Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 48


    రీతూ పట్ల తన ప్రవర్తనను ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నాడు రవితేజ. తను శిక్షణ పొందుతున్న రోజులలో - జీవితం అంటే పైలాపచ్చీస్ గా గడపడమేనని అనుకుంటున్న రోజులలో - తన వర్తన వాస్తవానికి వెగటుపుట్టించేదే...! ఆ పాడు జోకులు, వెకిలి చేష్టలు ,అనవసరపు అల్లరి. చెలగాటాలు, బేఫరవా నైజం ఎందరెందరిని ఎలా ఇబ్బందులు పెట్టాయో, అవమానించాయో ,ఏడిపించాయో తలచుకుంటే...అందుకు ప్రత్యక్ష సాక్షి ఆ రోజులలో కో-ట్రయినీ  రీతూ...!

    అవన్నీ నిజ జీవితంలో తనపాలిట ఇప్పుడు కాలనాగులై కాటేస్తున్నాయి...!

    తనకూ తన రీతూకూ మధ్య ఇంతటి అగాధం ఏర్పడి తనకు ఇంతటి అఘాతం తగలడానికి కారణం ఒకప్పటి తన ఏహ్యమైన అరాచక జీవితం అన్న మాట...!

    ఆ విషయాన్ని తను ఇంతవరకు కనుగొనలేదు, సమీక్షించుకో లేదు, ఆత్మ విమర్శ చేసుకోలేదు...!

    "తను ఫలానా అని రీతూ ఏనాడూ ఎవ్వరితోను చెప్పుకోలేదు. చెప్పదు కూడాను. ఆమె వ్యక్తిత్వం అంతటి ఉన్నతమైనది, ఆమె పరిపోషించే విలువలు అంత ఉత్తమమైనవి!" ప్రధాని చక్రవర్తి ఆయాసంతో మంచినీళ్ళ గ్లాసును డ్రాయరు చివరి నుంచి అందుకున్నారు.

    ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? తన ప్రేమదేవత రీతూను ప్రసన్నం చేసుకోవడం ఎలా? తన గత జీవితం ఎప్పుడో మారిపోయినట్టు ఆమెకు నిరూపించుకోవడం ఎలా?

    బండరాయిని కూడా మహాశిల్పంగా మలచే శక్తి చిన్న ఉనికి వుంటుంది. దుక్క ఇనుమును సయితం ద్రవింప చేయగల సత్తా నిప్పు రవ్వకు వున్నది. రీతూ ప్రేమ మందిరపు హృదయ కవాటాలను తెరవడానికి తను ఏం చేస్తే సరిపోతుంది...? వాయువేగ మనోవేగాల విహరిస్తున్న రవితేజ ప్రధాని కంఠస్వరం వింటూనే వాస్తవ లోకంలోకి వచ్చాడు.

    "మిష్టర్ రవితేజా! స్వర్గీయ అమరేంద్ర కేసు దర్యాప్తు నడక ఎంతవరకు వచ్చింది?"

    'ఇదేమిటి_ ప్రధాని ఠపీమని టాపిక్ మార్చేశారు? ఇలా ఎందుకు జరిగింది? ఎవరైనా వస్తున్నారా?" అనుకుంటూ అటు ఇటు చూశాడు రవితేజ. తనను ప్రధాని సంబోధించడంలో వచ్చిన మార్పును కూడా గుర్తించాడు రవితేజ. ఆశ్చర్యపోయాడు.

    అయినా, దర్యాప్తు విషయమై దేశ ప్రధానికి నేరుగా తానుగా చెప్పకూడదు. అలా అని మిన్నకుండకూడదు! "దర్యాప్తు పురోగతిలో వుంది సర్! కొత్త అంశాలేమీ ఇంకా బయటపడలేదు..."

    అది అతని పెదాల నుంచి వచ్చిన సమాధానమని ఇట్టే పసికట్టారు ప్రధాని. నవ్వుకున్నారు.

    "నేను నీ నుంచి ఆశిస్తున్న సమాధానం అది కాదనుకుంటాను."

    "సారీ, సర్! కేసును ఇంకా లోతుగా స్టడీ చేస్తున్నాను. రెండు మూడు రోజులలోనే ఏదైనా బ్రేక్ త్రూ చూపగలను!" ఆత్మ విశ్వాసంతో ధీమాగా అన్నాడు రవితేజ.

    అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన హఠాత్తుగా ఎందుకు తెచ్చినట్టా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తూనే వున్నాడు రవితేజ. 'రీతూతో తన ప్రేమాయణానికి మాజీ ప్రధాని అమరేంద్ర మరణ దర్యాప్తుకు పొత్తు ఏమిటి?'

    "రవీ! యు ఆర్ క్లవర్ అండ్ డైనమిక్ ఆఫీసర్. అమరేంద్రకు రీతూకు వున్న సంబంధాన్ని ఈపాటికే నువు తెలుసుకుని వుండవలసింది...!" రవితేజ కళ్ళలోకి సూటిగా చూస్తూ నిదానంగా అన్నారు ప్రధాని.

    ప్రధాని పలుకులలోని కవ్వింపు ధోరణిని కనుగొనగలిగాడు రవితేజ. క్షణకాలం ఏదో అద్భుత లోకంలోకి వెళ్ళి మరో ప్రపంచ వింతను పరికించినట్టు అనుభూతి కలిగింది రవితేజకు.

    తను వూహించి పూరించిన గళ్ళ నుడికట్టు ఫలితానికి 'యురేకా' అని పొలికేక పెట్టాలనుకున్నాడు రవితేజ. ఎదురుగా ప్రధాని వుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

    "సర్...! రీతూ, మాజీ ప్రధాని కీర్తిశేషులు శ్రీ అమరేంద్రగారి ప్రధమ పుత్రిక! కదూ?" సాలోచనగా అన్నాడు రవితేజ. అతని మనసు హర్షపులకిత మవుతున్నది.

    ప్రధాని చక్రవర్తి చిరునవ్వు నవ్వుతూ అవునన్నట్టు తల ఊపారు. వెలుగులు విరచిమ్ముతూ మందహాసం చేశారు. దరహాసచంద్రికలు రవితేజను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

    "అందుకేనా సార్ - అత్యంత కీలకమైన ఈ కేసు దర్యాప్తుకు నన్ను నియమించింది?" ఆశ్చర్యానందాల తలమునకలవుతూ అడిగాడు రవితేజ. అతని భాషలో, భావనలో, చూపులో, చేష్టలో విజయ ఘోష ధ్వనిస్తున్నదిపుడు.

    "ఎస్, మై బోయ్! ఇక 'ఇప్పుడు' నీ తదుపరి కర్తవ్యం స్పురించిందిగా, రవీ?" అతనిని మరింతగా ప్రోత్సహిస్తూ మార్దవంగా అన్నారు ప్రధాని.

    "ఎస్సార్! ఈ కేసును నేనొక ఛాలెంజింగ్ గా, జీవస్మరణ సమస్యగా తీసుకుంటున్నాను. నేను మనసా వాచా కర్మెణా ప్రేమించే నా రీతూను నేను దక్కించుకోవలెనంటే ఈ మిస్టీరియస్ కేసులోని నేరస్తులను నేనే స్వయంగా పట్టుకోవాలి. నాకు ఈ బంగారు అవకాశాన్ని కల్పించిన మీ ఋణం జన్మజన్మలా తీర్చుకోలేనిది..." గాద్గదికంగా అంటూ లేచి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు రవితేజ.      

 Previous Page Next Page