Previous Page Next Page 
ది బ్లడ్  పేజి 44


    ఆసక్తిగా వింటున్నది రీతు. ఆమె ఇప్పుడొక కొత్త తేజస్సును రవితేజలో చూస్తున్నది! అయితే, ఇతను చెప్పేవన్నీ వట్టి మాటలా గట్టి చేతలా? కొందరి మాటలు కోటలు దాటుతాయి...

    రీతూ ఆలోచనలను రవితేజ మార్దవ స్వరం అధిగమించింది:

    "నిజం, మిస్ రీతూ! పతితలు భ్రష్టులు బాధా సర్ప ద్రష్టులు, విధి వంచితులు, అనాథ వృద్ధులు ,నిరుద్యోగ యువతకు ఒకింత ఊరట కల్పిస్తూ వారికి బాసట కాదలచుకున్నాను. వారికి కొత్త జీవితాన్ని అందించి, చైతన్యవంతులను చేసి. మరల జనజీవన స్రవంతిలో వారంతా కలిసేట్టు కృషి చేయదలచుకున్నాను. ఇందుకు ఆలంబనగా..."

    'ఏమి చేయదలచుకున్నారు?" హఠాత్తుగా అడిగింది రీతు.

    రవితేజ కనులు మెరిసాయి పాలభాగం విశాలమయింది. గుండె కొట్టుకుంది. సంతోషం ఉరకలు వేసింది. ఆమె నోరు విప్పింది మరి...!

    "ఒక స్వచ్చంద ధార్మిక సంస్థను ఏర్పాటు చేస్తున్నాను."

    "చేసి?"

    "ఆ సంస్థ ద్వారా నేను ఇప్పుడు చెప్పిన ఆశయాధర్మాలను ఆచరణలో పెడతాను."

    "ఆ స్వచ్చంద ధార్మిక సంస్థ పేరు?"

    "అమరేంద్ర అభ్యుదయ ధార్మిక సంస్థ."

    "వ్హాట్...?" ఉలిక్కిపడింది రీతు. సర్దుకుకూర్చుంది. తెల్లబోయింది. అతని ముఖంలోకే తేరిపారజూడడం ఇప్పుడు ఆమె వంతు అయింది!

    "ఎలా వుంది పేరు?" ఉత్సాహంగా అడిగాడు రవితేజ. కుతూహలంగా చూశాడు.

    "ఈ పేరు... ఈ పేరు మీ కెలా తట్టింది?" ఇంకా పూర్తిగా తేరుకొనక ముందే, ఆచితూచి అడిగింది రీతూ.

    "మన మాజీ ప్రధాని, ప్రియతమ ప్రజానాయకులు, ఉత్తమ రాజకీయ వేత్త, కీర్తి శేషులు అమరేంద్రగారు అంటే నా కెంతో అభిమానం. ఆయన జీవిత కాలంలో చేసిన ప్రజాహిత జీవన కార్యక్రమాలు ప్రాతః స్మరణీయాలు. దేశ సమగ్రత కోసం, జాతి సమైక్యతకోసం వారు తమ ప్రాణాలనే తృణప్రాయంగా త్యాగం చేశారు..."

    రీతూ కనుకొలకులలోకి అప్రయత్నంగానే నీరు చేరింది. ముఖంలో లిప్తకాలం దైన్యం కనుపించి, అంతలోనే మాయమయింది. 'మాజీ ప్రధానికి అభిమానులు వున్నారు...' అనుకుంటూ వేనిటీ బ్యాగ్  నుంచి కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకుంటున్నట్టు తుడుచుకుంటూ కనులు అద్దుకుంది. కర్చీఫ్ ను లోనపెడుతూ పూర్తిగా తేరుకుంది.

    'అమరేంద్ర అభ్యుదయ ధార్మిక సంస్థ' యావజ్జీవిత గౌరవాధ్యక్షులుగా వుండటానికి దయచేసి అంగీకరించవలసిందిగా మిమ్ము మనసారా అభ్యర్ధిస్తున్నాను!"

    నిర్ఘాంతపోయింది రీతు. నోట మాట పెగలలేదు. తనకు అయాచిత గౌరవం! ఈయనగారి ఉద్దేశ్యం ఏమిటి...?

    "మౌనం అర్ధాంగీకారం అంటారు కాని, నేను పూర్తి అంగీకారం గానే తీసుకుంటున్నాను. థాంక్స్ ఎ లాట్! ఇక, మాజీ ప్రధాని పేరనున్న ఈ ధార్మిక సంస్థను ప్రస్తుత ప్రధాని చక్రవర్తిగారి చేతుల మీదుగా ఆవిష్కరింపచేయవలెననేది నా అభిమతం. ఇందుకే మీ పూర్తి సహాయ సహకారాలను కోరుతున్నాను..."

    భావోద్వేగంతో మాట్టాడుతున్న రవితేజనే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నది రీతు. ఆమె మనసు విచలితమవుతున్నది. మదిలో ఏదో శూన్యగోళం ఏర్పడుతున్నట్టు అనుభూతిచెందుతున్నది. గుండె బరువెక్కింది...

    రవితేజలో ఇంతటి ఆవేదన, ఇంతటి ఆవేశం, ఇంతటి ఆలోచన, ఇన్ని అభ్యుదయ భావనలు వున్నాయని తను ఎన్నడూ కనీసం ఊహించుకోలేదు...!

    జాతీయతను మూర్తి మంతం చేసుకున్న రవితేజ స్వీయ వ్యక్తిత్వం తను నమస్కరించదగినది! సహృదయత స్వీకరించదగినది!

    రవితేజను ఇన్నాళ్ళూ తను ఒక రోమియోగ, వ్యాసనపరునిగ, ఆకతాయిగ, బాధ్యతలు గుర్తించని రికామీగ, అనామకునిగా భావించుకుంటూవస్తున్నది. అందుకనే అతనిని అవకాశం దొరికినప్పుడల్లా అవమానిస్తున్నది.  

 Previous Page Next Page