"యు నో రవీ - అజ్ఞాత రచయిత 'శ్రీ' మీద ఎంత రివార్డు వున్నదో నీకు తెలుసు కదా, ప్రకటించినప్పుడు యాభై లక్షల రూపాయలు! ఇప్పుడు ప్రభుత్వం ఆ బహుమతి మొత్తాన్ని ఇమా పెంచే సూచనలున్నాయి. అతనిని పట్టి ఇచ్చినవారికి పూర్తి రక్షణ ఏర్పాట్లు కూడా చేస్తానంటున్నది ప్రభుత్వం. అసలు, ఈ మిస్టోరియస్ మర్డర్ కేసుకు, ఆ 'ది బ్లడ్' నవలా రచయిత 'శ్రీ' కి సంబంధం ఏం వున్నదని నువ్వు అడగవచ్చు. జస్ట్, ఏదైనా సంబంధం వున్నదేమోననే ఒక్క అనుమానమే!"
క్షణం ఊపిరి పీల్చుకుని మరల అన్నాడు చటర్జి. ది బ్లడ్ ఆంగ్ల నవల ముద్రితమయి, ఇంకా విడుదల కావడానికి ముందే ఆ నవలలోని వ్యూహాన్ని అనుసరించి నరహంతకులు ప్రధాని అమరేంద్రను తుదముట్టించడానికి పథకం సిద్ధంచేసి వుండవచ్చునని నా మట్టుకు నేను అనుకుంటున్నాను. ఇదే నిజమైతే, 'శ్రీ' ని పట్టుకుంటే ఈ కేసులో నిందితుడు లేక నిందితులు ఎవరో ఇట్టే తెలిసిపోతుంది. ఏమంటావు?" చెప్పడం ఆపి, జవాబు కోసం అన్నట్టు రవితేజ కళ్ళలోకి చూశాడు ఛటర్జి.
"ఈ కేసుకు, ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరు రాణాప్రతాప్ హఠాస్మరణానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం వున్నదని కూడా నా అనుమానం, సర్! రెండు మరణాలు ఒకే విధంగా సంభవించాయని అనుకోవచ్చు. అయితే, ప్రధాని అమరేంద్ర మీద విషప్రయోగం జరిగింది ఎప్పుడు ఏ విధంగా ఎవరి ద్వారా అనే వాటికి సరైన సాక్ష్యాధారాలు లేవు. అయితే, రాణాప్రతాప్ విషయంలో మాత్రం ఒకే ఒక్క అంశం స్పష్టంగా వుంది. అదేమిటంటే - ప్రధాని భౌతిక కాయాన్ని తీసుకువచ్చిన విమానం అమెరికాలో బయలుదేరి మన ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగే లోపుగా ఆయన మరణం సంభవించింది. అంటే, విద్రోహులు ఆ విమానంలోనే ఉండి వుండాలి..." అటూ ఇటూ కదులుతూ, ఆలోజిస్తూ చెప్పుకుపోతున్న రవితేజకు అడ్డు తగిలాడు ఛటర్జి.
"అసలు ముందు, రాణాది హత్యో, ఆత్మహత్యో ఇంకా తేల లేదు కదా! ఏమైనా, ఈ రెండు కోణాల నుంచే దర్యాప్తు కొనసాగవలసి వుంటుంది!"
"యస్సర్! యు ఆర్ సెంట్ పర్సంట్ కరక్ట్ - మీ అంచనాతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను! 'శ్రీ' ఎవరో తెలుసుకుంటాను. రాణా ప్రతాప్ ది హత్యో, ఆత్మహత్యో నా దర్యాప్తులో పూర్తిగా నిగ్గు తేలుస్తాను. అయితే, ఈ విషయంలో మీరు నాకు పూర్తిస్వేచ్చ..."
"ఆలోచనలకా, చేతలకా?" సీరియస్ గా అన్నాడు ఛటర్జి. తెల్లబోయాడు రవితేజ.
తన జోక్ కు తనే తెల్లగా నవ్వాడు ఛటర్జీ. తెల్లరిల్లాడు రవితేజ. వాతావరణం తేలికయింది.
"సర్! 'శ్రీ' ఎవరో తెలుసుకునేంతవరకు ఈ విషయాలన్నింటినీ అత్యంత గోప్యంగా వుంచవలసిన బాధ్యత మనందరి మీదా వుంది..."
"అవునవును! టాప్ మోస్ట్ సీక్రెట్!"
"విత్ యువర్ పర్మిషన్, ఈ కేసు ఫైలును నేనొకసారి క్షుణ్ణంగా స్టడీ చేయాలి. మీరు అనుమతిస్తే, సర్..."
"ఎస్ యస్, వైనాట్? అసలు అందుకే గదా ఈ కేసు గురించి నీకు బ్రీఫ్ చేసింది! టేక్ యువర్ ఓన్ టైమ్. ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు ఏవైనా వెలికివస్తాయోమో, పరిశీలించు! దర్యాప్తును మరొక కోణానికి మళ్ళించాలేమో కూడా చూడు! ఇంకేదైనా బ్రేక్ త్రూ వుంటే, వెంటనే నాకు తెలియజేయి!"
ఫైల్ ను క్లోజ్ చేసి రవితేజకు అందించాడు ఛటర్జి. దానిని నిదానంగా అందుకుని, ఆయనకు గౌరవంగా విష్ చేశాడు రవితేజ.
"ఆల్ ద బెస్ట్, మై బోయ్!" అంటు అతనితో కరచాలనం చేశాడు.
రవితేజ నిష్క్రమించగానే, హోమ్ మినిష్టరుకు ఫుటప్ చేయవలసిన ఫైల్ పనిలో నిమగ్న మయాడు ఛటర్జి.
* * *
పార్లమెంటు సెషన్స్ లో వుంది.
ఆ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో యుద్ధభేరి మ్రోగనున్నది!
లీడర్ ఆఫ్ ద హౌస్ గా ప్రధాని చక్రవర్తి స్వయంగా కొన్ని ప్రశ్నలకు ప్రత్యుత్తరాలను సభలో సభ్యులకు విశదీకరించవలసి వున్నది.
సభ సమావేశం కావడానికి పది నిమిషాలకు ముందే భారతదేశపు కొత్త ప్రధాని చక్రవర్తి హౌస్ కు వచ్చారు. కారు దిగి, నడుచుకుంటూ నిదానంగా వచ్చారు.
చీఫ్ విప్పు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి, లోక్ సభ సెక్రటరీ ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. కలిసి, సెంట్రల్ హాలులోకి వచ్చారు.