Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 33


    పౌరులలో పట్టు సాధించేంతవరకు వేచివున్న మిలిటెంట్లు, అ తరువాత తరువాత విజృంభించారు. నయానా భయానా ఇస్లామిక్ పాలనా పద్ధతులను ప్రవేశపెట్టారు.

    వీరు కాశ్మీర్ లోయలో మద్యపానాన్ని నిషేధించారు. లాటరీలు ఉండకూడదన్నారు. బ్యూటీ పార్లర్లను, వీడియో షాపులను, కడకు సినీ థియేటర్లను కూడా మూసివేయించారు. పొగ పీల్చడం ఇస్లామ్ వ్యతిరేక లక్షణమంటూ వ్యతిరేకించారు. మహిళలు బురఖాలను విధిగా ధరించి తీరవలెనని శాసించారు!

    తీవ్రవాదుల ఇలా చెలరేగడంతో కాశ్మీర్ కల్లోలప్రాంతమయింది. జన జీవనం అల్లకల్లోలంగా దెబ్బతిన్నది.

    ఆదాయానికి జీవగర్ర అయిన టూరిజం పూర్తిగా పడిపోయింది...

    తీవ్రవాదుల అనధికార పాలన కాశ్మీర్ లోయ మొత్తాన్ని అతలాకుతలం చేసింది. వ్యవస్థ అస్తవ్యస్థమయింది.

    తరతరాలుగా కలసిమెలసి బ్రతుకుతున్న కాశ్మీరీ ముస్లిములు - హిందూ పండిట్ల మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడింది. హిందూ పండిట్లు వర్తక - వాణిజ్యాదులను వదలుకొని, ఆస్తిపాస్తులను తెగనమ్ముకుని జమ్మూకు వలసపోవలసి వచ్చింది.

    1992లో కేవలం పదినెలల కాలంలో మిలిటెంట్లు 1,585 మందిని హతమార్చారు. వారిలో 23 మంది శిక్కులు, 218 మంది హిందువులు,  363 మంది భద్రతాదళ సభ్యులుకాగా, ముస్లిమ్ లు 981 మంది వున్నారు.

    కడచిన మూడేళ్ళలోనే నాలుగువందల రాకెట్ లాంచర్లను, 450 మెషిన్ గన్ లను, వెయ్యి రాకెట్లను, 2,450 పిస్టళ్ళు, రివాల్వర్లను, ఏడువేల రైఫిళ్ళను, ఏడువేల గ్రెనేడ్లను దుందుడుకు వాదుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ పాకిస్తాన్ అందిస్తున్నవే!

    ముందు భారతదేశం నుంచి కాశ్మీర్ వేరుపడిపోతే, ఆ తరువాత దానిని తేలికగా కబళించవచ్చునని పాకిస్తాన్ ఆశ. పేరాశ.

    'ఒకప్పుడు కాశ్మీరులో అంతర్భాగాలుగా వున్న బార్బిస్తాన్, దర్దిస్తాన్, ముజ్ ఫరాబాబ్, మీర్ పూర్, పూంచ్, జమ్ము, లడఖ్, కాశ్మీర్ 'ఆజాద్ కాశ్మీర్' భూభాగాలు కావాలి. అట్టి సువిశాల  'ఆజాద్ కాశ్మీర్' మాకు కావాలి!' అని మిలిటెంట్ల వాదన. కోర్కె.

    కాశ్మీర్ కల్లోలం వల్ల భారతదేశానికి రోజుకు మూడు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని అంచనా. ఇది ఏ బడ్జెట్టు జమా-ఖర్చో తెలియదు.

    భారతదేశానికి కొత్తప్రధానిగా శ్రీ చరవర్తి బాధ్యతలను స్వీకరించిన నాటినుండి నేటివరకు కాశ్మీర్ సమస్యా పరిష్కారానికి ఏ క్రియాత్మక చర్యనూ పటిష్టమంతంగా తీసుకున్నట్టులేదు. ఈ నానుడు వ్యవహార సరళి ఇలాగే కొనసాగితే శ్రీనగరం సిరి మనదేశాన్ని వీడిపోయే ప్రమాదం ఎంతో దూరంలో వుండదు. అప్పుడు 'భూతల స్వర్గాన్ని' మనంతట మనమే చేజార్చుకున్న మూర్ఖుల మవుతాం. అదే జరిగితే భవిష్యతరాల భారతీయులు నేటి ప్రధాని చక్రవర్తి క్రియాశూన్యత్వాన్ని క్షమించరు...!

    __ఆ రోజు పత్రికలో వచ్చిన వ్యాసాన్ని ఆసాంతం ఓపికతో చదివిన ప్రధాని చక్రవర్తి భృకుటి ముడిపడింది. ముఖం జేవురించింది. ముగ్గోళ్ళు అదిరాయి... 

    వెంటనే చేతికి అందుబాటులో వున్న బజర్ నొక్కారు ప్రధాని.

    వెనువెంటనే వచ్చింది రీతు. ప్రధాని ఏదైనా మేటర్ డిక్టేట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో షార్ట్-హాండ్ నోట్ బుక్, పెన్సిల్ తో సహా వచ్చింది.

    ప్రధానిని చూస్తూనే, ఆయన ఏదో ఆందోళనలో వున్నట్టు గ్రహించింది సూక్ష్మగ్రాహి అయిన రీతు ఆయన సాలోచనగా గడ్డం నిమురుకుంటున్నారు. అంటే ఏదో ఉన్నదమ్మ మాట...!

    "సీ, మిస్ రీతు! ఈ పత్రికలో కాశ్మీర్ సమస్య గురించి ఎవరో ఒకాయన వ్యాసం వ్రాశాడు. అందులో నా పేరును కూడా ప్రస్థావించాడు. కాశ్మీర్ సమస్యను నేటికీ పరిష్కరించలేకపోవడం నా అసమర్ధతకు చిహ్నమనే ధోరణిలో దుయ్యబట్టాడు...దానిని వ్రాసింది ఎవరో వెంటనే తెలుసుకొని నాకు చెప్పండి..." అంటూ చేతిలోని పేపరును ఆమెకు అందించారు.

    తెలుసుకోవలెననే ఆసక్తితోపాటు ప్రధాని గొంతులో కించిత్ ఆవేశం కూడా ధ్వనించడాన్ని గుర్తించింది రీతు. "ఎస్సార్!" అంటూ పేపరును అందుకున్నది.

    ప్రధాని ఫైళ్ళలోకి తల దూర్చడంతో, తనను పిలిచిన పని అయిపోయినట్టు అభిప్రాయపడి తన గదికి నడచింది రీతు నిశ్శబ్దంగా.

    గదిలో కూర్చుని పేపర్ తిరగేసింది. వ్యాసం చదివింది. తనూ కొంచెం నొచ్చుకుంది!

    అది 'జగజ్యోతి' పత్రిక. కనుక ఆ వ్యాస రచయిత ఆనంద్ అయివుంటాడు అని ఊహించుకుంది రీతు. వెంటనే టెలిఫోన్ డైరక్టరీ అందుకుని, నెంబర్ వెతకి, డైల్ చేసింది.

    అటు నుంచి వెంటనే రెస్పాన్స్ వచ్చింది. ఆడ గొంతు. 

 Previous Page Next Page