Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 43


    గుమ్మంలో ప్రత్యక్షమైన వ్యక్తిని చూస్తూనే రీతూ ముఖం జేవురించింది.

    "హలో, మిస్ రీతు! బాగున్నారా?" చిరునవ్వుతో పలకరిస్తూ చేరువకు వచ్చాడు రవితేజ.

    బాగున్నట్టు తల తాటించిందేగాని కనీస మర్యాదకోసమైనా అతనికి తిరిగి విష్ చేయలేదు.

    బేరర్ ఐస్ క్రీమ్ ను తెచ్చి ఆమె ముందు టేబుల్ మీద నిదానంగా పెట్టాడు. తన ఎదుట నిలచిన వ్యక్తిని చూసి కూడా ఆమె ముభావంగా వుండడాన్ని అతను గమనించాడు. "సార్...ఇది రిజర్వ్ డ్ టేబుల్. మేడమ్ గారు! మరొక..."

    "నో ప్రోబ్లమ్. మా ఇద్దరికే ఈ టేబుల్ రిజర్వ్ చేసింది. గెట్ వన్ మోర్ ఐస్ క్రీమ్!" అతని అవస్తను గమనించిన రవితేజ చెప్పగానే, బేరర్ వెళ్ళిపోయాడు.

    రీతూ ముఖం కందిపోవడాన్ని గుర్తించాడు రవితేజ. లోలోన నవ్వుకున్నాడు.

    "సారీ, మిస్ రీతూ! మీ ఏకాంతాన్ని భగ్నం చేసినట్టున్నాను. అన్నట్టు, మీరు ఎదురుతెన్నులు చూస్తున్న విక్రమ్ రాడు. భార్యాపిల్లలు ట్రెయిన్ కు వస్తున్నట్టు టెలిగ్రామ్ రావడంతో కారు తీసుకుని రైలు స్టేషన్ కు వెళ్ళాడు..." చెబుతూనే ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు రవితేజ. ఆమె తనను మర్యాదకోసమైనా కూర్చోమనకపోవడాన్ని కూడా అతను గమనించాడు.

    "బై ద బై - మీరు అంగీకరిస్తే, టైమ్ స్పేర్ చేస్తే, కొన్ని ముఖ్య విషయాలను మీతో మాట్టాడాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్, అవి నా పర్సనల్ విషయాలే అనుకోండి__!" నిదానంగా ప్రారంభించాడు రవితేజ. ఆమెలో ఏ స్పందనా లేదు.

    "నాకు మన ప్రధాని చక్రవర్తిగారి అపాయింట్ మెంట్ కావాలి." అన్నాడు రవితేజ. ఈసారి అతనిని ఓరగా చూసింది రీతు.

    "నా పర్సనల్ ప్రోగ్రాముకు వారిని ముఖ్య అతిథిగా పిలవాలనుకుంటున్నాను. అందుకోసం తొలిగా మీతోనే ఆ విషయాలను చర్చింది, నా ఆహ్వానాన్ని ప్రధాని మన్నిస్తారని మీరు అభయమిస్తేనే నేను ముందడుగు వేయగలుగుతాను..." చెప్పడం ఆపి ఊపిరి పీల్చుకున్నాడు.

    రీతూలో అసహనం, ఆవేశం కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. ఆమెలో ఆలోచన ప్రారంభమయింది. అతను అడిగిన దానిలో తప్పులేదు. మొనమొన్నటి వరకు కలిసి పనిచేసిన వ్యక్తి. తను ప్రధాని పర్సనల్ సెక్రటరీ కనుక తనతో చెబుతున్నాడు. సహాయం చేయవచ్చు!

    అదీ కాక, అతనిలో ఇదివరకటిలో వలె బాధ్యతారాహిత్యం ఇప్పుడు కనిపించడం లేదు. ఆచి తూచి కొంచెం హుందాగా, మర్యాదగా మాట్టాడుతున్నాడు! ఆలోచిస్తున్నది రీతు.

    బేరర్ ఐస్ క్రీమ్ తెచ్చి అతని ముందు టేబుల్ మీద పెట్టి, నమ్రతగా ఆవలికి వెళ్ళాడు.

    'ఈ సమయంలో ఇక్కడకు విక్రమ్ రావలసిన విషయం ఇతనికి  ఎలా తెలిసింది? విక్రమ్ భార్యా పిల్లలు వస్తున్నట్టు, అందుకని అతను స్టేషనుకు వెళ్ళినట్టు ఇతనికి ఎలా తెలిసింది? అయినా, ఆ విషయాలను తన దగ్గర ప్రస్తావించడంలోని ఔచిత్యం ఏమిటి? అసలు ఇతని ఆంతర్యం ఏమిటి...?' ఆలోచిస్తున్నది రీతు.

    ఐస్ క్రీమ్ ను పూర్తిచేసి, గొంతు సవరించుకున్నాడు రవితేజ. కుర్చీలో కదలి, కొంచెం ముందుకు వంగాడు. ఆమె ముఖ కవళికలను ఒకసారి తేరిపారచూశాడు.

    "మిస్ రీతూ! మా నాన్నగారు ఏడేడు తరాలకు సరిపడా ఆస్తిపాస్తులను సంపాదించి పోయారు. నా తల్లి దండ్రులకు నేను ఏకైక సంతానాన్ని, వారసుడను. కాని, పిత్రార్జితం మీద నాకు మక్కువ లేదు. అందుకని, ఆలోజించి, నేనొక నిర్ణయానికి వచ్చాను." క్షణం ఆగాడు రవితేజ. ఆమెనే చూస్తూ మరల ప్రారంభించాడు:

    "నాకు కుటుంబ వారసత్వంగా సంక్రమించిన యావదాస్తిని మన దేశానికి ,దేశ ప్రజలకు ఉపయోగపడేటట్టు సక్రమమైన మార్గంలో వినియోగించాలనే కృత నిశ్చయానికి వచ్చాను.

    "మన దేశంలో యువశక్తి రానురాను పెడమార్గంపడుతున్నది. ఎందరెందరో యువతీ యువకులు నిరుద్యోగంతో కుమిలిపోతున్నారు, అర్ధాకలితో అలమటిస్తున్నారు. సామాజికంగా అన్యాయాలను, అక్రమాలను తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో అరాచకం వైపుకు మళ్ళి దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, మోసాలు మొదలైన వాటికి పాల్పడుతూ అసాంఘిక శక్తులుగా తయారవుతుండగా, మరికొందరు విప్లవం అంటూ పిడికిలి బిగించి, ఎలుగెత్తి నిసదించి తిరుగుబాటుదారులవుతున్నారు. టెర్రరిస్టులు, నక్సలైట్లుగా మారిపోతున్నారు. మరి కొందరు కుల, మత, వర్గ, ప్రాంతీయ, రాజకీయాలపై ఆధారపడే కుహనా ప్రజానాయకుల పద్మవ్యూహాలలో బలైపోతున్నారు. అదుగో - అటువంటి యువతకు ఊరడింపు కల్పించడానికి,  స్వయం ఉపాధి పథకాలను అమలుపరుచుకొని వారు సజావుగా బ్రతకడానికి, తలెత్తుకుని ధీరులుగా మసలడానికి నా వంశపారంపర్య నిధులు ఉపయోగపడవలెనని మనస్పూర్తిగా భావిస్తున్నాను.

    "రీతూగారూ ! యువశక్తే దేశానికి రక్ష. భారతదేశ సమగ్రతకు, జాతి సమైక్యతకు యువత జీవగర్ర. వారిని సమీకరించవలసి వున్నది. పెడమార్గాన పోయి సమిధలైపోతున్న యువతీ యువకులలో ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యస్థయిర్యాలను కల్పించాలి. తమ కాళ్ళపై తాము నిలవగలిగే జీవనాదారాలను చూపాలి. అప్పుడు వారు నిజమైన మానవులుగా సామాజిక బాధ్యతలను పంచుకుంటారు. అందుకే, వారి కోసం ఏదైనా ఒక మంచి పనిచేసి, అటువంటివారికి వెసులుబాటు కల్పించి, పోరు బాట నుంచి మళ్ళించి, ప్రగతి పధాన నిలపవలెననుకుంటున్నాను. యువశక్తి నిర్వీర్యం కాకుండా చూడడం ఒక్క ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం కాదు.  ఇందుకు ప్రజలు కలిసిరావాలి స్వచ్చంద ప్రజాహిత సేవా సంస్థలు పూనుకోవాలి, సంపన్నులు నడుం బిగించాలి. విజ్ఞులు మార్గదర్శకులు కావాలి. ఈ దేశం తనకు ఏమి ఇచ్చింది అనికాక తన దేశానికి తను ఏమి ఇస్తున్నట్టు అని ప్రతి పౌరుడు పునరాలోచించుకోవాలి. నా పరిధిలో నేను కదలదలచుకున్నాను..." 

 Previous Page Next Page