"ఒక పని చేద్దాం!"
"ఏమిటి...?"
"సాయంత్రం ఏడు గంటలకు వీలైతే ఆఫీసర్స్ క్లబ్బులో కలుసుకుందాం!"
"అదుగో మళ్ళీ వీలైతే కాదు, కలుసుకుందాం! డిన్నర్ చేద్దాం!"
"సరే !"
విక్రమ్ ముఖం వేయి ఓల్టుల బల్బులా వెలిగింది. ప్రసన్న పూర్వకంగా చిరునవ్వు నవ్వాడు!
అదే - ఆ చిరునవ్వే ఆమెను కట్టిపడేస్తున్నది!
'గ్రంథసాంగుడులా వున్నాడే! ఈ చిరునవ్వుతో, ఆ మాటలతో ఇప్పటికి ఎంతమంది ఆడపిల్లలను తన చుట్టూ గిరికీలు తిప్పించుకున్నాడో...!'
"అయిపోయింది! మళ్ళీ ఊహాలోకాల విహారానికి ఒంటరిగా వెళ్ళిపోయారూ...?"
"ఆఁ...అ! ఓకె! అలాగే...ఏడు గంటలకు... క్లబ్బుకు ...బై...!" చేయి ఊపుతూ చకచకా వెళ్ళిపోయింది రీతు.
హుషారుగా తన కారు వైపుకు కదిలాడు విక్రమ్.
చాటుగా నిలచి వున్న రవితేజను ఇరువురూ గమనించనేలేదు!
ఇరువురి సంభాషణా విన్న రవితేజ ముఖం వివర్ణమయింది. రంగులు మారాయి. మానవ సహజమైన అసూయ తన్నుకువచ్చింది. ఈర్ష్య పొంగింది, అనుమానం పుట్టింది.
'ఇది ట్రయాంగిల్ లవ్ కు దారి తీయదుకదా...!' అనుకున్నాడు.
'రీతూ ఇంతవరకు తనను ఎన్నిసార్లు ఎన్ని విధాల కించపరచినా సర్దుకుపోయాడు. ఇప్పుడు ఆమె నేరుగా ఏకంగా తన హృదయాన్నే గాయపరుస్తున్నది. అయినా రీతూని మరవలేకపోతున్నాడు, మనసును మరల్చుకోలేకపోతున్నాడు. తనది ఒన్-వే లౌ ఎఫైర్ లా వుంది. అసలు ఆమెకు తనమీద వున్న అభిప్రాయం ఏమిటో? అమీతుమీ తేల్చుకుంటే పోలా...?' అనుకుంటూ, ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు రవితేజ.
'నేటి సాయంత్రం ఏడు గంటలకు ఆఫీసర్సు క్లబ్బులో విందు భోజనం. హాజరయ్యేది విక్రమ్ కాదు ,రవితేజ!' అనుకుంటూ, అందుకు పథక రచనలో నిమగ్నమయాడు.
ఇప్పుడు అతని మనసు కాస్త కుదుటపడినట్టయింది! తనను తను ఊరడించుకున్నాడు.
అదే సమయానికి అతనిని వెతుక్కుంటూ ప్రధాని నుంచి సందేశం తీసుకువచ్చి ఇచ్చాడు మెసెంజరు. ప్రధాని ఛాంబరుకు హడావుడిగా కదిలాడు రవితేజ.
* * *
ఆఫీసర్స్ క్లబ్. సమయం సాయంత్రం ఏడు గంటలు.
కారు దిగిన రీతూ, ఒక్కసారి పరిసరాలను పరిశీలించింది. విక్రమ్ వచ్చిన జాడలేమీ లేవు!
"అరగంట వెయిటింగ్!" డ్రైవరుతో చెప్పి, కేంటీన్ వైపుకు దారితీసింది.
కేంటీన్ డైనింగ్ హాలు హడావుడిగా వున్నది. అక్కడక్కడా కొందరు కూర్చునివున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో వున్నారు. కొందరు ఫ్యామిలీలతో సహా దిగారు. పిల్లలు పరుగులిడుతున్నారు.
హాలులో ఒక ప్రక్కగా- అయినా గుమ్మానికి ఎదురుగా__దూరంగా ఒక టేబులు, రెండు కుర్చీలు వున్నాయి. టేబుల్ మీద 'రిజర్వ్ డ్' అని రాసివున్న త్రికోణాకారపు చెక్క వున్నది.
రీతూ సరాసరి అక్కడకు వెళ్ళి ఎదుటి కుర్చీలో కూర్చుంది. ఓ సారి కలయజూసింది.
సమయం ఏడు గంటల అయిదు నిమిషాలు. విక్రమ్ రాలేదు.
బేరర్ వచ్చాడు. ఐస్ వాటర్ గ్లాసును టేబుల్ మీద పెట్టి, 'మెను' ప్లాస్టిక్ షీట్ ను ఆమె చేతికి వినయంగా వంగి మరీ అందించాడు నమ్రతగా వెళ్ళిపోయాడు.
ఏమీ తోచక, మెనూను చదవసాగింది రీతు.
మరి అయిదు నిమిషాలు గడిచాయి.
విక్రమ్ రాలేదు. బేరర్ వచ్చాడు.
"గుల్ బర్గా ఐస్ క్రీమ్" సభ్యతకోసం చెప్పింది రీతు.
బేరర్ వెళ్ళాడు. 'రిజర్వ్ డ్' త్రికోణాకారపు చెక్కను తీసుకు మరీ పోయాడు!
రీతూ విసుక్కుంది. 'పంక్చుయాలిటీని ఎప్పటికి పాటిస్తారు ఈ జనం...?' అనుకున్నది.
మాట ప్రకారం సరిగ్గా సమయానికి వచ్చింది తను. రిస్ట్ వాచ్ చూసుకుంది. మరల విసుక్కుంది.
ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరు విక్రమ్ పట్టుపట్టడంతో ప్రధాని పర్సనల్ సెక్రటరీగా తనకు ఇష్టం వున్నా లేకున్నా కాదనలేక మర్యాద కోసం తను వచ్చింది.
అతను రాలేదు. రాకపోవడం కూడా ఒకందుకు మంచిదిగానే తోస్తున్నదామెకు. తన పరిచయాన్ని చనువుగా తీసుకుని ఇమా ఎంతో దూరం తీసుకువెళ్ళే స్వభావిలా కనుపిస్తున్నాడతను. ఇది ఇంతటితో ముగిస్తేనే మంచిది! అనుకుంటున్నది మనసులో.
అనుకుంటూనే ఎదుట కనిపిస్తున్న గుమ్మంవైపుకు యాదృచ్చికంగా చూసింది.