Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 37


    "భలేవాడివే ! నీ విషయంలో ఎవరో సిఫారసు చేయవలసిన అవసరం ఏమీ లేదే ! నీ కఠోర శ్రమ, పట్టుదల, వృత్తిపట్ల అంకితభావం గురించి నీ పర్సనల్ రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి కదా !" మెచ్చుకోలుగా అన్నాడు ఛటర్జీ. కృతజ్ఞతా భావంతో నమ్రత కనబరచాడు రవితేజ.

    "మిష్టర్ రవి ! నిన్ను కావలెనని సి.బి.ఐ.లోకి తీసుకోవడంలో నా స్వార్ధం కూడా కొంత లేకపోలేదు! సౌత్ ఇండియన్ అయిన స్వర్గీయ అమరేంద్ర కేసులో ఇప్పటి వరకు సరైన  'క్లు' ఏదీ లభించలేదు. నువ్వు కూడా సౌత్ ఇండియన్ వే కావడం వల్ల, సదరన్ జోన్ తో నీకు బాగా పరిచయం వుండడం వల్ల, ఈ కేసుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలలో కొందరిని విచారించడం, ఇంటరాగేట్ చేయడం వగైరాలలో ముందుకు దూసుకుపోగలవనే నమ్మకంతోనే నీ సర్వీసెస్ నాకు కావాలని భారత ప్రధానికి రాశాను..." అంటు రవితేజ మీద తను పెట్టుకున్న ఆశలన్నింటినీ క్షణంలోనే ఆయనా క్షుణ్ణంగా చెప్పేవేశాడు ఛటర్జీ.

    ఛటర్జీ ఇప్పుడు చాల హుషారుగా వున్నాడు. రవితేజ రాకతో కేసు ఒక కొలిక్కి వచ్చినట్టే సంబరపడిపోతున్నాడాయన.

    మ్రాన్పడిపోయాడు రవితేజ. తను అనవసరంగా ఇప్పటి వరకు ఈ విషయంలో రీతూని అపార్ధం చేసుకుంటూ వస్తున్నాడు ! తనను ప్రధాని సెక్యూరిటీ నుంచి తప్పించి సి.బి.ఐ. కి మార్పించడంలో రీతూ పాత్ర వున్నదని తను అపోహపడుతున్న మాట నిజం !

    రీతూ మాటలు ప్రధాని నమ్మి ఓవర్ నైట్ తనను తన బాధ్యతల నుంచి తప్పించి, ప్రధానికి ఇష్టమైన వ్యక్తి విక్రమ్ ను తన స్థానంలో  నియమించుకున్నారని అనుమానించాడు...

    తన అనుమానం నిరాధారమని తేలిపోయింది ! ప్రధానిని ,రీతూనీ తక్కువగా అంచనా వేసుకున్నందుకు తనలో తను పశ్చాత్తాపపడ్డాడు రవితేజ.

    అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ రీతూ తన హృదయంలోనే వున్నది ! కాని, ఎందుచేతనో ఆమె తన ఉనికినే అసహ్యించుకుంటున్నది...

    తను ఆమెను ప్రేమిస్తున్నట్టు రీతూకు తెలియదా...? ఒక వేళ ఆమె వేరెవరినైనా ప్రేమిస్తున్నదా...

    'లేదు లేదు...అలా జరగదు...' మనసు మూలిగింది.

    తనకు శాఖ మారడం కూడా ఒకందుకు మంచిదే- కావలసిన వ్యక్తులు తాత్కాలికంగా కొంత దూరమైతే, ఆ వెంటనే శాశ్వితంగా దగ్గర కావడానికి అవకాశం హెచ్చుగా వుంటుంది !

    అయినా, తనేమీ దేశ రాజధానిని విడిచి వెళ్ళిపోవడం లేదు కదా ! ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో విధంగా రీతూను చూస్తూ వుండవచ్చు, ఆమె మంచి, చెడ్డలను ఎప్పటి కప్పుడూ తెలుసుకుంటునూ వుండవచ్చు !

    తెలిసో తెలియకో అప్పుడెప్పుడో సదస్సులో తనను అనుమానించిన విషయాన్ని తనెన్నడో మరచిపోయాడు ! ఆమె తన ప్రాణం. తన హృదయాధిదేవత !

    రీతూ మనసు మారితే తనకంటే అదృష్టవంతుడు ఈ లోకంలో మరెవ్వరూ వుండరేమో ! కాలమే ఆమె మనసును మార్చుతుందనే ఒకే ఒక్క ఆశతో రోజులను నెట్టుకొస్తున్నాడు...!

    "సీ, మిష్టర్ రవి..." 

    ఛటర్జీ పిలుపుతో ఉలిక్కిపడ్డాడు రవితేజ.

    ఇదేమిటి...! సమయం సందర్భం లేకుండా తన ఆలోచనలన్నీ రీతూ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి...! ప్రేమలో పడిన ప్రతివారు ఇలా పరాకులు చిత్తగిస్తుంటారా...!

    చికాకులకు, అనుమానాలకు, అపార్ధాలకు దారితీయనంత వరకు ఈ అనుభూతి తీయ తీయగానే వుంటుంది !

    "ఏమిటి - ఈ కేసులో అప్పుడే ఏం చేయాలో ఊహించేస్తున్నావా ఏమిటి!" చిన్న చురక వేశాడు చటర్జీ. రవితేజ ఏమరపాటును ఆయన ఇందాకటి నుంచి గమనిస్తూనే వున్నాడు!

    "సారీ, సర్! అటువంటిదేమీ లేదు...!" గతుక్కుమన్నాడు రవితేజ.

    "దట్స్ గుడ్! ముందు, ఈ కేసు గురించి సూక్ష్మంగా వివరిస్తాను. ఆ తరువాత నువ్వు నీ దర్యాప్తును ఏ కోణం నుంచి ప్రారంభిస్తే బావుంటుందో నీవే స్వయంగా నిర్ణయించుకుందువు గాని..." ఛటర్జీ గంభీరంగా ప్రారంభించాడు.

    "దిస్ ఈజ్ ది కేస్ ఫైల్ ఆఫ్ లేట్ అమరేంద్ర. యు నో, ఇట్ ఈజ్ ఎ మిష్టరీ ఇన్ క్రిమినల్ హిష్టరి. క్రిమినల్ ఒకడో ఎందరో తెలియదు. బహు చాకచక్యంగా చేశారు హత్య .నేరస్థులిలో ఒక్క ఆధారాన్ని కూడా మిగల్చకుండా జాగ్రత్తపడ్డారు. అంటే నేరస్తులు ఎంత తెలివిగల వారో అర్ధం చేసుకోవచ్చు. అమరేంద్ర శరీరం మీద ఎటువంటి గాయమూ లేదు యు నో, అమరేంద్ర మీద విషప్రయోగం జరిగింది!" క్షణం ఆగాడు ఛటర్జీ.

    డ్రాయరు సొరుగులో నుంచి అట్టవేసివున్న ఒక పుస్తకాన్ని బయటకు తీశాడు ఛటర్జీ. "బై ది బై, ఇదుగో ఇది 'శ్రీ' అనే ఒక అజ్ఞాత రచయిత వ్రాసిన 'ది బ్లడ్' అనే ఆంగ్ల నవల. ఒకవేళ ప్రధానిని ఏ విధంగా  హత్యచేయవచ్చునో దీనిలో వ్రాసి వుంది. ఇది అచ్చయి, విడుదలైన తరువాత, దీనిని చదివిన ప్రభావంతోనే - అందులో రాసిన విధంగానే - ఎవరో ఉన్మాది ఈ హత్యచేసి వుండవచ్చునని అనుమానించడానికి వీలవుతుంది. ఆ భ్రమతోనే కావచ్చు. ప్రధాని హతోదంతం తెలిసిన యావత్తు పాఠకలోకం ఆ నవలను కుతూహలంతో ఎగబడి మరీ కొన్నారు!" అంటూ తనూ ఉత్సుకతగానే చెప్పుకుపోతున్నాడు ఛటర్జీ.

 Previous Page Next Page