Read more!
Next Page 
ది పార్టనర్ పేజి 1

                                 

                                                     ది పార్టనర్

                                                                                      చందు హర్ష వర్ధన్

 

                                   

 

    "డాం"
    పెద్ద విస్పోటకం....
    ఆ అదటుకు విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాలు ప్రతిధ్వనించాయి ....
    బ్రహ్మ ప్రళయం వచ్చినట్టు చుట్టూ పక్కల వాళ్ళు బెంబేలు ఎత్తి వెనుదిరిగి చూడకుండా పరుగు దీశారు.
    అరవ నెంబర్ ప్లాట్ ఫారం చివరగా దక్షిణపు దిశగా గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ .....ఉత్తరపు వైపున చివరగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేషన్ వున్నాయి ....
    బందోబస్తులు, దొంగతనాలు, లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన కేసులు దర్యాప్తు చేయడం గవర్నమెంట్ రైల్వే పోలీస్ విధి...
    రైల్వే ప్రాపర్టీని , రైల్వే వ్యాగన్ లలో ట్రాన్స్ పోర్ట్ అయ్యే సరుకును ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ది.....
    ప్లాట్ ఫారం చివర ఆర్. పి. ఎఫ్. స్టేషన్ దగ్గరలో తన తోటి సిబ్బందితో బాతా ఖానీ కొడుతున్న ఆర్. పి.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సింహాచలం గుండె దడదడ లాడింది.
    రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి ఏం జరిగిందో అర్ధం గాక ఒక్కసారిగా స్టేషన్ బయటకు పరుగు తీసారు.
    రైల్వే స్టేషన్ కు ఒక వైపుగా ఆరు, ఏడు ప్లాట్ ఫారాల మధ్య రెస్ట్ లైన్ మీద వున్న రైల్వే భోగి సమీపంలో అప్పుడే జనం గుమికూడుతున్నారు.
    అక్కడే ఏదో జరిగిందని అర్ధం కావడంతో సింహాచలం అటు పరుగుపెట్టాడు.
    డామేజ్ అయిన ఎస్. ఎల్. ఆర్ బోగిణి వైజాగ్ పాసింజర్ నుంచి డిటాచ్ చేసి నాలుగు రోజుల క్రితం ఆ పట్టాలపై వుంచారు.
    ఆ భోగిని సమీపించే కొలదీ భరించలేనంత దుర్గంధం....
    ఏదో చచ్చిన జంతువూ కుళ్ళిన కంపు....
    ఆ దుర్వాసనకు సింహాచలం కడుపులో దేవినట్టయింది....
    ఆర్. ఫై. ఎఫ్ . హెడ్ కానిస్టేబుల్ సింహాచలం కంటికి కనిపించిన దృశ్యం చూసి మ్రాన్పడి పోయాడు.
    లావేట్రి తలుపు దగ్గరకు వేసివున్నా ప్లాట్ ఫారం వైపు ఉన్న కిటికీ నుండి లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తున్నది.
    "డామేజ్ డ్ ' అన్న అక్షరాలు లావెట్రీ తలుపుల మీద చాక్ పీస్ తో వ్రాయబడి వున్నాయి. అలా ఎవరు రాసి వుంటారో ఊహిస్తూ సింహాచలం సింహాచలం ఆ తలుపు నెట్టాడు.
    మరుక్షణం కుళ్ళిన ద్రవం ఒక్కసారిగా బయటకు విరజిమ్మింది.
    అదిరిపడుతూ ముఖాన పడిన ఆ ద్రవాన్ని తుడుచుకుంటూ ఓ అడుగు వెనకకు వేశాడు...
    లోపల లావాటి డ్రమ్ము.....
    అడ్రమ్ము మూత దూరంగా పడి వున్నది.
    దానిలో నుండి టాప్ తెగిన నీటి ప్రవాహం పైకి విరజిమ్ముతున్నట్లు పౌంటెన్ ల ఎరుపు పసుపు రంగులతో కలిసి ఉన్న కుళ్ళిన ద్రవం చాలా సేపటివరకూ అలా చిమ్ముతూనే వుంది.
    హేండ్ కర్చీఫ్ తో ముక్కులను మూసుకుంటూ నెమ్మదిగా లోపలకు అడుగుపెట్టాడు సింహాచలం.
    వాంతి వస్తున్నా ఫీలింగ్ ను బలవంతాన అణచి వేసుకుంటున్నాడు అతను....
    ఐదు అడుగుల ఎత్తు వున్న ఆ డ్రమ్ము అక్కడకు ఎలా వచ్చిందో అసలు లోపల నుండి వస్తున్న ఆ కుళ్ళిన కంపు.....చండాలమయిన ద్రవం చిమ్మడం ఏమిటో తెలుసుకోవాలన్న పట్టుదలతో ఆ డ్రమ్మును సమీపించి తొంగి చూశాడు.
    మరుక్షణం కళ్ళు తిరిగి భళ్ళున వాంతి చేసుకున్నాడు సింహాచలం.
    అతను తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది.
    అతని పరిస్థితి చూసిన మిగిలిన సిబ్బంది లోపలకు అడుగు పెట్టె సాహసం చేయలేదు.
    సింహాచలం తమాయించుకుంటూ ఆ డ్రమ్ములో కనిపిస్తున్న దృశ్యాన్ని మరొకసారి పరిశీలనగా చూశాడు.
    పూర్తిగా కుళ్ళిపోయిన మనిషి తల స్పష్టంగా కనిపిస్తున్నది.
    అటూ ఇటూ తిరుగుతున్న పురుగులు....
    కపాలం చిట్లి దాని నుండి ద్రవం పైకి విరజిమ్ముతోంది.
    చండలమయిన కంపు ఎందుకు వస్తున్నదో అప్పుడు తెలిసింది.
    చనిపోయిన శవాన్ని డ్రమ్ము లో పెట్టి మూసివేయడం వలన లోపలే కుళ్ళిపోయింది. గట్టిగా మూత బిగించి ఉండడం వలన పురుగులు పట్టడంతో పాటు గాలి బయటకు వెళ్ళే అవకాశం లేక లోపల వున్న ఆ గాలి వేడిగా మారి కుళ్ళిన ద్రవం నుంచి రసాయనాలతో కలిసి వత్తిడి పెరిగి మూతను బయటకు నెట్టివేసింది.
    అంతవరకూ అదిమి వుంచబడిన ఆ ఒత్తిడి ఒక్కసారిగా బయట పడడంతో ఏదో బాంబు పేలినట్టు దారుణమయిన శబ్దాలను సృష్టించింది.
    పీపాపై వున్న మూట ఎంత గట్టిగా బిగించి, ఎన్ని తాళ్ళు వేసి కడితే మాత్రం లోపల నుండి వచ్చిన ప్రెషర్ కు ఆ మూత ఊడి దూరంగా పడిపోయింది.
    ఆ కేసు దర్యాప్తు చేయవలసింది గవర్నమెంట్ రైల్వే పోలీసులు కాబట్టి సింహాచలం ఆ విషయాన్ని లేడీ రైల్వే ఇన్స్పెక్టర్ ధీరజకు తెలియ చేయడానికి హుటాహుటిన గవర్నమెంట్ రైల్వే పోలీసు స్టేషన్ కు పరుగు పెట్టాడు.
    రైలు పెట్టెలో శవం దొరికిన విషయం రైల్వే స్టేషన్ లోనే కాదు .....విజయవాడ సిటీ అంతటా చర్చనీయాంశం అయింది!
    
    
                                                    *    *    *

    ఫోన్ రీసివ్ చేసుకున్న వెంటనే అడ బెబ్బులిలా రియాక్టయింది లేడీ ఎస్.ఐ. ధీరజ.....
    స్టాప్ ను అలర్ట్ చేస్తూ జీప్ లోకి చేరుకున్నది.
    అప్పటికే ఆమె ఇన్ స్ట్రక్షన్స్ అందుకున్న సిబ్బంది హడావుడిగా జీపు ఎక్కేశారు.
    మరుక్షణం 'రయ్' మంటూ దూసుకుపోయింది ఆ పోలీసు వాహనం.
    పదే పది నిమిషాలలో ఆ గోడౌన్ ముందు ఆగింది.
    ధీరజ వెళ్లేసరికి అక్కడి దృశ్యం భీకరంగా వుంది.....ఇద్దరి తలలు పగిలాయి....మరో ఇద్దరు క్రిందపడి బాధగా మూలుగుతున్నారు.
    రెండు కిరాయి రౌడీ గ్యాంగ్ లు ఆ గోడౌన్ ముందు కొట్టుకుంటున్నారన్న వార్త ఫోన్ ద్వారా ధీరజకు అందజేసిన ....అక్కడ గుమికూడిన పౌరులలో ఒకతని కళ్ళు మిలమిల మెరిశాయి....
    అతను ఆశించింది అదే.....
    పాతబస్తీలో శాంతి భద్రతలను రక్షించే పోలీస్ అఫీసర్లలో ఆమె డైనమిక్ అని అతను పేపర్లలో చదివినట్టు గుర్తు.....
    అందుకే నిజమో కాదో ఆచరణలో పెట్టి చూద్దామని ఫోన్ చేశాడు ఆమెకు.....
    అతను ఆశించినట్టుగానే తన బలగంతో వచ్చి రెండు గ్రూపులను చెదరగొట్టి.....పోట్లాటలో పాల్గొన్న వాళ్ళను మక్కెలు విరగతన్ని మరీ జీప్ ఎక్కించింది.
    అక్కడి వాతావరణం అంతకు ముందు ఎంత భయంకరంగా వుందో ఇప్పుడు అంత ప్రశాంతంగా వున్నది.....
    ధీరజ లా అండ్ ఆర్డర్ ఎస్. ఐ. గా చార్జ్  తీసుకున్న నెలలోపే పాతబస్తీలో అల్లర్లను అరాచకాలను అణిచివేసి వేయడంలో ఆమె చార్జి షీటు ఓపెన్ చేసిన కేసులు పదివరకూ వుంటాయి....
    స్టేషన్ కు చేరుకున్న వెంటనే వాళ్ళను సెల్ లోకి నెట్టి తనూ లోపలకు వెళ్ళండి....
    వెళ్ళేముందు హెడ్ కానిస్టేబుల్ కు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ వెళ్ళింది
    ఆమె చెప్పినట్టే చేశాడతను......
    సెల్ లోపలకు వచ్చిన ధీరజను చూస్తున్న రౌడీల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి.....
    ఎన్నోసార్లు ఆమెను గురించి విని వుండడమే తప్ప ప్రత్యక్షంగా ఆ రౌడీలు చూడడం జరగలేదు.
    చిన్నమాట కూడా మాట్లాడకుండా ధీరజ లాఠీ పైకెత్తింది.
    సన్నగా కనిపించే ఆమెలో అసలు అంత బలం వుంటుందని ఏ మాత్రం ఊహించలేక పోయారు. ఎన్నో కొట్లాటల్లో రొమ్ములలో దెబ్బలు తిన్న రౌడీలు సైయితం కెవ్వుమని అరిచారు.
    ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపకుండా వాళ్ళను కుళ్ళ బోడుస్తుంది ధీరజ.
    అప్పుడే ఫోన్ మోగింది.....
    ధీరజకు ఆ విషయం అర్ధం అయినా పట్టించుకోలేదు.
    హెడ్ కానిస్టేబుల్ రిసీవర్ తీసి చెవిదగ్గర పెట్టుకుని అవతల నుంచి మట్టాడుతున్నది ఎవరో అర్ధం గావడంతో కామ్ గా ఫోన్ పెట్టేశాడు.

Next Page