Read more!

పంచాయతీ ముగిసింది..ప్రజలు గెలిచారు!

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి. 

 ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం. 

పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది. 

తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.

 అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు.
వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది. 

అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.    

అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.