Read more!

అన్నీ అప్పులే.. ఆదాయం పెంచే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న వైసీపీ సర్కార్!

 

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూరుకుపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసి వాటికి యూసీలు చెల్లిస్తే తిరిగి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థిక శాఖనే తన అంచనాల్లో గణాంకాల రూపంలో అంగీకరించడం గమనార్హం. భూములు అమ్మడం, అప్పులు చేయటం ఈ నిధులను పథకాలకు మళ్లించటం తప్ప ఆదాయం పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఈ శాఖకు కనిపిస్తున్నట్లుగా లేదు. బడ్జెట్ లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరికి ఈ పద్దు కింద రూ.14,235 కోట్లు వస్తాయని ఆ శాఖ భావిస్తోంది. అంటే దాదాపు రూ.17,805 కోట్లు తగ్గుతున్నాయి. 

రాష్ట్ర ఆదాయ వనరుల తీరుతెన్నులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వచ్చే మార్చి నాటికి కేవలం రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయం మధ్య తేడా రూ.86,000 ల కోట్లకు పైగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం లోటును పూడ్చడం అసాధ్యం. కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మార్చి నాటికి ఆ పద్దు కింద రూ.17,665 కోట్లే వస్తాయని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేశారు. అంటే గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయమే రూ.43,406 కోట్లు తగ్గిపోతుంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం రూ.18,230 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3,539 కోట్లు, పబ్లిక్ రుణాలు రూ.3,000 ల కోట్లు, కేంద్ర పథకాల నిధులు రూ.17,805 కోట్లు, పన్నుల్లో వాటా రూ.9,000 కోట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైగా ఉంది. 

కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,883 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికంలో ఈ పద్దు కింద రూ.6,398 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.6,623 కోట్లు వచ్చాయి, మూడో త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో రూ.4,440 కోట్లు వచ్చాయి. డిసెంబర్ లో రూ.2,200 ల కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగవ త్రైమాసికంలో మాత్ర పన్నుల్లో వాటా అమాంతం రూ.15,188 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది. వాస్తవానికి నాలుగో త్రైమాసికం లోనూ పన్నుల్లో వాటా రూ.6,600 ల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పెట్టారు. ఈ ఆదాయం రూ.18,230 కోట్ల మేర తగ్గి, రూ.64,562 కోట్లకు పరిమితమవుతుందని ఆర్ధిక శాఖ భావిస్తోంది. పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది కూడా రూ.3,539 కోట్లకు తగ్గుతుందని అంటున్నారు. పబ్లిక్ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ కేంద్రం మొదటి మూడు త్రైమాసికాలకు రూ.29,000 ల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో త్రైమాసికానికి కేంద్రం అనుమతి లభిస్తేనే ఇంకో రూ.3,417 కోట్లు అప్పు రూపంలో తెచ్చుకోగలం. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పబ్లిక్ రుణాలు తీసుకునే అవకాశం ఉండదు.