Read more!
Next Page 
ది సెల్ పేజి 1

                                 


                                    ది సెల్
                                                          ---చందు హర్షవర్ధన్


                       
                                               

                                        అపరాధం
    
    ఆ రోజే జాయిన్ అయ్యాను. ట్రాన్స్ ఫరై వచ్చి నందుకు వెల్ కం పార్టీ ఇవ్వటం స్టాఫ్ ఆప్యాయతని వ్యక్తం చేయటమో లేక అనవాయితో చెప్పడం కష్టం - ఏమైతే నేం పార్టీ జరిగింది.
    ఆఫీసులో అడుగు పెట్టాను. ఒక్కక్షణం నా చూపులు కళ్ళెం తెంచుకున్నాయి. డ్రాయింగ్ రూమ్ లో ఓ మూలగా టైప్ మిషన్ ఉంది. ఏవో కాగితాలు టైప్ చేస్తున్నదామె. ఆమె పార్టీకి ఎందుకు రాలేదో అర్ధంకాక కొన్ని క్షణాలు అక్కడే నిలబడ్డాను.
    అప్పటికీ ఆమె తల ఎత్తలేదు. నా అహం దెబ్బతింది. ఆమెకు ఎంత గర్వం కాకపోతే కొత్తగా వచ్చిన ఆఫీస్ మేనేజరుకు విష్ చెయ్యకుండా ఉంటుంది,. అసలు నా ఉనికినే గమనించనట్లు టైప్ చేస్తున్నదామె.
    తిరిగి నా గదికి వెళ్లి ఆమెను పిలుచుకురమ్మని ఫ్యూన్ ని పంపాను. ఆమెకు ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తున్నాను.
    కొన్ని క్షణాల్లో ఆమె నా రూమ్ లో అడుగు పెట్టింది. ఈసారి కూడా ఆమె నాకు గ్రీట్ చెయ్యలేదు. నాకు పట్టరాని కోపం వచ్చింది.
    ఫైల్లోంచి ఓ పేపర్ తీసి అర్జెంటుగా టైప్ చేసి తీసుకురమ్మన్నాను.
    అనుకున్న టైమ్ కన్నా ముందుగానే టైపుచేసి తీసుకొచ్చిందామె.
    "చెప్పి ఎంతసేపయింది? టైప్ పరీక్షలు అసలు పాస్ అయ్యావా?" అని కసురుకున్నాను.
    కాసేపాకాగితం చూసి నాలుగయిదు చోట్ల కొట్టివేసి "అన్నీ తప్పులే అసలు నీ కెవరు ఉద్యోగం ఇచ్చారు? మళ్ళీ చేసుకురా" అని కాగితాలు ఆమె ముఖం మీదికి విసిరాను. అంత జరిగినా ఆమెలో ఏ చలనం లేదు. తిరిగి కాగితాలు తీసుకుని వెళ్ళిపోయింది.
    "తప్పు చేశానేమో ఒక్కసారి ఆలోచించు?" నా అంతరాత్మ సూటి ప్రశ్నకు జవాబు ఏం చెప్పాలో తోచలేదు.
    అసలు ఆమె చేసిన తప్పేమిటి?.... తన పనిలో తను మునిగిపోయింది.....ఆఫీసర్ కి కావాల్సింది స్టాఫ్ బాగా పనిచెయ్యటమేగా!...
    నా ఆలోచనలు అలా సాగిపోతున్న సమయంలో డ్రాయింగ్ బ్రాంచ్ లోంచి గుసగుసలు వినబడ్డాయి.
    "తిక్క కుదిరిందిరో....ఆఫీసర్ స్ట్రిక్ట్ అని తెలియదేమో పాపం....ఎప్పుడూ ప్రేమికుడి ధ్యాసే.....పని ఎవరు చేస్తారనుకుందో!...
    ...అయినా అందనివాడి గురించి ఆలోచించకపోతే అందుబాట్లో ఉన్న మనలో ఎవరో ఒకరికి ..."
    ఇలా వాళ్ళ మాటలు అసభ్యంగా సాగిపోతున్నాయి.
    వెంటనే ఫ్యూనుని పిలిచి ఆమె గురించి చూచాయగా అడిగి తెలుసుకున్నాను. కొన్ని నెలలక్రితమే ఆమె ఆఫీసులో చేరింది.
    ఆమెకో ప్రేమికుడు ఉండేవాడని, పరిస్థితులకు తలవంచి వేరే పెళ్ళి చేసుకున్నాడని, అప్పటినుంచి ఆమె ముభావంగా ఉంటున్నదని ఆఫీసువాళ్ళు ఆమెగురించి షేకరించిన భోగట్టా.
    రెండు సమాంతర రేఖలు కలవవని తెలిసి శ్రమపడటంతో అసలు సమస్య మొదలవుతుంది. పరిస్థితులవల్లనో, పెద్దలు అంగీకరించకపోవటంవల్లనో ఒక్కటిగా అవ్వకపోవడం, తరతరాలుగా జరుగుతున్నదే! ఆ తరువాత వంటరితనం అనేక ఆలోచనలకి దారితీయటం, అది మనస్థాపం కలిగించటం మామూలే. ఇది కొత్తకాదు. ఇలాంటి చరిత్ర గతంలో ఉంది. ఇప్పుడూ కొనసాగుతూవుంది. ఈ చరిత్ర భవిష్యత్తు లోనూ వుంటుంది.
    నిజానికి ప్రేమించనివాళ్ళు ఎవరుంటారు? అందులో ఎందరు భార్యాభర్తలౌతారు? భగ్న ప్రేమికుల జీవితాలు విషాదాంతాలే అవుతున్నాయా? ఆలోచనల నుంచి తేరుకొని రిజిష్టర్ తెరిచి చూసాను.
    మా ఆఫీసులో ఆమె ఒక్కతే ఉండటం వలన పేరు ఇట్టే తెలిసింది.
    అనవసరంగా ఆమె ప్రవర్తన అపార్ధం చేసుకున్నానా! సూటి పోటీ మాటలతో పొడిచే ఈ సమాజంలో తలెత్తి జవాబు చెప్పలేక మౌనంగా ఉంటున్నదేమో!
    ఆమె పట్ల నా ప్రవర్తన నాకే అసహ్యం వేసింది. పిలిచి చెప్పాలనుకున్నాను. కాని హోదా అడ్డువచ్చింది. ఈపాటికే ఆమె నన్ను ఓ కర్కోటకుడిగా అంచనా వేసుకొని ఉంటుంది.
    కొన్ని నిముషాలకి ఆమె కాగితాలు టైపుచేసి తీసుకువచ్చింది.
    "కూర్చో సౌజన్యగారు...."కుర్చీ చూపించాను. నా పిలుపుకి తలెత్తింది సౌజన్య. ఒక్క క్షణం ఆమె కళ్ళు మిల మిల మెరిసాయి. మరుక్షణంలో మొహం మ్లానమయ్యింది.
    "..... అరే నంచునే వున్నారేం? ఫరవాలేదు కూర్చోండి....." కూర్చోమని మళ్ళీ అన్నాను.
    అయినా ఆమె కూర్చోలేదు అసలు తనని కాదన్నట్టు తలవంచుకునే ఉంది.
    ఇంకామెను కూర్చోపెట్టలేననిపించింది. ఆమె అక్కడ నుంచోటానికి ఇబ్బంది పడుతున్నట్టు తోచి.
    "సరే......వెళ్ళండి....." అన్నాను.
    సౌజన్య వెళ్ళిపోయింది.
    అప్పటికి సాయంత్రం అయిదు దాటింది. ఆఫీసు నుండి బయట పడ్డాను.
    
                            * * *   
    కొత్తగా ఛార్జి తీసుకోవటాన ఆఫీసుకు అరగంట ముందుగా వెళ్ళాను.
    ఆఫీసు గుమ్మంలో వాచ్ మాన్ ఎదురయ్యాడు. ఆఫీసులో అడుగు పెట్టేసరికి సౌజన్య తన సీట్లో ఉంది. ఇంకా ఎవరూ రాలేదు. క్షణం అక్కడే ఆగాను.
    సౌజన్య తలెత్తి చూస్తుందేమోనని షూతో చప్పుడు చేసాను. ఆమె అప్పటికీ తలెత్తలేదు.
    "సౌజన్యగారు..." గట్టిగా పిలిచాను.
    నా పిలుపుకి ఉలిక్కిపడి లేచి నుంచుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కనురెప్పల కింద నల్లని చారలు. ఇంచుమించు ఇరవై ఏళ్ళ ఆమె ఆ క్షణంలో నా కళ్ళకి నలభై ఏళ్ళావిడిలా కనిపించింది. ఆమె నంతగా కృంగదీస్తున్నది ఆమె ప్రేమికుడు దూరం కావడమే అయితే కాలం తప్పకుండా ఆమెను మార్చుతుంది అనుకున్నాను.
    డ్రాయింగ్ రూమ్ లో దాదాపు పదిమంది ఉంటారు. ఆ రూమ్ లోనే ఓమూల సౌజన్య సీటు ఉంది. పదిమంది మగాళ్ళ మధ్య ఉండటం ఆమెకి ఇబ్బందిగా ఉందేమో! వేరే రూమ్ కేటాయిద్దామంటే ఏదీ ఖాళీలేదు.

Next Page