ఏపీ మద్యం కుంభకోణం.. ఏ క్షణంలోనైనా ఆ ముగ్గురూ అరెస్టు?
posted on May 5, 2025 @ 3:09PM
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో ముగ్గురు కీలక నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైందా? హైకోర్టు, సుప్రీం కోర్టూ కూడా ముందస్తు బెయిలుకు నిరాకరించడంతో వారి అరెస్టు ఇక అనివార్యమా? అంటే ఔనన్న సమాధానమే వస్తుంది. ఇంతకీ ఆ ముగ్గురూ ఎవరంటారా? జగన్ మాజీ పిఎ ధనుంజయ్ రెడ్డి, పిఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, అలాగే జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప. ఈ ముగ్గిరికీ అరెస్టు నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వలేమని తొలుత హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టూ కూడా ఖరాఖండీగా చెప్పేశాయి. దీంతో ఏ క్షణంలోనైనా వీరి అరెస్టు జరగొచ్చని అంటున్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డిని వారం రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. అలాగే రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ దుబాయ్ పరారవ్వడానికి ప్రయత్నిస్తూ చెన్నై విమానాశ్రయంలో దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో వీరు ముగ్గురూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే సుప్రీం కోర్టు వారి పిటిషన్ విచారణనుఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ నెల 7న హైకోర్టులో విచారణ ఉన్నందున వారి బెయిలు విషయంలో ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వజాలమని స్పష్టం చేసింది. అంతే కాకుండా చట్టపరంగా ముగ్గురినీ కూడా అరెస్టు చేయవచ్చని పేర్కొంది. ఇక ఇదే కేసులో మిథున్ రెడ్డి ఇప్పటికే దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ తో కలిసి వీరి పిటిషన్ ను కూడా ఈ నెల 8న విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడు తున్నారు.