కారణాలు చాలా చాలానే కనిపిస్తాయి. చివరకు కాశ్మీరం ఒక చిక్కుముడి అయింది.
కాశ్మీరుకు భారతదేశంలో విశిష్టమయిన స్థానం వుంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రవ్వంత అధిక స్వాతంత్ర్యాన్నిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రమే పరిమితమై వున్న ఆస్తి హక్కు - ఈ రెండు ప్రత్యేకతలు వున్నా, కాశ్మీరీలకు అసంతృప్తి అధికంగా వున్న మాట నిజం.
సర్వసత్తాక ప్రతిపత్తి గల స్వతంత్ర జీవనం గడపవలసిన తమకు భారతదేశ పాలన దాపురించిందనే భావాన్ని తీవ్రవాదులు కాశ్మీరీలలో నూరిపోస్తున్నారు. వారిని తెగ రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే వారి గుండెల లోలోతుల గూడుకట్టుకున్న అసంతృప్తి అగ్నికి తీవ్రవాదుల ప్రచారం ఆజ్యమవుతున్నది...
దీనికి తోడు ప్రస్తుత భారత ప్రధాని శ్రీ చక్రవర్తి ఉదాశీన, ఊగిసలాట వైఖరి అలసత్వం, భారీ విధ్వంసకాండ వలన- భారతదేశం ప్రవచించే ప్రజాస్వామ్య సూత్రాలమీద కాశ్మీరీలకు నమ్మకం లేకుండా చేస్తున్నాయి.
నిజానికి, మనదేశ చరిత్రలో కాశ్మీర్ కథ 1947తోనే మొదలయింది. భారతదేశానికి, పాకిస్తాన్ కు స్వాతంత్ర్యం లభించిన తరుణంలో బ్రిటీష్ పాలకులు తమ 'విభజించి పాలించు' నీతికి అద్దం పడుతూ, స్వదేశీ సంస్థానా లన్నింటికీ వారు ఇటు భారతదేశంలో కాని, అటు పాకిస్తాన్ లోకాని స్వచ్చందంగా విలీనం కావడానికి సంపూర్ణమైన హక్కును ధారాదత్తం చేశారు.
అటువంటి సున్నితమైన సమయంలో అప్పటి కాశ్మీర్ పాలకుడైన మహారాజా హరిసింగ్ రోజులు నెలలు తరబడి ఎటూ నిర్ణయించుకోలేకపోయాడు. ఏ దేశంలో విలీనం కావాలి అనే విషయంలో డోలాయమాన స్థితిలో ఊగిసలాడాడు.
అటువంటి క్లిష్ట సమయంలోనే - 1947 అక్టోబరులో - కొందరు పాకిస్తానీయులు కాశ్మీర్ లోయలోకి చొరబడి దోపిడీలకు దౌర్జన్యకాండలకు పాల్పడడంతో హరిసింగ్ రాజావారికి కనువిప్పు కలిగింది.
పాకిస్తానీ ఆక్రమణదారులను వెనువెంటనే తరిమివేయడంలో తమకు సహకరించవలసిందిగా రాజాసాబ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. భారతదేశంలో విలీనానికి అంగీకరిస్తేనే తాము కాశ్మీర్ లో జోక్యం చేసుకుంటామని భారతప్రభుత్వం స్పష్టం చేసింది. మహారాజా హరిసింగ్ ఇందుకు ఆమోదించాడు.
సరిగ్గా ఇక్కడే తెల్లవాడు మోకాలు అడ్డుపెట్టాడు. అప్పుడు భారతదేశానికి గవర్నరు - జనరల్ గా వున్న (భారత్ అప్పటికి రిపబ్లిక్ కాలేదు.) లార్డ్ మౌంట్ బాటెన్ ఇలా విలీనానికి ఒక వైపు అంగీకరిస్తూనే, మరొకవైపున - అట్టి ఒప్పందంలో మాత్రం - కాశ్మీర్ ప్రజల అభీష్టాన్ని తెలుసుకున్న పిదపనే విలీనం విషయం నిర్ధారించవలసి వుంటుంది అంటూ షరతుపెట్టాడు. శిఖండి కుటిల దౌత్యం నెరిపాడు!
కారణాలు ఏమైతేనేమి కాశ్మీర్ ప్రజల అభీష్టం తెలుసుకోవడం (రిఫరెండం) నేటికీ జరగనే లేదు!
భారతదేశంలో కాశ్మీర్ విలీనం అయ్యీఅవ్వగానే కేంద్రప్రభుత్వం తన సేనను నడిపి కాశ్మీర్ లో పాక్ ఆక్రమణదారులను తరిమికొట్టింది. ఏడాదికిపైగా సాగిన ఆ పోలీస్ చర్య చివరకు 1949 జనవరి ఒకటవ తేదీన కాల్పుల విరమణతో ముగిసింది.
జమ్ము-కాశ్మీర్ లోని మొత్తం 86,500 చదరపుమైళ్ళ విస్తీర్ణంలో 33 వేల చదరపుమైళ్ళ భూమిని పాకిస్తాన్ ఆక్రమించింది. అదే నేటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (pok). మిగిలిన జమ్ము, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత భూ భాగాలుగా మిగిలాయి.
1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినపుడు, 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా కూడా కాశ్మీర్ ముస్లిమ్ లు తమకుతాము భారతీయులుగానే భావించి భారతదేశానికి మద్దతు పలికారు. వేర్పాటు భావననే కనబరచలేదు.
అటువంటి జాతీయతా భావాలుగల కాశ్మీరీలు ఇప్పుడు 'స్వతంత్ర కాశ్మీర్' కావలెనని ఎందుకు అంటున్నారు అనేదే ప్రశ్న! అందుకు కారణాలు సవాలక్ష లేకపోలేదు.
సరిహద్దులకు ఆవల కాశ్మీరాన్ని కాజేయవలెనని పొంచివున్న పాకిస్తాన్ కాశ్మీరీలలో చిమ్ముతున్న విషం ఇందుకు ముఖ్యకారణాలలో ఒకటి. 80 కోట్ల జన సంఖ్యగల భారతీయుల పాలనలో కాశ్మీరుకు న్యాయం జరగదని పాకిస్తాన్ పనిగట్టుకుని దివారాత్రాలు ప్రచారం చేస్తున్నది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల పలికిన అపశ్రుతులను గోరంతలు కొండంతలుగా ఎత్తి చూపుతూ కాశ్మీరీల మనసులను కలుషితం చేస్తున్నది.
అసంతృప్తిదారులైన కొందరిని చేరదీసి, వారికి సైనిక-గొరిల్లా పోరాటాలలో శిక్షణ నిచ్చింది పాకిస్తాన్. మారణాయుధాలను అందించి, 'ఊఁ! చూస్తారేం - ఇక మీ ఇష్టం!' అంది.
ఫలితంగా నేడు కాశ్మీర్ లో 150కి మించి గొరిల్లా బృందాలు వున్నాయి! ప్రతి గ్రామంలోను గొరిల్లాలు లేదా మిలిటెంట్లు వున్నారు. యువకులు 'ఎకె 47' వంటి ఆధునిక ఆయుధాలను చేతపట్టుకు నిలిస్తే, దానిని చోద్యంగా చూస్తున్నారు - మహిళలు, పిల్లలు.
1964 నుంచి 'ఆజాద్ కాశ్మీర్' కోసం సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న 'జమ్ము - కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్' (జె.కె.ఎల్.ఎఫ్.)పట్ల అక్కడివారు సానుభూతిని ప్రదర్శిస్తున్నారు. కాశ్మీర్ స్వతంత్రదేశంగా ఆవిర్భవించవలెనని, అక్కడ ఇస్లామిక్ రాజ్యాంగ పాలనను ప్రవేశపెట్టవలెనని ఈ ఫ్రంట్ కలలుగంటున్నది.