కేసీఆర్ పై 64 కేసులు
posted on Jan 25, 2019 @ 5:10PM
తెలంగాణ సీఎం,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని గజ్వేల్ ఓటరు శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్‌పై 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం 2 కేసులు ఉన్నట్లు మాత్రమే చూపారని పిటిషనర్ పేర్కొన్నారు. కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుపై కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికారులకు తెలియకుండా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. దివాకర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆయన పిటీషన్‌లో కోరారు. పోలింగ్ శాతంలోనూ తేడాలున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.
అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి అన్నిరకాలుగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి పిటిషన్‌లో ఆరోపించారు. అక్రమ మార్గంలో గెలిచిన పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో హైకోర్టును కోరారు. రేవంత్ బాటలోనే మరో నేత ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గెలుపుపై నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ గెలిచిందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.