Read more!

ఓల్డ్ సిటీ బాద్షా అసదుద్దీన్ కు తప్పని నిరసన.. సమాధానం చెప్పకుండానే వెనక్కి 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రస్తుతం ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుండగా.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయా పార్టీల ముఖ్య నేతలు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌కు నిరసన సెగ తగిలింది. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌ తరుఫున ప్రచారానికి వెళ్లిన ఓవైసీని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వరద సాయంపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు వరద సాయం పదివేలు అందలేదని... ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ఆ మహిళలు ప్రశ్నించారు. మహిళల నిరసనతో అసదుద్దీన్ షాక్ తిన్నారు. గతంలో కూడా ఎంఐఎంని గెలిపిస్తే జాంబాగ్‌లో ఎలాంటి అభివృద్ధి లేదని, ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి.. గెలవగానే ముఖం చాటేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్‌ ఓవైసీ ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు.