిలీచేసే అధికారం ఈసీకి ఎక్కడుందని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు ఎన్నికలు వాయిదా వేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజలు ఓట్లేసి 151 సీట్లతో అధికారం మాకు ఇచ్చారని.. ఈ అధికారం రమేశ్ కుమార్‌దా.. మాదా? అని నిలదీశారు. ఇక సీఎంలు ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? అని అన్నారు.

ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారని, పక్కనే ఉన్న ఇతర అధికారులను సంప్రదించడం లేదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్‌ను జీర్ణించుకోలేకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇదే విషయం గురించి గవర్నర్‌కు తెలియజేశానని, ఈసీని పిలించి మాట్లాడమని చెప్పామన్నారు. అప్పటికీ కుదరకపోతే పైస్థాయికి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు.

కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నానని చెప్పిన రమేష్ కుమార్ ఎందుకు గుంటూరు చిత్తూరు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతోపాటు మరికొంత మందిని బదిలీ చేస్తూ ప్రకటన చేశారని సీఎం ధ్వజమెత్తారు. అధికారులను బదిలీ చేసే హక్కు ఈసీకి ఎక్కడుందని నిలదీశారు.

151మంది ఎమ్మెల్యేలతో ప్రజా బలంతో గెలిచి అధికారంలోకి వచ్చిన తమకు పవర్ ఉంటుందా? ఎన్నికల కోడ్ ఉందని రమేష్ కుమార్ కు అధికారం ఉంటుందా అని సీఎం జగన్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

Teluguone gnews banner