ఏపీ ఏపీయే.. బీహార్ బీహారే
posted on Aug 19, 2015 @ 11:18AM
ప్రస్తుతానికి ఇప్పుడు ఏపీలో అందరూ చర్చించే అంశం ఏంటంటే అది ప్రత్యేక హోదా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నా.. ఎన్నో ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా నరేంద్ర మోడీ బీహార్ కు పత్యేక ప్యాకేజీ కింద లక్షా ఇరవై వేల కోట్లు ఇస్తానని ప్రకటించడంతో ఇప్పుడు ఏపీ ప్రత్యేకహోదా పై వేడి రాజుకుంది. చంద్రబాబు నరేంద్ర మోడీని కలిసేది కూడా రేపే కావడంతో ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా పై ఉత్కంఠ రేపుతోంది.
కాగా అసలు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోయినా ఊహించిన దానికంటే ఎక్కువ ప్యాకేజీనే ఇచ్చారు మోడీ.. ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. మరోవైపు చంద్రబాబు కూడా ఏపీ ప్రత్యేక హోదా పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ప్రత్యేక హోదా ఇంకా ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాలని ఇదే విషయాన్ని మోడీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేసి రాష్ట్ర విభజన చేశారని.. ఏపీకి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలన బిహార్‌కు ప్రకటించిన ప్యాకేజీ కన్నారెండింతలు ఎక్కువ ప్యాకేజీనే ప్రకటించాలని మోదీకి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరఖండ్ విడిపోగా అప్పుడు కేంద్రం ఉత్తరఖండ్ కు ఇచ్చిన ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీనే ఏపీ ఇవ్వాలని చంద్రబాబు మోడీని కోరనున్నట్టు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్శదర్శి పి.వి.రమేశ్ ఆంధ్ర రాష్ట్రానికి కావలసిన అవసరాలు, ప్యాకేజీలో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీలో ఉన్న ఎంపీలతో కూడా రెండుమూడుసార్లు భేటీ అయి ఏపీ ప్యాకేజీపై రెండు నివేదికలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ నివేదికలపై చంద్రబాబు పీవీ రమేశ్ భేటీ అయి దీనిపై చర్చించి తుది ముసాయిదాను తయారుచేయనున్నారు.
మరోవైపు కేంద్రం కూడా ఏపీకీ ప్రత్యేక ప్యాకేజి విషయంలో ఎలాంటి పేచీ పెట్టకపోయినా ప్రత్యేక హోదాపై మాత్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని ఇప్పుటికే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబుకు నచ్చజెప్పాలని చూస్తున్నట్టు సమాచారం. నీతి ఆయోగ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే హోదా అంశాన్ని తేల్చుతామని చంద్రబాబుకు నచ్చజెప్పాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. అయితే, చౌహాన్ కమిటీ సిఫారసుతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబు మోదీపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
కాగా ఏపీ ప్రత్యేక హోదాపై అటు ప్రతిపక్షనేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంతో ఏపీని పోల్చొద్దని.. ఏపీ ఏపీయే.. బీహార్ బీహారే అని.. ఏపీకి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీనిలో భాగంగా వైసీపీ ఈనెల 29న బంద్ కూడా నిర్వహించనుంది. మొత్తానికి ప్రత్యేక హోదా పై స్పష్టత రావాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. చంద్రబాబు మోడీ భేటీలో ప్రత్యేక హోదాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాలి.