Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 41


    ప్రధాని ప్రసంగం బహిరంగ సభలో చేసే ఊకదంపుడు ఉపన్యాసమని, మాటల మూటలని, అవి పేపర్లకే పనికి వస్తాయి కాని ప్రజలకు కాదని ఒకరిద్దరు నిశితంగా విమర్శించారు.

    ఒక దశలో స్పీకరు లేచి, పార్లమెంటరీ సంప్రదాయాలను, పరిభాషను గుర్తుచేసి, సభ్యులను శాంతపరచారు.

    ప్రధాని విశ్లేషణను, స్పీకరు సముదాయింపును తాము ఆమోదింపలేకపోయినా, ఆ ఉభయులపట్ల వ్యక్తిగతంగా గల గౌరవ భావంతో ఇంకొందరు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు.

    ఒక సీనియర్ మెంబరు లేచి, ప్రధాని ప్రసంగంలో పేర్కొన్న అంశాలన్నీ ఆచరణలో అమలు జరిగాయోలేదో సభ్యులు తెలుసుకునే నిమిత్తం తగు వ్యవధిలో సభను ప్రత్యేకంగా సమావేశపరచవలసిందిగా సూచనాత్మకంగా హితవు పలికాడు. సభ్యులందరూ మూకుమ్మడిగా లేచి ఆయన సలహాను ఏకగ్రీవంగా సమర్ధించారు.

    ఇందుకు ప్రధాని తమ సుముఖతను వ్యక్తంచేశారు. స్పీకరు సభను వాయిదావేశారు.

    ప్రెస్ గేలరీలో కూర్చున్న 'జగజ్యోతి' పత్రికకు చెందిన ఆనంద్ అన్ని పాయింట్లను నోట్ చేసుకున్నాడు. తనకు కావలసిన సమాచారం లభించడంతో ఆనందంగా లేచాడు.


                       *    *    *


    సెంట్రల్ సెక్రటేరియట్. ఉదయం పది గంటల సమయం.

    "గుడ్ మోర్నింగ్ !" 

    అపరచిత వ్యక్తి స్వరం విని ఉలికిపడింది ప్రధాని పర్సనల్ సెక్రటరీ కుమారి రీతు.

    "బావున్నారా ?" ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరు విక్రమ్ పలకరించాడు.

    అతని గొంతు ధ్వనితో పాటు అతని చిరునవ్వుకు కూడా ముగ్దురాలయింది రీతు.

    "వెరీ గుడ్ మార్నింగ్..." సిగ్గుపడుతూ చిన్నగా అన్నది, అతనినే క్రీగంట చూస్తూ.

    నిలువెత్తున వున్న అతనికి పీకాక్ బ్లూ సూట్ నిండుదనం తెచ్చింది. పచ్చని వర్చస్సు ! కోటేరు వంటి ముక్కు. తీర్చిదిద్దిన పలువరుస. నిగనిగలాడే నల్లని వంకెల గిరజాల జుత్తు. నునులేత గులాబీ రేకులవంటి పెదాలు. తుమ్మెద రెక్కల వంటి మీసకట్టు. నునుపుదేలిన నుదురు. తీర్చిదిద్దినట్టున్న కనుబొమలు. విశాల భుజస్కంధం.  అక్షరాలా అందగాడే ! కనులు చెదరే ఆకర్షణ!

    ఇంతకు ముందు అతనిని దూరం నుంచే చూసింది కాని, ఇంత దగ్గరగా చూడడం ఇదే ప్రథమం ! క్షణకాలం కలవరపాటుకు గురయింది రీతు. మౌనాంకిత అయింది.

    "అరే ! మీరెప్పుడూ ముభావంగా వుంటారే ! మాట్టాడితే మంచి ముత్యాలు, నవ్వితే నవరత్నాలు రాలిపోతాయని భయమా ? లేక ఆయుఃక్షీణమనా ? కాక, కాఫీ ఆఫర్ చేయవలసివస్తుంది, నెలాఖరులో ఈ దండుగమారి ఖర్చు ఎందుకులే అనా?" సీరియస్ గా చూస్తూ అడిగాడు విక్రమ్.

    ఫక్కున నవ్వేసింది రీతు. ఆ నవ్వు అతని ప్రశ్నలతో పాటు ఆ అడిగిన విధానానికి, అభినయించిన కోపానికి !

    "హమ్మయ్య ! ఎట్టకేలకు మీరు నవ్వేరు. నేను నెగ్గాను!"

    "ఇందులో నెగ్గడం ఏమిటి మళ్ళీ ?" మరల నవ్వుతూ అడిగింది రీతు.

    "అడిగారూ ,అడుగుతారు ! అయితే వినండి: అసలు మీరెన్నడూ నవ్వనే నవ్వరని నేను, అబ్బబ్బే...సందర్భానుసారం తప్పక నవ్వుతారు అని నా అంతరాత్మ, పందెం వేసుకున్నాంలెండి ! మీరు నవ్వేరుగా మరి !"

    "అదా ! మరి, మీరు నెగ్గానంటున్నారేమిటి ? మీ పందెం ప్రకారం అయితే నెగ్గింది మీ అంతరాత్మ కదా ?"

    "భలేవారే- ఆ అంతరాత్మ నాదే గదా- వెరశి నేనే !"

    "గుడ్ జోక్ !"

    "థాంక్స్ ! ఇక పదండి !"

    "ఎక్కడికి ?"

    "నవ్వేరు గదా ! గుక్కెడు కాఫీని సిప్ చేయాలి గదా !"

    "అబ్బే... అలవాటు లేదండి !"

    "పోనీ, కూల్ డ్రింక్ ! లేదా ఐస్ క్రీమ్ ! కాదు..."

    "లాభం లేదండి, గొంతులో గర గర..."

    "మీతో పెద్ద చిక్కొచ్చి పడిందే...!" బుర్ర గోక్కున్నాడు విక్రమ్.

    ఆమెను ప్రసన్నం చేసికోవడానికి ఏం చేయాలా అని ఆరాటంగా చూస్తున్నాడు.

    అతని ఆరాటాన్ని, చూపులను, మనోగతాన్ని గమనించింది రీతు. అతను వదిలేట్టు లేడు. ప్రస్తుతానికి అతని నుంచి తప్పించుకోవాలి. ఎలా...? క్షణం ఆలోజించింది రీతు.

 Previous Page Next Page