ఆవేశకావేశాలకు, కోపతాపాలకు, భేషజాలకు, సంతోష సంభ్రమాలకు తావీయని ప్రధాని చక్రవర్తి ఎదురైన సభ్యులందరినీ ఆప్యాయంగా పలుకరించారు. పత్రికా ప్రతినిధుల నమస్కారాల నందుకున్నారు.
ఆయన గంభీరంగా, బింకంగా వున్నారు. ముఖ కవళికలలో ఎటువంటి భావాలను వ్యక్తం చేయడం లేదు. ఇలా వుండడం ప్రపంచ జాతులలో ఒక్క చైనావారికే సాధ్యం అనుకునేవారు. కాని, మన ప్రధాని చక్రవర్తి కొన్ని ప్రత్యేకతలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి! ఆ విశిష్టత ఆయన ప్రతి కదలికలో, భంగిమలో, మాటలో, చేతలో కనుపిస్తుంది!
స్పీకరు వచ్చి తమ స్థానంలో ఆశీనులయారు. అలారం మోగింది.
నాటి ఎజండా చాలా పెద్దది. దాని ప్రకారం వరుసగా-
దివంగత ప్రధాని అమరేంద్ర కేసు గురించి వివరణ ఇవ్వాలి. పాకిస్తాన్ యుద్దోన్మాద వైఖరికి విరుగుడుగా భారత ప్రభుత్వం చేపడుతున్న తక్షణ చర్యల గురించి చెప్పాలి, దేశంలో హిందు - ముస్లిమ్ సఖ్యత మెరుగుదలకు జరుగుతున్న కృషిని వివరించాలి.
కాశ్మీర్ లో చెలరేగుతున్న విచ్చలవిడి అరాచక హింసాకాండ నివారణకు తీసుకుంటున్న తాజా చర్యలు ఏ స్థాయిలో వున్నాయి?
ఆంధ్రప్రదేశ్ లో మితిమీరిన నక్సలైట్ల దుందుడుకు కార్యకలాపాలకు అడ్డూ అదుపూ అంటూ వున్నదా లేదా? తమిళనాడు ఎల్.టి.టి. ఉనికిని కనిపెట్టారా లేదా?
ఈ ఏటి బడ్జెటులో రక్షణ శాఖ పద్దును ఎందుకు తగ్గించినట్టు? అణుశక్తి వ్యవహారంలో ప్రభుత్వం వైఖరి ఏమిటి? అధునాతన యుద్ధపరికరాల తయారీలో, రాకెట్లు, ఉపగ్రహాల ప్రయోగంలో భారతదేశం స్వయంచోదిత శక్తిగా వున్నదా లేదా? ఇందుకు ఆటంకాలేమైనా ఉన్నాయా, వుంటే అధిగమించడానికి అనుసరిస్తున్న మార్గాలేమిటి?
హోం, రక్షణ శాఖలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధానే ఈ ప్రశ్నలకు, వీటి చర్చల మధ్యలో వచ్చే అనుబంధ ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి వున్నది.
ప్రధాని చక్రవర్తి లేచారు. నోట్స్ చూసుకున్నారు. టైమ్ ను గుర్తించారు. మైక్ ను అందుకున్నారు. ధీరగభీర స్వరంతో మాట్టాడడం మొదలుపెట్టారు:
Truth and Non-violence are as old as the hills" అని ప్రవచించారు మన జాతిపిత మహాత్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధి. ఈ దేశ స్వాతంత్ర్యంకోసం వేలాది మంది అశువులు బాశారు. లక్ష్యల సంఖ్యలో జైళ్ళపాలయ్యారు. రక్తపాతం ద్వారానే మనం స్వరాజ్యాన్ని సాధించుకున్నాం అనుకోవడం భ్రమ. ఈ వాదనను నేను, మీరే కాదు, యావత్ ప్రపంచమూ అంగీకరించదు. ఓర్పు, సహనం, అహింస, త్యాగనిరతి, అనితరసాధ్యమైన శాంతియుత పోరాటాలు మన దేశ స్వాతంత్ర్య సాధనకు గీటురాళ్ళు. ప్రపంచ చరిత్ర పుటలలోనే భారత స్వాతంత్ర్య సంగ్రామం ఒక గొప్ప ప్రజాస్వామ్యయుత పోరాటానికి ప్రాతిపదిక అయింది.
"గౌరవనీయ సభ్యులార! అటువంటి కీర్తి పతాకను ఎగుర వేసిన భారతీయులకు ఈ రాకెట్ లాంఛర్లు, బాంబర్లు, మెషిన్ గన్లు, మిస్సైల్స్ వంటివి కేవలం ఆట వస్తువులేనని అభివర్ణించడానికి సాహసిస్తున్నాను. మన ఆత్మశక్తి, ధీరోదాత్తత, నిజాయితీ, రాజనీతి, ఆధ్యాత్మిక చింతన, విశ్వజనీనతా దృష్టి, శాంతియుత సహజీవనా సూత్రాల ముందు ఏ ఆయుధాలైనా దిగదుడుపులే, ఏ యుద్దోన్మాద శక్తులైనా దృష్టి బొమ్మలే; ఏ ఎత్తుగడలైనా పడని పాచికలే.
"తోటి భారతీయులలో సగం మందికిపైగా దారిద్ర్య రేఖకు దిగువున దుర్భర జీవనం గడుపుతున్నపుడు, అట్టి వారికి ముప్పొద్దులా ముద్దపెట్టలేకపోయినా, ఒక్కపూట అయినా పస్తుపడుకోకుండా చూడడం మనందరి కనీస కర్తవ్యం కదా? ఆకలి పరిష్కారం తరువాతనే అన్య అంశాల ప్రస్తావన.
"పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మనం మనకు వున్న వనరులను ముందు సద్వినియోగపరచుకోవాలే కాని, లేనివాటి గురించి అర్రులు చాచడం తెలివైన పని కాదని సభకు సవినయంగా మనవి చేస్తూ, ఇహ, ప్రస్తుత చర్చనీయాంశాలలోకి వస్తున్నాను.
"ఇప్పుడు నా ప్రభుత్వం మన రక్షణ శాఖకు కేటాయిస్తున్నన్ని నిధులు, మొత్తం ఆసియా ఖండంలో మరే దేశమూ తన డిఫైన్స్ బడ్జెట్ కు కేటాయించలేనంత హెచ్చుగా వున్నాయని సగర్వంగా చెప్పగలను. అయితే, ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్నట్టు, సూపర్ పవర్ కంట్రీస్ ఆయుధ సంపత్తితో మనం సరిపోల్చుకోవడం తగదు.
"తన చుట్టూ రాజకీయ అనిశ్చిత స్థితినెలకొని ఉండడంవల్ల, భద్రతా భావరాహిత్యం వల్ల, సంపన్న దేశాల మధ్యనే ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుండడంవల్ల ఆ దేశాలవారు తమ తమ రక్షణ బలగాలను, బలాన్ని ఏటేటా పెంచుకోవలసిన అగత్యం ఉన్నది. మనకు అట్టి అవసరం లేదు.
"పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, కొన్ని ఆసియా దేశాలు- ముఖ్యంగా మనం తమ శత్రువులుగా భావించుకుంటున్న ఇరుగుపొరుగు దేశాలవారు-తమ ఆయుధాగారాలను ఇంకా ఇంకా నింపుకోవడం కోసం వెంపరలాడుతున్నారు, ఆయుధ సేకరణా తాపత్రయంతో సంపన్న దేశాలకు ఎగబడుతున్నారు, దేబిరిస్తున్నారు.