26/11 తలచుకుంటేనే వణుకొచ్చేస్తుంది
posted on Nov 26, 2012 @ 3:12PM
నాలుగేళ్లక్రితం.. సరిగ్గా.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున ముంబై నగర వీధుల్లో పాకిస్తానీ ముష్కర మూకలు అరాచకం సృష్టించాయి. కనిపించినవాళ్లనల్లా కాల్చిపారేస్తూ టెర్రరిస్టులు ఇష్టారాజ్యంగా చెలరేగారు. ముంబైపై ఉగ్రవాదులు విసిరిన పంజా 166మంది ప్రాణాల్ని పోగొట్టుకున్నారు.
క్షణాల్లో పదులకొద్దీ ప్రాణాల్ని హరించిన టెర్రరిస్టులు ముంబై నగరాన్ని శ్మశానవాటికగా మార్చేశారు. ఎటుచూసినా ఏడుపులు, పెడబొబ్బలు, ఎవరు బతికున్నారో, ఎవరు చనిపోయారోకూడా తెలీని స్థితి. పగవాడిక్కూడా రాకూడదనుకునేంతటి దారుణ స్థితి..
ఇప్పటికీ ఆ పీడకల ముంబై వాసుల్ని వెన్నాడుతూనే ఉంది. ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది కసబ్ ని 21న పుణెలోని ఎరవాడ జైల్లో ఉరితీశాక బాధితుల్లో కొందరికి కడుపుకోత తగ్గింది. తమవాళ్లని అన్యాయంగా పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసుడ్ని వార్తని విని చాలామంది పండగ చేసుకున్నారు.
ముంబై మహానగరాన్ని అతలాకుతలం చేసిన అలాంటి దారుణమైన స్థితి మరెన్నటికీ కలగకూడదంటూ ఏటా ఈ రోజున కోట్లాదిమంది ప్రార్ధనలు జరుపుతున్నారు. ముంబై చౌపట్టీలోని పోలీస్ జింఖానా గ్రౌండ్స్ల్ లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే, మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ హాజరై మృతులకు ఘన నివాళి అర్పించారు.