Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 50


    'ది బ్లడ్' నవలను వ్రాయవలెననే సంకల్పం రచయిత 'శ్రీ' కి  అసలు ఎందుకు కలిగినట్టు? ఏ ప్రయోజనాన్ని ఆశించి వ్రాసినట్టు? కేవలం పారితోషికం కోసమా? అయితే, ఎంత ముట్టి వుంటుంది? అది ఇండియన్ కరెన్సీయా లేక ఫారిన్ ఎక్సేంజ్ లోనా? ఏ దేశపు కరెన్సీ? ఎంత? ఎలా మార్చుకుని వుంటాడు? ఆ నగదుకు లెక్కలెలా  చూపుతాడు? లేక, అసలు ఉచితంగా వ్రాశాడా...?

    రచయిత పేరుప్రఖ్యాతుల కోసమే దీనిని వ్రాసినట్టా? లేక ఎవరైనా నిర్భంధించి వ్రాయించారా? ప్రలోభపెట్టారా...?

    ఇలా రవితేజ సూక్ష్మంలో నుంచి అనంతంలోకి, అనంతం నుంచి సూక్ష్మంలోకి "ది బ్లడ్" నవలను, రచయిత "శ్రీ"ని మనసులో కాచివడపోసుకుంటున్నాడు. అతని మెదడు ఇప్పుడొక కుమ్మర కొలిమి.

    రచయిత 'శ్రీ' అండర్- గ్రౌండ్ కు పోయాడు. సరె! మరి, ప్రచురణ కర్త మాటేమిటి? లేక ఇరువురూ ఒక్కరేనా?

    "శ్రీ" నిస్సంకోచంగా కలం పేరే. అసలు పేరు ఏమిటి? ఉనికి ఏమిటి? ఒక పుస్తకాన్ని స్వయంగా ప్రచురించుకోగలిగిన ఆర్ధిక స్థోమతు ఉన్నవాడు మాత్రం కాదని అతని రచనలో అక్కడక్కడ పేదరికం గురించి కాచివడబోసినట్టు నిజాయితీగా వెల్లడైన భావనల ననుసరించే గ్రహించుకోవచ్చు.

    "ది బ్లడ్" ముద్రణ ఆఫ్ సెట్రో ప్రెస్ లో జరిగింది. ఆఫ్ సెట్ ప్రింటింగ్ అంటే అధిక సంఖ్యలో- లక్షలలో- ప్రతులను అచ్చువేసి వుండాలి. అంత మిషనరీ కెపాసిటీ గల ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ వున్నది? దాని యజమాని ఎవరు?

    ఇక్కడే దీనిని ముద్రించారా లేక విదేశాలలో కూడా ముద్రించారా? అక్కడ వీళ్ళ ఏజంట్లు, పబ్లిషర్లు, అనుసంధానకర్తలు ఎవరు? వారి అన్య ప్రచురణలు ఏమిటి?

    ఇన్ని కోణాల నుంచి ఆలోజించి, ఈపాటికే కూపీలాగి వుండవలసింది. కాని జరగలేదు. "శ్రీ" గురించి ఏ 'క్లూ' దొరకలేదు. దర్యాప్తు కుంటినడక...

    ఇక ఏమాత్రం జాప్యం జరగడానికి వీల్లేదు. తీగ లాగాలి, డొంక కదులుతుంది. ఈ కేసులో మిష్టరీని చేదించి తీరాలి! స్థిరంగా అనుకున్నాడు రవితేజ.

    అతను మరల మరల ఆలోజిస్తున్నాడు:

    ప్రభుత్వం "శ్రీ" తలమీద యాభై లక్షల రూపాయల రివార్డును పెట్టింది. ఇప్పుడు దానిని కోటి రూపాయలకు పెంచింది. అంటే ప్రభుత్వమే పరోక్షంగా 'శ్రీ' స్థాయిని మరొక మెట్టు పెంచింది...

    సరిగా ఇక్కడే రవితేజ ఆలోచనలు కేంద్రీకృత మయాయి.

    అంతే! క్షణాలలో అతని అంతరంగంలో ఈ చిక్కుముడిని విప్పడానికి ఒక విచిత్రమైన వ్యూహానికి రూపకల్పన జరిగింది.

    "ది బ్లడ్" సంచలన రచయిత "శ్రీ" వ్రాస్తున్న మరొక సంచలనాత్మకమైన తాజా నవల 'రక్తక్షేత్రం' అతి త్వరలోనే వెలువడనున్నది. చదవడానికి యావత్ పాఠక ప్రపంచం సమాయత్తం కండి!" అని 'శ్రీ' పంపినట్టు అతని స్టేట్ మెంటును మరునాటి ఉదయాన్నే అన్ని దిన పత్రికలు ప్రచురించాయి.

    పాఠకులలో, పౌరులలో మరల సంచలనం...

    నాయకుల గుండెలు బేజారెత్తిపోతున్నాయి...

    అజ్ఞాతంలో వున్న 'శ్రీ' రియాక్షన్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాడు రవితేజ!


                        *    *    *


    బంగళా టెరెస్ మీది నుంచి చుట్టూ కనుచూపుమేర ఏమీ కనుపించడం లేదు.

    అంతా సువిశాలమైన ఖాళీ మైదానం. అక్కడక్కడా చెట్లు చేమలు, చెదురు మదురుగా గుట్టలు, పుట్టలు. బంగళా ఏ ప్రదేశంలో వున్నదో అంతుపట్టడం లేదు ధీరజకు.

    బంగళా చుట్టూ ఎత్తుగా ప్రహరి మధ్యనొక చోట తాళం వేసివున్న ఇనుప గేటు.

    కాంపౌండులో సాయుధులు ఆటోమాటిక్ రైఫిళ్ళను చేబూని అప్రమత్తంగా పహరాకాస్తున్నారు. వాళ్ళ దృష్టినుంచి తప్పించుకోవడం చీమకు కూడా సాధ్యం కాదు.

    బయట నుంచి ఇతరులు ఎవరైనా అనుమతి లేకుండా ఆ స్థావరంలోకి ప్రవేశించడం అసాధ్యం... అంత దుర్భేద్యమైనదది. ఒకవేళ ప్రవేశించ గలిగినా ప్రాణాలతో బైటపడడం కల్ల. అదొక కంచుకోట. పద్మవ్యూహం.

    ఆటోఫోగ్రఫీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది ధీరజ. ఆమె తన దృష్టిని పూర్తిగా దానిమీదనే కేంద్రీకరించింది!

    వెనుకనుంచి తన భుజం మీద అరచేయి పడడంతో ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది ధీరజ. తీక్షణంగా చూసింది. కోపం నషాణానికంటింది. పళ్ళు పటపటలాడాయి.

    "సారీ ,ధీరజా - అయాం రియల్లీ సారి! ఎంత పిలిచినా పలకనంతటి పరధ్యానంలో వున్నారు మీరు. పరిసరాలనే కాదు, మిమ్ము మీరే మరచినట్టు వున్నారు. తప్పని స్థితిలో తాకి పిలవవలసి వచ్చింది కాని, మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని మీమీద చేయివేయలేదు!  గతంలో నేను చేసిన పనికి ఇప్పటికీ నన్ను అనుమానిస్తున్నట్టున్నారు! అయినా, అప్పుడు మీరు తన్నిన  తన్ను ఇప్పటికీ ఎప్పటికీ నేను మరచిపోలేను...! అప్పుడు రెండు రోజులకుగాని కోలుకోలేకపోయానంటే నమ్మండి! అయినా, అప్పుడు అదంతా నిజమేననుకున్నారా? కాదు! అది కూడా మీకు పెట్టిన నిగ్రహ పరీక్షే! నెగ్గారు!" తను  అప్పుడుగాని, ఇప్పుడుగాని తప్పు చేయలేదని ,అసలు తనది అటువంటి స్వభావమే కాదని స్పురించేట్టు - సంస్కారం ఉట్టిపడేటట్టు - చకచకా చెప్పాడు అధికారి.

 Previous Page Next Page