వచ్చిన జట్టులో నుంచి, మంజు ఎయిర్ బ్యాగ్ ను మాయం చేసిన ఆగంతకుడు ముందుకు వచ్చాడు. బేగ్ ను అందించాడు నవ్వుతు. బేగ్ లోని సామాగ్రిని ఒకసారి చూస్తూ సర్దుకుంది.
"గుడ్! నీ బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తించావు. ఇహ, ఇక్కడ నుంచి నిరభ్యంతరంగా మన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు!" ఉత్సాహంగా అన్నది మంజు.
సరిగ్గా అదే సమయానికి అభిషేక్ ఆడుతున్న టెన్నిస్ కోర్టుకు చేరుకుంది అపర్ణ.
అభిషేక్ మరొకరితో హోరాహోరీ సింగిల్స్ ఆడుతున్నాడు. బనియను, నిక్కరు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. అతని ధ్యాసంతా బంతిమీదే వుంది. అపర్ణను అతను గమనించనేలేదు.
తృప్తిగా వెనుదిరిగింది అపర్ణ. ఇప్పుడు ఆ పిల్లలిద్దరి నడకమీద, నడత మీద, వర్తనమీద, ప్రవర్తనమీద ఆమె మనసులో ఎటువంటి అనుమానాలు లేవు, ఏ విధమయిన అభ్యంతరాలు లేవు!
ఆ నమ్మకమే ఆమె పట్టు నుంచి వాళ్లు జారిపోవడానికి నాంది అయింది...
* * *
'అగర్ ఫిర్దౌస్ బర్ రూమే జమీన్ అన్త్
హమ్ ఆస్త్ ఓ హవా అస్త్ ఓ హవా అస్త్'
'భూమి మీద స్వర్గం అనేది ఏదైనా వుంటే
అది ఇదే అది ఇదే!'
పదిహేడవ శతాబ్దంలో మొఘలాయ చక్రవర్తి జహంగీరు చెప్పిన మాటలు.
కాశ్మీరు గడ్డమీద కాలు మోపిన వారందరికీ ఆ మాటలు అక్షర సత్యమేనని అనిపించేవి - సుమారు దశాబ్ది క్రితం వరకు.
మరీ కడచిన దశాబ్ది కాలంగా అక్కడ 'కలికాలం' రాజ్యమేలుతున్నది! పరిస్థితులు క్షణక్షణానికీ దారుణాతి దారుణంగా మారిపోతున్నాయి.
ఇప్పుడు యావత్తు కాశ్మీరంలో ఏ వీధిలో ఎక్కడ ఎప్పుడు ఏ నలుగురు చేరినా వారి మధ్య భయం తాండవిస్తున్నది. ప్రాణభీతి తొంగిచూస్తున్నది.
బొమ్మ తుపాకులు ఉండవలసిన పిల్లల చేతులలో నేడు ఆటోమాటిక్ రైఫిళ్లు వ్రేలాడుతున్నాడు. బాంబులు చేతిబంతులు అయ్యాయి.
నీలి నీలి నీటి ప్రవాహాలలో మానవ కళేబరాలు కొట్టుకువస్తున్నాయి.
పులుకడిగిన ఆణి ముత్యాలుగా కొంగ్రొత్త సోయగాలతో మెరిసిపోయే యువతుల మాన- ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది.
ఒకనాటి భూతల స్వర్గమే ఈనాడు భూలోక నరకం అనిపిస్తున్నది.
భారతావనికి మకుటాయమానమైన రత్న కిరీటం వంటిది కాశ్మీరం. అటువంటి నేలతల్లి గుండెలమీదే నేడు నెత్తురుటేరులు పారుతున్నాయి.
భారత ప్రజ తీరని వ్యధ కాశ్మీరం. అనుమానాలు అపోహల గూడు కాశ్మీరం.
మంచుతో నిండిన హిమాలయ శిఖరాగ్రాలను చూస్తూ, ఆ శీతనగ సానువుల నుంచి జాలువారే సెలయేటి గలగలలలో విహారాలు చేస్తూ ఆహ్లాదాలను ఆస్వాదించడం ఒక తీయ తీయటి కల. ఆ కల ఇప్పుడు చెదిరిపోతున్నది.
కాశ్మీరు కల్లోలం నేడు యావత్ ప్రపంచాన్ని కలవరపరుస్తున్నది. కుదిపివేస్తున్నది.
కాశ్మీర్ లోయ విస్తీర్ణం సుమారు రెండు వేల అయిదు వందల చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు నలభై లక్షలకు పైమాట. కాని...కాని...
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇప్పుడు అక్కడ జరుగుతున్న సాయుధ పోరాటం ప్రభావాన్ని చవిచూడని కుటుంబం అంటూ ఒక్కటి కూడా లేదనడం అతిశయోక్తి కాదు!
కాశ్మీరీ మిలిటెంట్లలో చేరి 'ఆజాద్' కోసం 'షహిద్' కాదలచిన వారో, మిలిటెంట్ల బాధలకు బలయినవారో; భారత సైనిక దళాల అత్యుత్సాహపు చర్యలకు ఎరైనవారో ప్రతి ఇంటికి కనీసం ఒక్కరయినా ఉండవచ్చు.
కాశ్మీరు లోయలో ఒకప్పుడు 94శాతం మంది ముస్లిమ్ లు ఉండేవారు. ఇప్పుడు నూటికి నూరు శాతం వారే! అంటే...అంటే...
హిందూ కాశ్మీరీలంతా బ్రతుకు జీవుడా అనుకుంటూ కాశ్మీరును వదలి జమ్ముకు చేరిపోయారు. వలసపోయారు...
స్వదేశంలో, స్వరాష్ట్రంలో, సొంత నేలమీదే వాళ్ళు శరణార్దులై ప్రాణాలను ఉగ్గబెట్టుకు బ్రతుకుతున్నారు. చావలేక బ్రతుకుతున్నారు.
తీవ్రవాదులు 'మేం కోరేదేమీ లేదు' మమ్ము గుర్తించమని తప్ప మరేమీ అడగడం లేదు!' అంటున్నారు. ఆ గుర్తింపు' కోసం ఊచకొత్త.
మితవాదులు 'కాశ్మీర్ కు స్వాతంత్ర్యం వినా వేరేమీ అక్కరలేదు!' అని స్పష్టం చేస్తున్నారు. స్వతంత్ర కాశ్మీర్ కోసం ప్రాణాలయినా ధారపోస్తాం, దశాబ్దాల తరబడి పోరాటాన్ని కొనసాగిస్తాం!' అనేది వారి నినాదం.