వచ్చే పోయే వాహనాలు. అప్పుడప్పుడే వెలుగుతున్న వాటి హెడ్ లైట్లు. పాదచారుల నడక పందెం. రోడ్డంతా గజిబిజి.
ధీరజ ఆటో రిక్షా నుంచి దిగింది. చేత సూట్ కేసు. రోడ్డువారగా నిలచి ఎవరికోసమో ఎదురుచూస్తున్నది. ఆమె ఆతురతను గమనించినట్టు క్షణాలు త్వరత్వరగా కదలిపోతున్నాయి. నిట్టూర్చింది. నుదురు తుడుచుకుంది...
మారుతీ వేన్ ఒకటి వేగంగా వచ్చి ఆమె ముందు షడన్ గా ఆగింది. వ్యాన్ రిజిష్టరు నెంబరును గుర్తించే వ్యవధిని సయితం ఆమెకు ఇవ్వకుండా దాని బేక్ డోర్ తెరచుకుంది.
"కమాన్, ఐసే, గెట్ ఇన్!" అంటూనే అధికారి ఆమె రెక్కపుచ్చుకుని లోనికి దాదాపు లాగివేసి డోర్ లాక్ చేసేశాడు. అంతా క్షణకాలంలో జరిగిపోయింది.
వ్యాన్ వెనక సీటులో అధికారి కాక మరి ఇద్దరు కూర్చుని వున్నారు. వాళ్ళు సాయుధులు.
ముగ్గురికి సరిపోయే సీటులో నలుగురు కూర్చోవడం- అందునా మగవాళ్ళ మధ్య- ధీరజకు చాలా ఇబ్బందికరంగా వుంది.
ధీరజ ఎంత ఒదిగి కూర్చున్నా, దూరదూరం జరుగుతున్నా ఆమె శరీరానికి వాళ్ళ శరీరాలు తాకుతూనే వున్నాయి. వ్యాన్ కుదుపుకు, మలుపులకు, షడన్ బ్రేకులకు, హఠాత్ కదలికలకు ఒకరికొకరు రాసుకొనక తప్పడంలేదు. ఒత్తిడి, ఒరగడం జరగకపోవడం లేదు.
'తప్పదు, తను భరించక తప్పదు' అనుకుంటూ నిట్టూర్చింది ధీరజ.
ఇప్పుడు తను ఆలోజించవలసింది తన సౌకర్యం గురించి కాదు, తన పరాభవాల గురించి కాదు, మంచి- చెడుల గురించి కాదు-తన చెల్లెలు సింధు గురించి...
సింధు ఎక్కడ వున్నది? ఎలా వున్నది? వీళ్ళు ఆమెను ఎక్కడ దాచిపెట్టారు? ఎలా చూస్తున్నారు? అసలు ఏమి ఆశించి ఆమెను అపహరించారు?...
"వెల్ కమ్ ధీరజా!" నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినవచ్చింది మెటాలిక్ వాయిస్.
తృళ్ళిపడింది ధీరజ. ఆ గొంతును, ముందు సీటులో డ్రయివరు ప్రక్కన కూర్చుని వున్న వ్యక్తిని పోల్చుకుంది ధీరజ. అతను అధికారికి బాస్! గ్యాంగులీడరు.....!
"మమ్ము వెదుక్కుంటూ నువ్వు తప్పక వస్తావని అధికారితో నేను పందెంకాశాను. ఐ యాం విక్టోరియస్! యామైనాట్...?" ప్రశ్నిస్తూనే జవాబుకోసం అన్నట్టు వెనక్కు తిరిగాడు.
"ఎస్, సర్...యు ఆర్ ఆల్వేస్ విక్టోరియస్!" పొగిడాడు అధికారి.
వ్యాన్ ను అత్యంత చాకచక్యంగా, అమితవేగంగా డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవరు. మధ్య మధ్య రియర్ వ్యూ మిర్రర్ లోకి నిశితంగా చూస్తున్నాడు. తమను ఎవరైనా వెంటాడుతున్నారేమోనని అతని అనుమానం. అనుమానించదగినదిగా ఏ వాహనమైనా వెన్నంటి వస్తుంటే దానికి అందకుండా ఆఘమేఘాల పోనివ్వాలి. ఇది బాస్ ఆజ్ఞా! కాని, అద్దంలో అటువంటి అవకాశాలేమీ ఇంతవరకు కనుపించడంలేదు!
"ఏమీ మాట్టాడవేం ధీరజా? మాతో చేతులు కలపడం నీకు ఇప్పటికీ ఇష్టం లేనట్టుగా వుందే..." బాస్ కఠినంగా ప్రశ్నించాడు.
ధీరజ మౌనం బాస్ కు చిర్రెత్తిస్తున్నది. మరల వెనక్కు చూశాడు.
"సే, ఎస్-ఆర్-నో!" కంచు కంఠంతో అడిగాడు. ఆ స్వరంలో ధీమ!
మరి ఆలస్యం చేస్తే పరిస్థితి విషమించవచ్చుననుకున్నది ధీరజ. తను ఏదో ఒక సమాధానం చెప్పితీరాలి! ఆ విషయంలో తను ముందే ఒక నిర్ణయానికి వచ్చి వున్నది. కాలయాపన చేయడం ఇక వ్యర్ధం. అనవసరం...
"ఎస్. మీతో చేతులు కలపడానికే నిర్ణయించుకున్నాను. ఇది నా కృతనిశ్చయం. అందుకనే, నా బట్టలను కూడా సర్దుకు తీసుకు మరీ వచ్చాను." చెప్పింది ధీరజ నిదానంగా.
"ఎస్...మీ అక్కా చెల్లెళ్ళ బంధం అటువంటిది! రాకేం చేస్తావు, ఛస్తావా...?" విషపు నవ్వును ఒలకబోశాడు బాస్. అతని కనులు మెరిసాయి.
ఈపాటికే చాలా దూరం వచ్చేసింది వ్యాను.
తన జేబులోనుంచి బ్లాక్ టేప్ తీశాడు అధికారి. ఆమె కనుల మీదుగా అంటించేశాడు.
ధీరజకు ఇప్పుడు ఏమీ కనుపించడం లేదు. అంతా కటిక చీకటి...
"సారీ. ధీరజా! నిన్ను పూర్తిగా నమ్మేంతవరకు మా ముందు జాగ్రత్తలు మేము తీసుకోవాలి!" అన్నాడు అధికారి లో గొంతుతో.
వాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలనుబట్టి, వాళ్ళ స్థావరానికి తనను తీసుకువెడుతున్నట్టు గ్రహించింది ధీరజ. ఆమెలో ఉద్విగ్నత హెచ్చింది. నిర్లిప్తత ఏర్పడింది...
"సింధూ ఎలా వుంది...?" నీరసించినట్టు అడిగింది. జాలిగా, దీనంగా అడిగింది.
ఆ ప్రశ్నకోసమే ఇందాకటినుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇంకా అడగకపోవడంతో ఆమెను అనుమానించారు కూడాను! ఇప్పుడు సరిపెట్టుకున్నారు...కాని, ఆమె ప్రశ్నకు జవాబు మాత్రం ఎవ్వరూ చెప్పలేదు!