Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 40


    "మనకు ఆ దుర్గతి అక్కరలేదు. రానున్న అయిదేండ్ల కాలంలో కూడా ఈ దేశాలు అందుకోలేనంతగా ఈపాటికే ప్రగతిని సాధించి మన రక్షణ శాఖను పటిష్టమంతంగా, అత్యాధునికంగా, ఏ సవాలునైనా ఏ క్షణాన అయినా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా వుంచాం. కనుకనే ఈ ఏడు గత ఆర్ధిక సంవత్సరపు రక్షణ బడ్జెట్టు కంటే కొంచెం తగ్గించాం. ఈ తగ్గించగా మిగిలిన నిధులను ఇతర అత్యవసర ప్రయోజనాత్మక కార్యక్రమాలకు మళ్ళించాం. అంతే కాని, కొందరు అపోహపడుతున్నట్టు, ఏ అన్యదేశాల సూపర్ పవర్ వత్తిడులకు తలొగ్గి డిఫెన్స్ జడ్జెట్టును తగ్గించలేదని స్పష్టీకరించదలుచుకున్నాను.

    "స్వాతంత్ర్యావతరణం నుంచి కాశ్మీర్ సమస్య మనను పగపట్టిన త్రాచులా వెన్నంటుతూనే వస్తున్నది, పరిష్కారం కోసం పరంపరాగతంగా ప్రయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే, శారీరక గాయాన్ని మందుమాకులతో మాన్పుకోవచ్చునుకాని, మానసిక పుండును కేవలం కాలమే నయం చేస్తుంది.

    "కాశ్మీర్ సమస్య అనేది భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమయింది. కాని, పాకిస్తాన్ దీనిని ఒక అంతర్జాతీయ సమస్యగా చిత్రిస్తూ భూతద్దంలో చూపుతున్నది. ఇందుకోసం ఆ దేశం ప్రతి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగపరచ ప్రయత్నిస్తున్నది. గోరంతలు కొండంతలుగా విష ప్రచారాన్ని కావలెనని కొనసాగిస్తున్నది. మనం దానిని ఎదుర్కొంటున్నాం, ఖండిస్తున్నాం, నిజానిజాలను లోకానికి వెల్లడిస్తున్నాం. ఇప్పుడు ఈ విషయంలో మనం కూడా అంతర్జాతీయ స్థాయిలోనే దౌత్య మార్గాలలో పోరాడవలసి వస్తున్నది. ముందు భారత్-పాకిస్తాన్ మధ్య మైత్రి, సహృద్భావం నెలకొనాలి. పరస్పర సమావేశాలు, చర్చలు, ఒప్పందాలు జరగాలి, అలా అని ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేంతవరకు చేతులు ముడుచుకొని కూర్చోవడం భారత ప్రభుత్వం అభిమతం కాదు. 

    "చెప్పండి- మీలో ఎందరో మేధావులు వున్నారు. రాజకీయ పరిపక్వతగల యోధులు వున్నారు, నిపుణులు వున్నారు, న్యాయాన్ నిర్ణేతలు వున్నారు, ధర్మమూర్తులు వున్నారు. అందరం దేశ భక్తులమే. సలహాల నివ్వండి, సూచనలు చేయండి, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆచరణాత్మకంగా చిత్తశుద్ధితో మన ప్రతిపాదనలను ముందుకు తెద్దాం - ఆ రావణకాష్ఠాన్ని హోమ గుండంలో పెడదాము.

    "ఇక, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలలో తలెత్తే స్థానిక సమస్యల పరిష్కార గురుతర బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. కాకుంటే, కేంద్రం సహకరిస్తుంది. ఆ సహకారం కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల పరిధిలోనే వుంటుందని హామీ ఇస్తున్నాను.

    "ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల విధ్వంసకాండను నిలువరించడంలో, వాళ్ళను అదుపులో వుంచడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన కృషి చేస్తున్నట్టు మాకు అందుతున్న అధికార నివేదికలు తెలుపుతున్నాయి. ఇందుకు ఆ రాష్ట్రం కోరిన సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తూనే వుంది. పారా మిలిటరీ దళాలను, సి.ఆర్.పి.ని పంపాము. దాని సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, పోలీసు ఉన్నతాధికారులతో కూడా కేంద్ర హోంశాఖ ఎప్పటి కప్పుడు ఈ అంశమై చర్చిస్తూనే వుంది, సలహాలు నిస్తూనే వుంది. 

    "ఎల్.టి.టి. విషయంలో తమిళనాడు రాష్ట్రప్రభుత్వానికి ఈ సరికే కొన్ని రహస్య ఆదేశాలను జారీ చేయడం జరిగింది! శ్రీలంక దేశ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుగుతూనే వున్నాయి. దేశంలో ఎక్కడ ఏ మారుమూల ఏ విధమైన దౌర్జన్యకాండకు ఎవరు పూనుకున్నా నా ప్రభుత్వం సహించడం అంటూ వుండదని మరల హెచ్చరిస్తున్నాను.

    "మన మాజీ ప్రధాని, స్వర్గీయ అమరేంద్ర మృతి కేసు దర్యాప్తు చుకురుగా కొనసాగుతున్నది. కొన్ని పాలనా పరమైన రహస్య కారణాల వలన కేసు దర్యాప్తు పురోగతి విషయమై ఈ సభలో వెల్లడించడానికి దర్యాప్తు అధికారులు సముఖంగా లేరు. అయినా, సభ్యుల శ్రద్ధను, ఆసక్తిని దృష్టిలో వుంచుకొని, వీరు ఒక అభిప్రాయానికి రావడానికి వీలుగా స్థూలంగా ఒక్క అంశాన్ని మాత్రం ప్రస్థావిస్తాను.

    "ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారం 'శ్రీ' అనే అజ్ఞాన రచయిత, అతను వ్రాసిన ఆంగ్ల నవల 'ది బ్లడ్'. 'శ్రీ' దొరికితే, స్వర్గీయ అమరేంద్ర కేసులో చిక్కుముడులు వీడిపోయే వీలవుతుంది. అందుకనే 'శ్రీ' ని పట్టి ఇచ్చినవారికి యాభై లక్షల రూపాయల పారితోషికాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి వుంది. ఈ విషయంలో దర్యాప్తును త్వరితగతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ రివార్డు విలువను యాభై లక్షల నుంచి కోటి రూకలకు పెంచుతున్నది. అంతేకాదు, సమాచారం తెలిపినవారి పేరును రహస్యంగానే వుంచి, వారికి వారి కుటుంబానికి ప్రభుత్వం పూర్తి రక్షణ బాధ్యతను వహిస్తుందని ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను..."

    ప్రధాని చక్రవర్తి ప్రసంగం ముగించగానే సభ్యులు పెద్దపెట్టున కరతాళ ధ్వనులు చేస్తూ తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు.

    అయితే, కొందరు సభ్యులు అలవాటుగా వాగ్యుద్దానికి పూనుకున్నారు. వారిని అడ్డుకుంటూ మరికొందరు సవాళ్లు విసిరారు. సోద్యంగా చూశారు కొందరు. విరక్తి చెందారు ఇంకొందరు.

 Previous Page Next Page