Read more!

మోడీ అహంభావం.. జనం తిరస్కారం! తొలి రెండు విడతల పోలింగ్ సరళి సంకేతం అదేనా?

ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ రెండు విడతల ఎన్నికలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. తీరా పోలింగ్ పూర్తి అయిన తరువాత ఆ ఆశలు ఆవిరయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ వెనుకబాటుకు కారణాలేమిటని ఆలోచిస్తే అతి ఆత్మవిశ్వాసం, అహంభావం కారణాలుగా కనిపిస్తాయి.  బీజేపీకి ప్రజాదరణ తగ్గడానికి, లేదా ప్రజావ్యతిరేకత పెల్లుబకడానికి ప్రధాన కారణం మోడీ అహంభావ పూరిత వైఖరిగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, ఈ సారి తమ సీట్ల సంఖ్య ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని  400 మార్కు దాటుతుందని మోడీ ఘనంగా ప్రకటించారు.

2004లో వాజపేయి ప్రభుత్వం   భారత్ వెలిగిపోతోంది అన్న నినాదంతో  ఎన్నికలకు వెళ్లి చతికిల పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో తొలి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత   2004 ఫలితమే పునరావృతమయ్యే పరిస్థితులు కానవస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్నికలకు ముందే మోడీ ఈ సారి మరిన్ని కఠోర నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే హిందూ ఓట్లను ఆకర్షించేందుకు కామన్ సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, సీఏఏ( ను పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఈ ప్రకటనలు ఒక విధంగా దుస్సాహసంగానే చెప్పాలి. హిందూ ఓట్ల పోలరైజేషన్ కు దేశంలో మత పరమైన చీలకకు కూడా వెనుకాడబోమని మోడీ చెప్పకనే చెప్పారని అంటున్నారు.ఇది కూడా మోడీ సర్కార్ కు ప్రతికూలంగానే మారిందని అంటున్నారు. 

ఇక ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు మోడీ సర్కార్ గత పదేళ్లుగా అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది.   తన ప్రభుత్వ విధానాలతో విభేదించే విపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి,సీబీఐ లను ప్రయోగించి విధేయులుగా మార్చుకోవడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలను జనం విశ్వసించేలా పరిస్థితులు ఉండటం కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైందన్నది పరిశీలకుల విశ్లేషణ.  బీజేపీ ఆర్థిక, రాజకీయ విధానాలపై విమర్శనాత్మకంగా మాట్లాడే మేధావులను అర్బన్ నక్సలైట్లుగా  ముద్ర వేయడం మధ్య తరగతి వర్గంలో మోడీ సర్కార్ పట్ల విముఖత ఏర్పడేందుకు కారణమైందంటున్నారు. ఇక  రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించించడం కూడా ప్రజాస్వామ్య వాదులలో ఆందోళన రేకెత్తిం చిందని అంటున్నారు.

రెండోవిడత పోలింగ్ జరిగి 88 లోక్ సభ స్థానాలలో బీజేపీ మహా అయితే 28 స్థానాలలో విజయం సాధిం చే అవకాశాలు ఉన్నాయనీ, ఈ విడతలో పోటీలో ఉన్న   బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ గోవెల్, హేమమాలినీ,రాజీవ్ చంద్రశేఖర్, ఓం బిర్లా, తేజస్వీ సూర్య వంటి వారి విషయంలో ఫలితాలు రాకముందే ఓటమి ఖరారైపోయిందని అంటున్నారు. అదే విధంగా మొదటి విడత  102 స్థానాలకు జరి గిన పోలింగ్ లో బీజేపీ 30 స్థానాలలో విజయం సాధిస్తే గొప్పే అన్న అంచనాలు ఉన్నాయి. రాజపుట్, జాట్, ఠాగూర్ సామాజికవర్గాల పట్ల టికెట్ల విషయంలో బీజేపీ వివక్షా పూరితంగా వ్యవహరించిందన్న ఆగ్రహం ఆయా వర్గాలలో బలంగా కనిపిస్తోంది. రాజస్తాన్ లో వసుంధరా రాజే, మహారాష్ట్ర లో చౌహన్ లను పక్కన పెట్టడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారిందని అంటున్నారు. యూపీ, రాజ స్థాన్, ఎంపీ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర లలో దళితులు,ఆదివాసీలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొదటి నుంచీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. మోదీ ఈసారి మోడీ తన అద్భుత వాగ్ధాటితో చేస్తున్న వాగ్దానాలను కూడా ప్రజలు నమ్మేపరిస్థితి లేదంటున్నారు.  నల్లధనం వెలికి తీస్తా నని, అలా విదేశాలలో మగ్గుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి పేదల ఖాతాలలో వేస్తామని మోడీ చెప్పిన మాటల డొల్లతనాన్ని జనం అర్ధం చేసుకున్నారని, ఈ సారి అటువంటి వాగ్దానాలను జనం విశ్వసించే పరిస్థితి లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు అని గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన మోడీ.. రెండో సారి అధకారంలోకి వచ్చిన తరువాత ఆదాయం రెట్టింపు మాట అటుంచి రైతుల కష్టాలను రెట్టింపు చేశారన్న ఆగ్రహం వ్యవసాయ దారులలో తీవ్రంగా ఉందంటున్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆయన అనాలోచిత నిర్ణయం,  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన వాగ్దానాన్ని విస్మరించడం, కరోనా సమయంలో వలస కూలీల ఆకలి కేకలు,  వంటి మోదీ ప్రభుత్వ వైఫల్యాలు ఈ ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.   ఇక చివరి క్షణంలో  హిందూత్వ అంశాన్ని మోదీ తన ఆఖరి ఆయుధంగా ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకా శాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.