Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 34


    "ఆనంద్ గారు కావాలి!" అడిగింది రీతు.

    "జస్ట్ హోల్డ్ ఆన్ ద లైన్!"

    రిసీవర్ ను చెవి దగ్గరే వుంచుకొని ఆలోచనలో పడింది రీతు.

    వ్యాసకర్త ఆనంద్ అని తేలితే, ప్రధాని ప్రతిస్పందన ఎలా వుంటుందో? ఏ చర్య తీసుకుంటారో...? ఒక దేశ ప్రధానితో పేచీ పెట్టుకుంటే పరిణామం ఎలా వుంటుందో...?

    ఆనంద్ అంటే తనకు విద్యార్ధి దశ నుంచీ అభిమానం. అతని ప్రత్యేక వ్యక్తిత్వం తనకు నచ్చింది. స్వయం కృషిని నమ్ముకున్న వ్యక్తి. కష్టజీవి. ఆత్మాభిమాని. తనకు తెలిసినంతవరకు ఆవేశపడే వ్యక్తికాదు, ఆలోచనాపరుడు. తను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడి, ఆమేరకు ఆదర్శనీయునిగా  జీవిస్తున్న మనిషి ముక్కు సూటి మనసు. అటువంటి వ్యక్తి ఏవో కొన్ని ప్రలోభాలకు లోనై ఇలా వ్రాసి వుంటాడని అనుకోవడానికి లేదు. అలా అని బిడియపడో, భంగపడో, భయపడో చేతులు ముడుచుకు కూర్చునే మనస్తత్వం కలవాడు కూడా కాదు. అంటే, కాశ్మీర్ సమస్యను కూలంకషంగా పరిశీలించిన పిదపే ఈ వ్యాసం వ్రాసి వుండాలి. అప్పుడు అతనిలో ఎలా డీల్ చేయాలి...

    "ఆనంద్ హియర్"

    రిసీవర్ లో వినిపించడంతో ఉలికిపడింది రీతు.

    "హలో ఆనంద్, నేను రీతూని!"

    "బాగున్నావా రీతూ! చాలా రోజులకు గుర్తుకు వచ్చినట్టున్నాను! ఏమిటి విశేషాలు?"

    ఏం చెప్పాలి? అసలు ఎలా ప్రారంభించాలి...

    "హలో! కాశ్మీర్ సమస్య గురించిన నీ వ్యాసం చదివాను..."

    "ఎలా వుంది?"  

    "ప్రధాని కూడా చదివారు..."

    "అనుకున్నాను!"

    "కాని, ఆనంద్...! నీవుగా అలా వ్రాసి వుండవలసింది కాదు!"

    "ఇది ప్రధాని అభిప్రాయమా, నీ సొంత..."

    "ఆఫ్ కోర్స్! చదివిన అందరి అభిప్రాయమూ అని అనుకోవచ్చు. ప్రధానిగా చక్రవర్తిగారు పదవిని చేపట్టింది ఎప్పుడు, సమస్య గురించి అలసత్వాన్ని కనబరచిందెప్పుడు ఆనంద్! ఆ వ్యాసం వ్రాసే ముందు ప్రధానిని ఇంటర్వ్యూ చేసి వుంటే బావుండేదేమో! నీ వ్యాసం ద్వారా ఇప్పుడు కొత్త ప్రధాని మనసును గాయ పరచావు. అభిమానాన్ని దెబ్బ తీశావు..." అనుకోకుండానే ఆమె మాటలలో ప్రధాని వ్యధ బహిర్గతమయింది!

    అటు నుంచి ఏ రెస్పాన్సూలేదు.

    "సారీ ఆనంద్...! నువ్వొక ప్రముఖ జర్నలిస్టువి. నీకు నేనేదో నూరి పోస్తున్నాననుకోకు! నిన్ను అభిమానించే వ్యక్తిని. నీకు ఏ సమస్యా రాకూడదనే ఇంతగా చెబుతున్నాను..." అనునయంగా నచ్చజెప్ప చూసింది రీతు.

    "థాంక్స్ రీతూ! ఈ విషయంలో ప్రధాని నీ మీద ఏదైనా బాధ్యత పెట్టినా, లేక నీ మనసుకు ఏది మంచిదని తోచినా, చెప్పు-అలాగే చేస్తాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు?"

    "ప్రధానితో వేరే ఇంటర్వ్యూకి ఏర్పాటు చేస్తాను. ఆ వ్యాసానికి బాధ్యత వహించి, ప్రధాని వివరణను తీసుకొని ఫాలో అప్ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం..."

    "అయినా ,పెద్దవారితో కోరి తగాదాలు తెచ్చుకోవడం ఎంతవరకు సబబో క్షణం ఆలోచించు, ఆనంద్!"

    సాదాసీదాగా అనినా, ఆమె మాటలలో సన్నటి చురక లేకపోలేదు.

    ఈ కొద్ది సేపటికే, ఈ కొద్ది మాటలకే రీతూ కలవరపాటుకు గురయింది. అటు క్లాస్ మేట్, ఇటు బాస్. ఇరువురూ స్వీయ వ్యక్తిత్వం కలవారే, సున్నిత మనస్కులే...!

    "మాట్టాడవేం ఆనంద్..."

    "వింటున్నాను!"

    "ఇంటర్వ్యూ టైమ్ తరువాత తెలియజేస్తాను... బై..."

    అప్పటి వరకూ ఆ ఫోన్ ను ట్రాప్ చేసిన సెక్యూరిటీ ఆఫీసర్ విక్రమ్ టేప్ రికార్డరును ఆఫ్ చేశాడు. నొసలు చిట్లించుకున్నాడు.

    రీతూ-ఆనంద్ పరిచయం గురించి కాదు ఇప్పుడు అతను ఆలోచిస్తున్నది, ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ గురించే!

    ఉద్దేశ పూర్వకంగా కాకపోయినా, ప్రధాని నిలయం నుంచి, ప్రధాని ఆలోచనల గురించిన సమాచారం బయటకు వెల్లడవుతున్నది! అదీ ప్రధానికి అత్యంత విశ్వాస పాత్రురాలని అనుకునే పర్సనల్ సెక్రటరీ రీతూ ద్వారా...

    ఈ అంశాన్ని ప్రధాని దృష్టిలో పెట్టాలా వద్దా? లేక, రీతూని హెచ్చరిస్తే? రెండు ఆలోచనలూ ఆచరణలో తన పరిధిలోవి కావు...!

    ఉద్యోగ ధర్మంగా కలం కాగితం అందుకున్నాడు విక్రమ్...


                                                             *    *    *


    సాయంసంధ్య. మసక మసక చీకటులలుముకుంటున్న వేళ.

 Previous Page Next Page