తప్పు చేసిన మహామనిషి
వసుంధర
అయన తెల్లటి గ్లాస్కో పంచె ధరించాడు. దానిపైన మల్లెపూవూ లాంటి పోలీఎస్టర్ లాల్చీ , మనిషి ఆజానుబాహువు. ముఖంలో ఎటువంటి వారికైనా గౌరవం పుట్టించే గంభీర్యం.
అయన వయసు యాభై దాటి వుండవచ్చు. అయినా తలపై అక్కడక్కడ మాత్రమే నెరిసిన వెంట్రుకలున్నాయి. మీసాలు నల్లగా మెరుస్తున్నాయి.
హోటల్లోంచి బయటకు వస్తూ అయన టాక్సీ కోసం ఆగాడు. టాక్సీ రాగానే ఆపి ఎక్కి కూర్చుని - "మందిరం వీధి!' అన్నాడు.
టాక్సీవాలా ఆశ్చర్యపోయాడు. అయన వేషానికీ, అభిరుచులకీ ఎక్కడా పోలిక లేదనుకున్నాడు.
మందిరం వీధి గురించి అందరికీ తెలిసిందే!
అది వేశ్యలుండే చోటు....అందులోనూ చౌకబారు వేశ్యలు....
అక్కడకు ఎక్కువగా పాటక జనం వెడతారు. ఉన్న వాళ్లెవరైనా వెళ్ళినా టాక్సీలో ఎవరూ వెళ్ళరు.
"సార్---మీరీ ఊరికి కొత్తా?" అన్నాడు టాక్సీవాలా.
"ఊ" అన్నాడాయన.
"మందిరం వీధి తమబొంట్లు వెళ్ళేది కాదు. కావాలంటే తమను ఎలక్ట్రానిక్ హవుస్ తీసుకొని వెడతాను " అన్నాడు టాక్సీవాలా.
"ఎలక్ట్రానిక్ హవుసా - అదెక్కడ?" అన్నాడాయన.
"మార్కెట్ సెంటర్లో ఉంది సార్. యడంతాస్తులు మేడ అది. గ్రౌండ్ ప్లోర్ లో ఎలక్ట్రానిక్ షాపు లుంటాయి. మిగతా మేడలో మీకు కళ్ళు చెదిరే క్వాలిటీ పిల్లలు దొరుకుతారు. అక్కడ ఎప్పుడూ యాభై మందికి తక్కువ కాకుండా సినీ తారల్లాంటి పిల్లలుంటారు. ఈరోజున్న వారు రేపుండరు. అక్కడ మీరు ఫోటో చూసి ఎన్నిక చేసుకోవచ్చు...."
టాక్సీవాలా సగంలో ఆపి -- "సరేలే -- ఆ విషయం రేపు చూద్దాం. ఈవేళకి మందిరం వీధికి పోనీయ్...." అన్నాడాయన.
"సార్ --- అక్కడుండేది అలాగాజనం...." అని టాక్సీవాలా ఏదో చెప్పబోయాడు. అయన అతడి వంక చురుగ్గా చూశాడు.
టాక్సీ కదిలింది. సరిగ్గా అయిదు నిమిషాల్లో రామ మందిరం ముందాగింది. అయన టాక్సీ వాలాకు డబ్బిచ్చి -- "నువ్వే వెళ్ళు!" అన్నాడు.
ఆ ఊళ్ళో మందిరం వీధికి సంబంధించి ఎన్నో కధలున్నాయి. ఎవరైనా ఆ వీధికి వెడుతున్నామన్నా ఆఖరికి రామ మందిరానికి వెడుతున్నామన్నా అంతా అనుమానంగా చూస్తారు.
అయితే రామమందిరానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.
ముందక్కడ రామమందిరం ఒక్కటే ఉండేదనీ -- ఆ మందిరం లో ఉండే దేవదాసికి -- ఆ వీధిలో పెద్ద మేడ వుండేదనీ -- ఆమె సంతానమే క్రమంగా మందిరం వీధి నంతా ఆక్రమించుకున్నదనీ కొందరంటారు.
ముందక్కడ వేశ్యావాటిక మాత్రమే ఉండేదనీ -- అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల కొందరు పెద్దలక్కడో మందిరం కట్టించి దానికి మహిమలు అంటగట్టారని కొందరంటారు.
ఆవీధిలో జరిగే పాపాన్నీ యెప్పటికప్పుడు కడిగి వేయడం కోసం ఆ మందిరాన్నక్కడో పుణ్యాత్ముడు కట్టించాడని కొందరంటారు.
టాక్సీ దిగి అయన తిన్నగా మందిరంలోకి వెళ్ళాడు.
అక్కడ పెద్దగా జనం లేరు. ఉన్నవాళ్ళోకరి వంక ఒకరు చూడటం లేదు. పలకరించుకోవడం లేదు.
అయన -- విగ్రహం వంక చూశాడు.
జీవకళ ఉట్టిపడుతున్న పాలరాతి విగ్రహాలు.
సీతారామలక్ష్మణులు -- వారి పాదాల చెంత హనుమంతుడు.
పవిత్రతకు మారు పేరు సీత. ఏకపత్నీ వ్రతుడు రాముడు. అన్నకోసం భార్యను వదిలిన వాడు లక్ష్మణుడు. స్వామి సేవకు మించి మరేమీ కోరని హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి.
వారిలో అందరూ స్వసుఖాన్ని త్యాగం చేసినవారే . వారి గురించి వెలసిన మందిరం --- ఒక వీధికి పేరుగా వుంది. ఆ వీధికి అందరూ స్వసుఖాన్ని ఆశించి తప్పు చేయడానికి వెడతారు.
"స్వామీ! నన్ను మన్నించు --" అనుకున్నాడాయన మనసులో.
పూజారి పళ్ళెం తో అయన ముందుకు వచ్చాడు.
"తప్పు చేయడం మానవ సహజం. మనిషి తప్పుల్ని క్షమించడానికే దేవుడున్నాడు. దేవుడి కుంకుం నొసట రాసుకుంటే -- చేసిన తప్పులన్నీ తొలగిపోవడమే కాదు, చేయబోయే తప్పులూ కుంకం నొసటనున్నంత కాలం -- దేవుడికే చెందుతాయి. మనిషి నంటవు...." అన్నాడు పూజారి.
అయన పూజారి వంక అదోలా చూశాడు. తప్పు చేయమని ప్రోత్సహిస్తున్న వాడిలా ఉన్నాడు పూజారి.
కుంకం కాస్త ఇలా యివ్వండి...." అన్నాడాయన.
"పదిపైసల పొట్లం కావాలా, రూపాయ పొట్లాం కావాలా?" అన్నాడు పూజారి.
"రెండింటికి తేడా ఏమిటి?"
"పది పైసల పొట్లం సామాన్యులకు, రూపాయి పొట్లం గోప్పవారికి...."
"రెండింటికి తేడా ఏమిటి?" మళ్ళీ అడిగాడాయన.
"రూపాయి పొట్లం లోని కుంకుం పెట్టుకుంటే --- దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. మనిషి చేసే తప్పులు క్షమించబడడమే కాదు-- జీవితంలో పైకి పోయే అవకాశాలు పెరుగుతాయి. కీర్తి, ప్రతిష్టలు వస్తాయి. ఉన్నత పదవులు లభిస్తాయి...."
పూజారి యింకా ఏదో చెబుతుండగానే --"పది పైసలు పోట్లాలో పదివ్వండి ---"అన్నాడాయన.
"బాబూ -- తమరు రూపాయి పొట్లాలు తీసుకోండి" అన్నాడు పూజారి కంగారుగా.
అయన నవ్వి -- "నాకు పదిపైసల పోట్లాలే కావాలి" అన్నాడు.
పూజారి గొణుక్కుంటూ -- "{తమబొంట్లూ కూడా పదిపైసలు పొట్లాలు కావాలనడం అన్యాయం --" అని పొట్లాలు తెచ్చిచ్చాడు.
అయన ఆ పోట్లాలందుకొని -- "ఉన్నవాడినొకలాగా, లేని వాడినోకలాగా దీవించడం మనిషికే చెల్లింది. దేవుడూ అదే పనిచేస్తే అయన దేవుడు కాలేడు---" అన్నాడు.
"దేవుడు యెదుటి మనషి శక్తిని బట్టి ప్రతిఫలం రాబట్టాలనుకుంటాడు. ఒక కూలివాడు తను కష్టపడి సంపాదించిన దాంట్లోంచి మనస్పూర్తిగా పది పైసలిచ్చినా అయన సంతృప్తి చెందుతాడు. లక్షలకు లక్షలున్న ,మనిషి ఆ లెక్కన ఎంతిస్తే దేవుడికి సంతృప్తి కలుగుతుంది?" అన్నాడు పూజారి.
"నేనన్నదదికాదు, పదిపైసలిచ్చిన వాడినొకలాగా, రూపాయిచ్చినవాడి నొకలాగా ఆదరించేవాడు దేవుడు కాదు. తీసుకున్నవి పది పైసల పోట్లాలైనా నే నిచ్చే దెలాగూ రూపాయే!" అంటూ పదిరూపాయలిచ్చాడు పూజారికాయన.
పూజారి ముఖంలో ఆనందం కనబడింది.
"ఇప్పుడు దేవుడి విషయమెలాగున్నా మీ దీవెనలు నాకు తప్పక లభిస్తాయి...." అంటూ అక్కణ్ణింఛి కదిలాడాయన.
3
ఇలా వీధిలో అడుగు పెట్టగానే అలా నలుగురాయన చుట్టూ మూగారు. అంతా సరుకును వర్ణిస్తున్నారు.
"అబద్దాలు చెప్పొద్దు నాకు, పదహారేళ్ళ దాటినా వాళ్ళూ, ఇరవై ఏళ్ళ లోపు వాళ్ళూ అయుండాలి.... అన్నాడాయన.
"గొప్ప టెస్టు బాబుగారిది...." అన్నాడొకడు.
"మంగాయమ్మ కంపెనీకి వెళ్ళండి బాబూ...." అన్నాడింకొకడు.
"కాదు.....పంకజం కంపెనీకి...."
"కాదు వీరామణి కంపెనీ...."
మొత్తం మూడు కంపెనీలు పేర్లు తేలాయి. వాళ్ళక్కడ గొడవ పడుతున్నారు.
అయన చిరాగ్గా..... "మీ గొడవలతో నన్ను వేధించవద్దు. నా అవసరం కోసం బహుశా అన్ని కంపెనీలకు వెడతాను. ముందు మంగాయమ్మ కంపెనీకి దారి చూపించండి...." అన్నాడు.
ఒకడాయన్ను తన వెంట రమ్మన్నాడు. ఇద్దరూ ఓ పాత మేడ ముందుకు వెళ్ళారు. అతడాయన్నక్కడ ఆగమని తను లోపలకు వెళ్ళాడు. కొద్ది క్షణాల్లో ఓ నడివయస్సు రాలితో తిరిగి వచ్చాడు.
ఖరీదైన పట్టు చీర, కొప్పులో పూలు, కళ్ళకు కాటుక, తాంబూలంతో గారపట్టినా పళ్ళు, నడకలో భారీ శరీరానికి తగిన వయ్యారాలు. మెడలో మందంగా ఉన్న కాసుల పేరు.
"నమస్కారం బాబూ -- లోపలకు దయచేయండి -" అందామె.
అయన హుందాగా ఆమె ననుసరించాడు. బ్రోకరు వెళ్ళిపోయాడు.
"చెప్పండి బాబూ! ఈ వీధికి నా కంపెనీ నంబర్ వన్, ఇక్కడ దొరికే సుఖం విదేశాల్లో కూడా తమకు దొరకదు...."అందామె.
"నా సుఖం శరీరానికి కాదు.....అన్నాడాయన.
'అంటే?" అంది మంగాయమ్మ.
"నేను చూసి ఆనందిస్తాను, మనిషి శిల్పం లా వుండాలి. మంచి వయసులో వుండాలి. పదహారు ---- ఇరవైకి మద్యన్నమాట...."
"తెలుసు బాబూ - ఇరవై యేళ్ళు దాటిన వాళ్ళను నా కంపెనీలో ఉంచుకోను. పదహారు దాటందేచేర్చుకొను.... సరిగ్గా మీకోసమే నా వాళ్ళనందర్నీ నేనిక్కడ పోగేసినట్లుంది. మీరే చూద్దురు గానీ ...." అంటూ చప్పట్లు కొట్టింది మంగాయమ్మ.
బిలబిలలాడుతూ పదహారు మంది అమ్మాయిలక్కడకు వచ్చి వరుసగా నిలబడ్డారు.
అయన వారి వంక తేరిపార చూశాడు.
అందరూ రాటు దేలి ఉన్నట్లున్నారు. ఒక్కొక్కరికీ తమవంటి మీద దుస్తులు గురించి శ్రద్ధ లేదు. ముఖంలో సిగ్గు లేదు.
వారిలో యిద్దరామ్మాయిలు మాత్రం బాగా లేతగా అగుపిస్తున్నారు. వారి ముఖాల్లో రవంత సిగ్గు కూడా తొంగిచూస్తోంది.
అయన ఆ యిద్దర్నీ ఎన్నుకున్నాడు.