తన అనుమానాలు, తన అభిప్రాయాలు తప్పుడువని, భ్రమలని తేల్చివేసుకుంది. పశ్చాత్తాపంతో మదనపడింది. ఆమె సంస్కారం ఒక్కసారిగా మేల్కొన్నది!
నల్లనివన్నీ నీళ్లు,తెల్లనివన్నీ పాలు అనుకోవడం ఎంత అవివేకం...!
పైపై మెరుగులకు, జలతారు రంగులకు మోసపోకముందే రవితేజ వ్యక్తిత్వాన్ని గుర్తించినందుకు తనను తను ఊరడించుకుంది రీతు.
ఆమె మనసు ఇప్పుడు తేలికయింది. వ్యక్తి కుదుటపడింది. ఆనందం ఆర్ణవమయింది. మానసికోల్లాసంలో తేలిపోయింది. తృప్తిగా నిశ్వసించింది.
రీతూ గుండె నిండా ఇప్పుడు రవితేజ నిలిచాడు. కన్నులలో కలువరేడే అయాడు. అతని అభిరుచులతో ,ఆత్మజాగృతితో మమేకం కావడానికి తనకు ఏ విధమయిన అభ్యంతరమూ లేదు! కాని... కాని...
ఇప్పటి వరకు అతనంటే చులకనగా చూసిన తను, ఒక్కసారిగా ప్రశంసిస్తే తన వ్యక్తిత్వం పలచనైపోతుంది...! అందుకని, ముఖంలో మాత్రం ఏ భావాన్ని వ్యక్తం కానీయక జాగ్రత్తపడింది. తను అన్నింటికీ అతీతమన్నట్టు నిర్వికారంగా కూర్చుంది.
ఎంతసేపటికీ ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరుత్సాహపడిపోయాడు రవితేజ. ముఖం మారిపోయింది. మాడిపోయింది...
ఆమె మారదని నిర్ధారణకువచ్చాడు. తన కలలు కల్లలేనని, అభ్యర్ధనలు చెమిటి ముందు శంఖనాదాలేనని, ఆదర్శాలు ఆచరణలో ఎండమావులేనని నిరాశచెందాడు. నిస్పృహచెందాడు. నిలువునా నీరసించిపోయాడు. నిస్తేజితుడయ్యాడు...
తను ఏకాకి. 'నా' అన్నవాళ్ళు ఒక్కరూలేరు...
తను ఏం చేసి తన నిజాయితీని, నిష్కల్మష ప్రేమను నిరూపించుకోవాలి...?
బేరరు తెచ్చిపెట్టిన బిల్లుమీద యధాలాపంగా డబ్బులు, టిప్పు వుంచి, నిదానంగా కుర్చీలోంచి లేచాడు రవితేజ. కదలబోతూ ఒక్కసారి- చివరిసారి-రీతూను ప్రేమపూర్వకంగా తేరిపారచూశాడు. గొంతు విప్పాడు.
"మిస్ రీతూ! ఒక విషయం. మీకు నా మీద, నా ఆశయాదర్శాల మీద నమ్మకం కలుగకపోవచ్చు. కాని, లోకంలో మీకు కనిపించినవారే మంచివారని, గొప్పవారని, అనిపించినవారే చెడ్డవారని, చవటలని ఒక స్థిర నిర్ణయానికి ఒక్కసారిగా రావద్దని నా ప్రార్ధన. మీకు ఎప్పుడయినా, ఏ మగ సహాయం కావలసివచ్చినా మీ అభిమానిని, మిమ్ము ఆరాధ్య దేవతగా కొలిచేవాడిని నేను ఇంకా బ్రతికేవున్నాననే విషయాన్ని మాత్రం దయచేసి మరువకండి..."
అతని గొంతు బొంగురుపోయింది. గాద్గదికమయింది. మనసు మూగబోయింది. గిర్రున వెనుదిరిగాడు రవితేజ.
"రవీ...!" హఠాత్తుగా లేచి ఒక్క ఉదుటున వెళ్ళి అమాంతం అతని చేయి పట్టుకుంది రీతు. ఆమె చారడేసి చంపలపై కన్నీటి చారికలు...!
నిలువెల్లా నిర్ఘాంతపోయాడు రవితేజ. అది కలో, పగటికలో. నిజమో అర్ధం కావడంలేదు అతనికి. తన కళ్ళను తనే నమ్మలేకపోతున్నాడు...!
"ఐ యాం సారీ...వెరీ వెరీ సారీ రవీ...! నన్ను క్షమించండీ_మీ గురించిన నా దురభిప్రాయాలన్నీ ఎప్పుడో పటాపంచలయిపోయాయి!" అన్నది రీతూ ఉద్విగ్నంగ.
అక్కడేదో అద్భుతం జరుగుతున్నట్టు గుడ్లప్పగించి చూస్తున్నారు దగ్గరగా వున్న కొందరు భోక్తలు నోరప్పళించారు మరికొందరు.
ఇరువురూ కలిసి నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఏ మలుపు తిరగాలో ఉభయుల మనసులకే తెలుసు!
* * *
భారత ప్రధాని ఫేషీ...
రవితేజ తన ముఖాన పట్టిన చిరుచెమటను జేబురుమాలతో తుడుచుకున్నాడు.
విషయం అర్ధం కావడం లేదు. ప్రధాని తనను ఎందుకు పిలిపించినట్టు...?
అమరేంద్ర కేసుకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవలెనంటే డైరెక్టరు ఛటర్జీగారిని పిలిపించుకోవచ్చు. అలా జరగలేదే! లేదా, డైరెక్టరు ద్వారా తనకు ప్రధాని పిలుపు వర్తమానం అందవలసి వున్నది. ఇలాగూ జరగలేదే! నేరుగా ప్రధానే తనను పిలిపించారనుకోవడానికి- తనతో ఒక దేశ ప్రధాని ముఖాముఖి మాట్టాడవలసిన అతిముఖ్యమైన విషయం ఏమున్నది...?
ప్రధాని పర్సనల్ సెక్రటరీ రీతు ప్రధాని పర్సనల్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఆమెను చూస్తూనే రవితేజ ముఖం విప్పారింది.
"గుడ్ మార్నింగ్!" అంటూ విష్ చేశాడు హుషారుగ.
"ప్రధాని మీ కోసం ఎదురుచూస్తున్నారు. మీరు లోనికి వెళ్ళవచ్చు."