Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 36


    మానవ సంబంధాలకు ఎవ్వరూ అతీతులు కారు, కాలేరు. సింధు ధీరజతోపాటు ఒకేతల్లి పేగు తెంచుకు పుట్టిన సోదరి. అందునా ఆమె భయంకరమైన గుండెజబ్బుతో  బాధపడుతున్నది. చెల్లిగా ఆమె మీద మమతాను రాగాలు వుండడం అలా వుంచి, ఆమె మృత్యుగహ్వరాన నిలచి ఉన్నదనే సత్యాన్ని వాళ్ళు అర్ధం చేసుకున్నారు.

    వాళ్ళ మౌనంతో ఆమె గుండె చెరువవుతున్నది ...

    "ఒక్కసారి సింధూని చూడనివ్వరూ...? బేలగా అడిగింది.

    ఆమె మాటలోని ఆతురతను, ఆవేదనను గమనించారు వాళ్ళు. కాని, వాళ్ళ పంధా పంధామే...!

    "సారీ, ధీరజా, ఐయాం రియల్లీ సారి...సింధూకి ఏం ప్రమాదం లేదు. ఆమెకు అవసరమైన అన్నీ వైద్య సదుపాయాలకు తగు ఏర్పాట్లు చేశాం. కాని, ప్రస్తుతం నువ్వు ఆమెను చూడడానికి మాత్రం వీల్లేదు. నిన్ను ఒక ప్రత్యేకమైన కర్తవ్య నిర్వహణకోసం ఎంపిక చేసుకున్నాం. దానిని దిగ్విజయం చేయగలిగినప్పుడే నీకూ నీ చెల్లి సింధూకు విముక్తి లభిస్తుంది. అంతవరకు మేము చెప్పినట్టు నువ్వు నడుచుకోవలసిందే!" నిష్కర్షగా చెప్పాడు బాస్.

    "కాని...సింధూకి వెంటనే ఆపరేషన్ చేయించకపోతే...దాని ప్రాణానికేమైనా జరిగితే..."

    పంటి బిగువున మాట్టాడుతున్న ఆమె కనుకొలకులలో నీలినీడలు చోటు చేసికోవడాన్ని అధికారి గమనించాడు. అంత చీకటిలోనూ దానిని అతను గుర్తించగలిగాడు. కాని...

    "దట్స్ ఓకే ధీరజ! సింధూ ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లూ చేస్తాము!" వాగ్దానం చేశాడు బాస్.

    "థాంక్స్...!" మామూలు లాంఛనప్రాయంగా అనగలిగింది ధీరజ.

    కీచుమని శబ్దం చేస్తూ వ్యాన్ ఆగింది.

    స్థావరానికి చేరినట్టేనని గ్రహించింది ధీరజ.


                                                         *    *    *


    రోజులు...   వారాలు...   నెలలు...   గడచిపోతున్నాయి.

    అమరేంద్ర కేసు దర్యాప్తులో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.

    సి.బి.ఐ. డైరెక్టర్ ఛటర్జీకి ఇది పెద్ద తలనొప్పిగా, తలవంపులుగా వున్నది. తన సుదీర్ఘ సర్వీసులో తనెన్నడూ మాట పడలేదు. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం...

    రేపు పార్లమెంటు సమావేశాలలో ఉభయ సభలలోను అమరేంద్ర కేసు దర్యాప్తు పురోగతి గురించి ప్రశ్నోత్తర కార్యక్రమాల ఎజెండాలో వున్నదని ,సభ్యుల ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వీలుగా ఆ కేసు దర్యాప్తు గురించిన పూర్తి వివరాలను రిఫరెన్స్ నోట్ తో సహా వెనువెంటనే తన చాంబరుకు పంపవలెనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఫోన్ లో స్వయంగా తనకు ఆదేశించారు...

    ఈ కేసుకు సంబంధించి ,దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఏ విషయమూ బహిరంగంగా చర్చించడం మంచిది కాదు. కాని, జనాభిప్రాయాన్ని మన్నించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద వున్నదనే విషయాన్ని కూడా విస్మరించడానికి వీలులేదు...
   
    ఇప్పుడు ఏం చేయాలి ? కిం కర్తవ్యం...?

    అంతర్జాతీయ స్థాయిలో అయితే- తన దర్యాప్తును, తనకు సహకరిస్తున్న అధికారుల వైఫల్యాన్ని చచ్చినట్టు అంగీకరించవలసిందే !

    అలా అని తన వైఫల్యాన్ని ఒప్పుకుంటే- అమెరికాకు చెందిన నేర నిరోధక దర్యాప్తు బృందాలు ఈ కేసు మిష్టరీని ఛేదించడానికి రంగంలోకి దూకడానికి సంసిద్ధంగా వున్నాయి !

    ఇది తలతీసేసినట్టే ! ఈ సవాలు భారతీయులకు, వీరి మేథో పటిమకు, పరిశోధనా పాటవానికే తీరని తలవంపు...

    కాలింగ్ బజర్ మ్రోగడంతో, ఆలోచనలను ప్రక్కకు నెట్టి, "కమిన్ !" అన్నాడు ఛటర్జీ యధాలాపంగ. అంటూనే సర్దుకు కూర్చున్నాడు.

    స్మార్ట్ గా ఫుల్ సూట్ లో వున్న రవితేజ ఠీవిగా సెల్యూట్ చేసి, తనను తను పరిచయం చేసుకున్నాడు. తన ఆర్డరు కాగితాన్ని తీసి ఛటర్జీకి అందించాడు వినయంగా.

    ఛటర్జీ ఆ ఉత్తర్వును లాంఛనంగా ఒకసారి చూసాడు. ఇతను వస్తున్నట్టు తనకు ముందే ఫోన్ ద్వారా తెలియజేశారు !

    చూసీ చూడనట్టే రవితేజను నఖశిఖపర్యంతం క్షణంలో వీక్షించాడు ఛటర్జీ.

    "వెల్ కమ్, మై బోయ్ ! నీలాంటి యువకుల సేవలే ఈ దేశానికి ఇప్పుడు ఎక్కువగా కావాలి ! నా అభ్యర్ధనను మన్నించి ప్రధాని నిన్ను ఇంత తొందరగా నాకు స్పేర్ చేస్తారని అనుకోలేదు ! కమాన్, సిట్ డౌన్ !" ఉత్సాహంగా అంటూ కూర్చీ చూపాడు ఛటర్జీ.

    కూర్చోలేదు రవితేజ. అతను నివ్వెరపోయాడు !

    "సర్! నా సర్వీసెస్ కావాలని మీరే కోరారా...! నా గురించి ఎవరు సర్టిఫై చేశారు సర్ ?" కుతూహలంగా అడిగి ఉత్సుకతతో చూశాడు రవితేజ.
       

 Previous Page Next Page