తెల్లబోయాడు రవితేజ. నిజమే! ఈ దృష్టికోణం నుంచి తనెన్నడూ అసలు ఆలోజించలేదు! ఆ విష్యం తెలుసుకోవలసిన అవసరాన్ని కూడా గుర్తించలేదంటే తను ప్రేమపాఠాలలో ఓనమాలు తెలియని బుద్దావతారమే!
"రవీ! నీకు తెలియని పరమరహస్యం ఒకటి చెబుతాను, ఖంగారుపడక స్థిరంగా విను!"
ప్రధానిని ఆతురతగా ఆసక్తిగా అయోమయంగా చూస్తూ క్షణమొక యుగంగా లెక్కించడం ప్రారంభించాడు రవితేజ. తన ఆరాధ్య దేవత గురించిన ఒకానొక రహస్యాన్ని సాక్షాత్తు దేశ ప్రధానే స్వయంగా వెల్లడిస్తానంటున్నారంటే, అదెంత రహస్య రహస్యమో...!
ఆమెను గురించిన ఆ రహస్యం తన మనసును మరిన్ని ముక్కలు చేసేదైతే...ఏమో! తన ప్రేమ తపస్సుకు సంతృప్తిని, సంతుష్టిని కల్పించేదైతే... ఏమో!
ప్రధాని చక్రవర్తి ఇప్పటి వరకు మాట్టాడిన ధోరణిని బట్టి చూస్తే, వారి దృష్టిలో తనంటే ఏదో ప్రత్యేకమైన శ్రద్ద వున్నదన్నమాట స్పష్టమవుతున్నది. తనను అగౌరవపరచవలెనని అభిప్రాయపడుతున్నట్టు కనుపించడం లేదు. మాటలో మన్ననలో ప్రేమానురాగాలే ఇప్పటివరకు ద్యోతకమవుతున్నాయి!
ఈ లెక్కన చూసుకుంటే, తన ప్రేమ విఫలమైనందుకు జాలి చూపడానికో, బాధపడవద్దని నచ్చచెప్పడానికో తననిప్పుడు ప్రధాని పిలిపించి వుంటారని రవితేజ అనుకుంటున్నాడు. కాని, ఇందుకు అతని మనసు సరిపెట్టుకోలేకపోతున్నది!
ప్రధాని చక్రవర్తి గారు గుప్పిడి విప్పి రట్టు చేయనున్న గుట్టు తన హృదయాన్ని తూట్లు పొడిచినా, శోభస్కరంగా అలంకృతం చేసినా అనుభవించడానికి మానసికంగా అతను సంసిద్దుడవుతున్నాడు, అయ్యాడు.
"రీతూ తండ్రి ఎవరో తెలుసా?"
రవితేజ గుండెలో మరొక బాంబు ప్రేల్చారు ప్రధాని చక్రవర్తి. అతని రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నరాలు జివ్వుజివ్వు మంటున్నాయి.
ఇదీ నిజమే! రీతూ తల్లిదండ్రులు ఎవరు అనే విషయం గురించీ తను ఆలోజించలేదు. ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. అసలు పట్టించుకోలేదు! మరల అడ్డుగా బుర్ర తిప్పడమే అతను మౌనంగా చేసిన పని.
"యు నో, రీతూ ఈజ్..." ప్రధాని ఆగారు. వారి లాలట రేఖలు ముడుచుకున్నాయి.
మళ్ళీ సస్పెన్స్...
"రవీ...విషయం విని నువ్వు ఏ మాత్రం ఉద్రేకపడకూడదు, తొట్రుపడకూడదు. నీకూ నాకూ ఈ విషయం తెలిసినట్టు పొరపాటున కూడా ఎక్కడా ఎన్నడూ ఏ విధంగాను రీతూ చెవిన పడకూడదు. ఎంతో గుంభనగా, ధీరోదాత్తంగా, అతిరహస్యంగా వుంచాలి...!"
"సర్...సాక్షాత్తు భారత ప్రధాని చక్రవర్తి గారి ద్వారా తెలుసుకున్న రహస్యం నాతోనే సమాధి కావలసిందేకాని మూడవ వ్యక్తికి తెలిసే ప్రసక్తే లేదు!" భావోద్వేగంతో వెంటనే అన్నాడు రవితేజ. అతని మెదడు ఉబుకుతున్నది. గుండె అదరుతున్నది. కళ్ళు మండుతున్నాయి.
"దట్స్ గుడ్ మై బోయ్, ఐనో యువర్ డిటర్మినేషన్! నీ పట్టుదల మీద, నమ్మకం మీద, మాటమీద, ఇంటిగ్రిటీ మీద, డిగ్నిటీమీద నాకు అచంచలమైన విశ్వాసం వున్నది రవీ!" ప్రధాని సాదరపూర్వకంగా, ప్రశంసనీయంగా, సంతృప్తిగా అన్నారు.
"థాంక్యూసర్!" రవితేజ వినయంగా, సగౌరవంగా, సంస్కారయుతంగా తన ఆనందాన్ని వ్యక్తపరచాడు.
"చెప్పండి సార్- ఆ రహస్యం ఎటువంటిదైనా నాలో ఎత్వంతి సంచలనమూ వుండదని, ఎట్టి పరిస్థితులలోను భావోద్విగ్నతలకు లోను కానని నీకు మాట ఇస్తున్నాను, సర్!"
"రవీ! రీతూ సంపన్నుల బిడ్డ" ప్రధాని ప్రారంభించారు.
"సర్...!"
"ఆమెకు వారసత్వంగా వచ్చే అపారమైన సిరిసంపదలు వున్నా, వాటి వైపు కన్నెత్తి చూడక, స్వయం కృషితో, స్వశక్తితో పైకి వచ్చి, ఇప్పుడు ఈ ఉన్నత స్థాయిలో తన కాళ్ళమీద తాను నిలవగలిగింది. ఆకర్షణలకు ,ఆర్భాటాలకు ,దుస్సంప్రదాయాలకు, దుస్సావాసాలకు ఆమె ఆమడ దూరం. స్వీయ వ్యక్తిత్వంలేని వ్యక్తులంటే ఆమెకు పరమ అసహ్యం. క్షణం సమయాన్ని వృధాపుచ్చడమంటే మంట. జీవితం అంటే ఆ పిల్లకు నిర్దిష్టమైన కొన్ని నిశ్చితాభిప్రాయాలు వున్నాయి. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికీ గిట్టేంత వరకు కొన్ని బరువు బాధ్యతలు వుంటాయని, వీటిని ఎవరూ అతీతులు కారని, కర్త వ్యోన్ముఖులు కానివారు బ్రతకటం వ్యర్ధమని కుమారి రీతు స్పష్టీకరించుకుంది. స్వార్ధపరులు దేశద్రోహులు కంటే హీనులని ఆమె నిర్వచనం__"
చెప్పుకుపోతున్నారు ప్రధాని. రీతూ హృదయ ఫలాన్ని అరచేత పెడుతున్నారు.
రవితేజకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నది రీతు. ఆమె తనను ఎందుకు దూరంగా ఉంచుతున్నదీ తెలిసివస్తున్నది. ఆమె తనను అసహ్యించుకోవడానికి కారణం లేకపోలేదు...