ప్రధాని చక్రవర్తి చలించాడు. "గుడ్ లక్ మై బోయ్, గుడ్ లక్ రవీ!" అంటూనే ఆప్యాయంగా తమ రెండు చేతులతోను రవితేజ రెండు చేతులను పట్టుకుని ఆశీర్వదించారు.
"థాంక్యూ సర్!" అంటూనే ఇక వెళ్ళిపోవడానికి గిర్రున వెనుదిరిగాడు రవితేజ.
"రవీ, ఒక్కమాట! తన తండ్రి కేసును నువ్వు దర్యాప్తు చేస్తున్నావన్న సంగతి రీతూకు తెలిసిన మరుక్షణం- ఆమె నిన్ను నమ్మకపోవడమే కాదు, నిన్ను మార్చివేసేంత వరకు ఊరుకోదు. అప్పుడు నీకు ఈ అవకాశమూ ఉండదు. చేజేతులా జారవిడుచుకున్న వాడివవుతావు. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తావో, మరెంత నిగూడంగా వ్యవహరిస్తావో- ఇక నీ ఇష్టం!" హెచ్చరించారు ప్రధాని చక్రవర్తి. అతని విజ్ఞతను మరీమరీ తట్టి లేపారు.
"మీ నమ్మకాన్ని నిలుపుకుంటాను, సర్!" రవితేజ ముందుకు కదిలాడు.
రవితేజ మనసు ఇప్పుడు మలయమారుతీ వీచికాతూలికే అయింది.
గుండె శబ్దం రీతూ పేరునే ధ్వనిస్తున్నది. ఎడద ఒక సుందరనందన వనం కాగా, అక్కడ నర్తిస్తున్నది రీతూ రూపం. ఇవ్వాళ ప్రకృతి యావత్తూ ఇలా పరవశించిపోతున్నదేమి...
అదే సమయంలో రవితేజ మెదడులో రీతూ తన మీద పెంచుకున్న విద్వేష చేదనకు పథకం రూపొందింది!
* * *
"మంచి నవల దాని కథానాయకుని నిజాయితీని ఆవిష్కరిస్తుంది. చెడ్డ నవల దాని రచయితలో దాగి వున్న నిజాన్ని వెలికితీస్తుంది" -బెస్టర్టన్.
'ది బ్లడ్' ఆంగ్ల నవలను ఏకాగ్రతతో అప్పటివరకు చదివిన రవితేజ బెస్టర్టన్ నిర్వచనాన్ని మననం చేసుకున్నాడు.
సాహిత్యంలో ఇటీవలి కాలంలో వస్తున్న వింత వింత రీతులను, విపరీతమైన ధోరణులను రవితేజ గమనిస్తూనే వస్తున్నాడు. అతను పుస్తకాలపురుగు. ప్రతిదానినీ చదువుతాడు. చదివి, సమీక్షించుకుంటాడు. మానవ జీవితంతో అన్వయించుకుంటాడు.
'నేటి కాల్పనిక సాహిత్యం చాలావరకు భ్రష్టుపట్టిపోయింది. పాఠకుల మతులు పోగోడుతున్నదనడంలో అతిశయోక్తి లేదు. కొందరు పిశాచాల పైశాచికాల గురించి వ్రాస్తుంటే మరికొందరు అతీంద్రియ శక్తుల ఆటపాటలను అభివర్ణిస్తున్నారు. ఇంకొందరు హింసలు-రక్తపాతాలలో మునగానాం తేలానాంగా వుంటే వేరొక కొందరు అతిశయోక్తుల అల్లికతో అలరారుతున్నారు. ఎక్కువ మంది అశ్లీలమైన సెక్సును ఆశ్రయించి బ్రతుకుతున్నారు.
'పత్రికలు, ప్రచురణకర్తల సంఖ్య పెరగడంతో రచనలకు డిమాండ్ పెరిగింది. పత్రికల ప్రమాణాలు పడిపోతున్నాయి. పాఠకుల అభిరుచుల స్థాయి దిగజారుతున్నది. వారిలో విషయ పరిజ్ఞానం, విమర్శన, విశ్లేషణాశక్తులు సన్నగిల్లిపోయి, అల్పానందం, స్వల్పానుభూతులకు వారు సంతృప్తిచెందుతున్నారు. అలవాట్లకు బానిసలవుతున్నారు.
'చౌకబారు సాహిత్యం కుప్పతెప్పలుగా, విచ్చలవిడిగా పుట్టుకు రావడానికి కారణం వివిధ సాహితీ ప్రక్రియలకు నిర్దిష్టమైన ప్రమాణాలలో 'సెన్సార్' అనేది లేకపోవడం ఒక కారణం కావచ్చు. అయితే, కొన్ని చట్టాల, శాసనాలు నామకార్థం లేకపోలేదు. కాని, అమలు జరిపే అధికారులు అలసత్వాలకు, మొహమోటాలకు, ప్రలోభాలకు లోనుకావడం మరొక కారణం కావచ్చు.'
ఇలా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్న అమరేంద్ర కేసు దర్యాప్తు అధికారి రవితేజకు తళుక్కున ఒక అభిప్రాయం స్పురించింది. ఇలాగే 'ది బ్లడ్' నవలను కూడా వివిధ కోణాల నుంచి విశ్లేషించుకుంటూవస్తే, ఆ పరిశీలనలో, ఆ పరిచ్చేదంలో తన కేసుకు ఏదేని చిన్న ఆధారం పొడచూపవచ్చు. దాని రచయిత 'శ్రీ' ఎవరో చూచాయగా తెలియవచ్చు...!
'ది బ్లడ్' నవలను తెలుగులో కాక ఇంగ్లీషులో వ్రాశాడు రచయిత 'శ్రీ'. ఎందుకని?
'శ్రీ' తెలుగువాడనే విషయం ఆ రచనా ధోరణి, శైలి, పదజాలం, భావన, వర్ణనలు ఇట్టే పట్టిఇస్తున్నాయి.
తెలుగులో వ్రాసి ముద్రిస్తే- పరిమితం. అదే ఆంగ్లంలో అయితే-అపరిమితం! ఇంగ్లీషుకు యూనివర్సల్ రీడర్ షిప్పు, ప్రపంచ మార్కెట్టు వున్నాయి. పథకం భేషుగ్గా వుంది.
అయితే, అంత రిస్క్ తీసుకుని, ఈ ప్రాజెక్టును స్పాన్సర్ చేయడం ఒక సామాన్య రచయితకు, ఒక సాదాసీదా పబ్లిషరుకు సాధ్యమయే విషయం కాదు. ఇందుకు ఆర్ధిక వనరులు సమృద్ధిగా గల ప్రచురణకర్త ముందుకు వచ్చివుండాలి. అలాగే, రచయిత సంప్రదాయసిద్ధంగా తెలుగువాడైనా, ఇంగ్లీషు భాషా- వాజ్మయాలలో ఉద్దండపిండం అయివుండాలి. అతనికి అంతర్జాతీయ అవగాహన ఉండి వుండాలి. సమకాలీన సంఘటనలు సజావుగా తెలిసిన అనుభవజ్ఞుడై వుండాలి. చొరవ, సమయస్పూర్తి, తెలివితేటలు సమృద్ధిగా గలవాడై వుండి తీరాలి...!