సాదాసీదాగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది రీతు చకచక.
ఆమె ముభావాన్ని, గంభీరతను చూసి నీరుగారిపోయాడు రవితేజ. తను విష్ చేసినట్టు అసలు ఆమె గమనించిందా లేదా? చిన్నబుచ్చుకున్నాడు రవితేజ.
తన హోదా, అధికారం తక్కువని కాదే! తనూ బింకంగానే ఉంటాడే! కాకుంటే పదవీ గర్వంతో బిగుసుకుపోడు!
ప్రధానితో అప్పాయింట్ కోసం ఎదురుచూస్తూ కుషన్ చెయిర్స్ లో కూర్చునివున్న విజిటర్లు తననే తదేకంగా చూస్తూ వుండడాన్ని గమనించి రవితేజ గబుక్కున డోర్ తెరచుకొని లోనికి వెళ్ళాడు.
"గుడ్ మార్నింగ్, సర్!" తను వచ్చినట్టు ఉనికిని తెలియచేస్తూ సెల్యూట్ చేశాడు రవితేజ.
గుమ్మానికి ఎదురుగా కూర్చుని అతని ప్రవేశాన్ని గమనిస్తున్న ప్రధాని గుంభనంగా చిరునవ్వు నవ్వారు.
"కమాన్, మై బోయ్, కూర్చో!" అన్నాడు మామూలుగ.
"థాంక్యూ, సర్" రవితేజ నిలిచే అన్నాడు.
"రవీ! ఇక్కడ నీకూ నాకూ లాంఛనాలూ గట్రా అక్కరలేదు. చెబుతున్నాగా, కూర్చో!" ఆప్యాయతానురాగాలు తొణికిసలాడాయి చక్రవర్తి స్వరంలో.
"ఇట్స్ ఆల్ రైట్ సర్... పిలిపించిన విషయం..." మొహమోటంగా అన్నాడు రవితేజ.
"కొన్ని వ్యక్తిగత విషయాలను చర్చించడానికే నిన్ను పిలిపించానే కాని, నువ్వొక ఉన్నతాధికారివని కాదు! మరి, అలాంటప్పుడు నా ప్రేమాభిమానాలకు దూరంగా ఉండదలచుకున్నావా! నువ్వు ఉన్నతాదికారివిగా నేను ప్రధానిగా కాక, మనసు విప్పి మనం ముచ్చటించుకుందామని పిలిపిస్తే, నువ్వు..."
"సారీ, సార్!" అంటూనే టక్కున కుర్చీలో కూర్చున్నాడు రవితేజ. ఎదుటివారి భావాలను చదవడంలో, వాటిని అర్ధం చేసుకోవడంలో అతను దిట్ట.
'రవీ! నీ వ్యక్తిగత విషయాల గురించి అడుగుతున్నానని ఏమీ అనుకోకు... నువ్వు రీతూను ప్రేమిస్తున్నావా?"
హఠాత్తుగా ప్రధాని సూటిగా అడిగిన ప్రశ్నకు బిత్తరపోయాడు రవితేజ. కొయ్యబారిపోయాడు. వెన్ను జలదరించింది.
"సర్..." ఏదో చెప్పబోయాడు. నోరు పెగలడం లేదు!
"సర్..." మరల ప్రయత్నించాడు. ధ్వని లోలోన ప్రతిధ్వనిస్తున్నదే కాని, మాట వెలికి రాదు...!
"పూర్ బోయ్ ! ప్రేమించానని చెప్పడానికే బెంబేలుపడతావేమయ్యా?" అతని అవస్థను అర్ధం చేసుకున్న ప్రధాని చిరునవ్వు నవ్వుతూ అడిగారు నిదానంగ.
"ఎస్సర్! రీతూను నేను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నమాట పచ్చి నిజం. కాని, ఆమె..." తడబడ్డాడు రవితేజ. ఆమె తనంటే అసహ్యించుకుంటున్నదని, ద్వేషాన్ని పెంచుకుంటున్నదని తన నోటితో తను చెప్పలేక, బిడియపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు, వ్యధ చెందుతున్నాడు.
"ఆమె నిన్ను అర్ధం చేసికోవడం లేదని, పైగా అపార్ధం చేసుకుంటున్నదని, నీది వన్-వే లవ్వని చెప్పదలచుకున్నావు! అది నాకు తెలుసు!" ప్రధాని గంభీరంగా అన్నారు.
ఖంగుతిన్నాడు రవితేజ. కళ్ళు తేలవేశాడు.
"కనుకనే నిన్ను నా సెక్యూరిటీ నుంచి పంపివేశాను." సీరియస్ గా మాటల తూటా పేల్చారు ప్రధాని. అతనినే అలవోకగా చూస్తున్నారు.
ఈసారి కృంగిపోయాడు రవితేజ. అయిపోయింది... తన పరువు-ప్రతిష్ట యమునలో కలిశాయి.
తన లవ్ ఎఫైర్ గురించి రీతూ ఫిర్యాదు చేసి వుంటుంది. అందుకే పిలిపించివుంటారు...
ఇప్పుడు ప్రధాని తనమీద చర్య తీసుకోవచ్చు. లేదా గట్టిగా మందలించవచ్చు. అందుకనే వ్యక్తిగత వ్యవహారం అని ముందే సూచించారు! డీలాపడిపోయాడు రవితేజ.
ప్రధాని చక్రవర్తి పెదవులపై మరల చిరునగవు లాస్యమాడింది.దానిని చూస్తున్న రవితేజ క్షణకాలం తృప్తిగా శ్వాస పీల్చాడు.
ప్రధాని ప్రశాంతంగా వుంటే చాలు, అదే తనకు కొండంత అండ! ఏదో సంజాయిషీ చెప్పుకుని ఈ ఉపద్రవం నుంచి తాత్కాలికంగా అయినా తనను తాను కాపాడుకుని బైటపడవచ్చు.
"రవీ! రీతూ నువ్వంటే మండిపడుతుందని నాకు తెలుసు. అందుకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి నీ వెప్పుడైనా ప్రయత్నించావా అసలు? లేదు. అవునా?" మంద్రస్వరంతో అడిగారు ప్రధాని చక్రవర్తి.
రవితేజ పాలిట పిడుగువంటి ప్రశ్న అది. అతని నాలుక తడారిపోయింది. గొంతు పొడారిపోయింది. మరి మాట్టాడలేక మూగవానిగా 'లేదు' అన్నట్టు బుర్ర అడ్డుగా తిప్పాడు.
"నాకు తెలుసు!" అన్నారు ప్రధాని. "ఆమె నువ్వంటే ఎందుకు ఇష్టపడడంలేదో, ఎందుకు ద్వేషిస్తున్నదో నాకు తెలుసు!" రెట్టించారు ప్రధాని. అంటూ చిరునవ్వు నవ్వారు.